ఉత్తినే అలంకరించుకోండి...

మీరు అందరి పనులూ ఎంత బాధ్యతగా, సక్రమంగా నిర్వర్తిస్తారో కుటుంబ సభ్యులు కూడా మీ పట్ల అంతే శ్రద్ధాసక్తులు చూపేలా అలవాటు చేయండి. మీ గురించి మీకే శ్రద్ధ లేకపోతే ఇతరులు ఎలా చూపుతారు చెప్పండి! ఆశించడం, అడగటం మానేస్తే అవతలి వారికి అదే అలవాటైపోతుందని గుర్తుంచుకోండి.

Updated : 01 Nov 2022 17:01 IST

మండే ఎండల్నీ, మంచు కొండల్నీ కూడా సహించే నేలతల్లితో పోల్చారు మహిళల్ని. ఓర్పుగా, నేర్పుగా ఉండటం గొప్ప సంగతే. కానీ బాధాకరమైన సంగతేమంటే ఎక్కువ శాతం స్త్రీలు కుటుంబం కోసం తాపత్రయ పడుతున్నారే కానీ తమ గురించి తాము పట్టించుకోవడం లేదని అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో సొంత జాగ్రత్త కూడా అవసరమేనంటూ, అందుకేం చేయాలో చెబుతున్నారు సైకాలజిస్టులు. అవేంటో చూసి పాటించేయండి...

* మీరు అందరి పనులూ ఎంత బాధ్యతగా, సక్రమంగా నిర్వర్తిస్తారో కుటుంబ సభ్యులు కూడా మీ పట్ల అంతే శ్రద్ధాసక్తులు చూపేలా అలవాటు చేయండి. మీ గురించి మీకే శ్రద్ధ లేకపోతే ఇతరులు ఎలా చూపుతారు చెప్పండి! ఆశించడం, అడగటం మానేస్తే అవతలి వారికి అదే అలవాటైపోతుందని గుర్తుంచుకోండి.
* భర్త, పిల్లల కోసం కోరిన వంటలన్నీ చేసి పెట్టే ఇల్లాలు తన కోసం కాఫీ పెట్టుకోవాలన్నా ఓపిక లేదని మానేయడం, చాలా సార్లు ఇంట్లో అందరూ తినగా మిగిలింది తినడం కద్దు. కానీ మీ ఇష్టాయిష్టాలు కూడా ముఖ్యమైనవేనని, వాటికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించండి. మీ గురించి కూడా ధ్యాస పెట్టండి. జిహ్వ చాపల్యాన్ని అణిచేసుకోవద్దు. ఇష్టమైనవి తింటుండండి. అలాగే శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు.

* సాయంత్రమో రాత్రివేళో ఓ అర గంట ధ్యానం చేయండి. లేదా సరదాగా కుట్లు, అల్లికలు, బొమ్మలు వేయడం, నృత్యం చేయడం, కవితలు రాయడం చేయండి. అవేవీ కాకుంటే మీకు అత్యంత ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడండి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.

* ఒక్కోసారి ఏ వేడుకా లేకున్నా, ఎక్కడికీ వెళ్లనవసరం లేకపోయినా చక్కగా అలంకరించుకుని ఫొటోలు దిగండి. ముస్తాబుకు కారణాలు అవసరం లేదంటూ స్టేటస్‌ పెట్టి చూడండి. సరదా జవాబులు వచ్చి ఆనందాలు నింపుతాయి.

* ఇంటా బయటా తీరిక లేదంటూ సాకులూ సమర్థింపులూ లేకుండా కనీసం అరగంటయినా వ్యాయామం చేయండి. అది పునరుత్తేజానిస్తుంది.

* నిర్విరామంగా పని చేస్తే త్వరగా అలసిపోతారు. మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటే ఆందోళనలు దరికి చేరవు.

* వేళకు తిండి, ఆనక వ్యాయామం ఎంత అవసరమో, ఏడెనిమిది గంటల నిద్ర కూడా అంతే అవసరం. ఈ మూడూ సవ్యంగా ఉంటే ఆరోగ్యాలూ ఆనందాలూ మీ సొంతమైనట్టే. కనుక నిద్రను ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయొద్దు. ఈపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీరిక హాయిగా ఉన్నట్టే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్