సర్వం పండించేయొచ్చు...

మొక్కల్ని చూస్తే ముచ్చటేస్తుంది కదూ! కాసిని నీళ్లు పోస్తే చాలు.. పూలూ ఫలాలూ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తాయి. పెరడుంటే బాగుండేది... అపార్ట్‌మెంట్లలో ఎలా అంటారా?! మరేం పరవాలేదు కుండీల్లో పెంచండి.. ఎందరెందరో మిద్దె తోటలతో అద్భుతాలు చేస్తున్నారు. ముందు కాసిని మొక్కలతో ఆరంభించేయండి. అందుకోసం ఏం చేయాలంటే...

Published : 03 Jun 2022 00:54 IST

మొక్కల్ని చూస్తే ముచ్చటేస్తుంది కదూ! కాసిని నీళ్లు పోస్తే చాలు.. పూలూ ఫలాలూ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తాయి. పెరడుంటే బాగుండేది... అపార్ట్‌మెంట్లలో ఎలా అంటారా?! మరేం పరవాలేదు కుండీల్లో పెంచండి.. ఎందరెందరో మిద్దె తోటలతో అద్భుతాలు చేస్తున్నారు. ముందు కాసిని మొక్కలతో ఆరంభించేయండి. అందుకోసం ఏం చేయాలంటే...

* మట్టి, ప్లాస్టిక్‌, సిమెంటు కుండీలు వివిధ సైజుల్లో తీసుకోండి. అడుగున రంధ్రం ఉన్నవాటినే ఎంచుకోండి. వాటిల్లో సారవంతమైన మట్టిని నింపండి. కాస్త పెద్ద వాటిల్లో వంగ, బెండ, గోరుచిక్కుడు లాంటి మొక్కల్ని, మధ్యస్తం వాటిల్లో మల్లె, గులాబీ కనకాంబరం, మందారం లాంటి పూలమొక్కల్ని, చిన్నవాటిల్లో తోటకూర, పుదీన, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు లాంటి ఆకుకూరల్ని నాటండి. నాలుగైదు సిమెంటు తొట్లలో పొట్ల, చిక్కుడు, కాకర, సొర, దోస లాంటి తీగల్ని నాటొచ్చు.

* మీరు కాస్తంత శ్రద్ధ పెట్టాలే గానీ ఉల్లి, కంద, పెండలం.. ఇలా దేన్నయినా ఇంట్లోనే పండించేయొచ్చు. కుండీల్లో కూరగాయలే కాదు, పుచ్చ, కర్బూజాల్లాంటివి కాయిస్తున్న వారెందరో ఉన్నారు. బోన్సాయ్‌ కాదండోయ్‌.. మామూలువే! మట్టి మాత్రం దిమ్మెస కొట్టినట్టు కాక ఎప్పటికప్పుడు గుల్లగుల్లగా ఉండేట్లు చూసుకోండి.

* నీళ్లు కుమ్మరించినట్లు కాక చిలకరిస్తున్నట్లుగా పోయండి. అంత తీరిక, ఓపిక లేదంటారా... దానికీ మార్గముంది. నీళ్ల ట్యాపుకు తగిలించిన పొడవాటి పైపును కుండీల మీదుగా అమర్చండి.  పైపు రెండోవైపున మూసేయండి. ఒక్కో కుండీ దగ్గర సన్నటి రంధ్రం చేయండి. సుమారు ఒక అరగంటసేపు సన్నగా పంపు తిప్పి కుండీల్లో నీరు చేరాక కట్టేయొచ్చు.

* మనకి చిన్న చిన్న అనారోగ్యాలు చేసినట్లే మొక్కలకీ తెగుళ్లు వస్తుంటాయి. వాటికి విరుగుడుగా పురుగు మందులు వాడేకంటే వేపాకు పొడిని నీళ్లలో కలిపి ఆకులమీద జల్లితే సరిపోతుంది. పులిసిన మజ్జిగనూ చల్లొచ్చు.

* మొక్కలు ఏపుగా పెరగడానికి కూడా రసాయన ఎరువులకు బదులు కూరగాయల తొక్కు, ఉల్లిపాయ పొట్టు వేస్తే సరి. ఇంట్లోనే పండించుకున్నామన్న తృప్తితోబాటు, అవి సేంద్రియమన్న ఆనందమూ జత చేరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్