Updated : 26/06/2022 04:48 IST

ఇలా చేసి చూడండి

ఇళ్లల్లో సాధారణంగా వంట, ఇంటి పనంతా ఇల్లాలిదే. కనుక మిగిలిన వాళ్లకు వాటి గురించి పట్టదు. ఆవిడ ఆఫీసుకు వెళ్లినప్పుడు ఏ వస్తువు కావాలన్నా భర్త లేదా పిల్లలు ఫోన్‌ చేసి అడుగుతుంటారు. ఇక అత్యవసరమై ఊరెళ్లిందో వాళ్ల అవస్థలు మామూలుగా ఉండవు. ఈ నేపథ్యంలో వస్తువులన్నీ ఇంట్లో అందరికీ తెలిసేలా అమర్చుకోవడం అవసరం.

* వంటింటి కబోర్డ్స్‌లో పంచదార, టీ పొడి, కాఫీపొడి లాంటివి స్టవ్వుకు దగ్గరగా ఉన్న అరలో ఎదురుగా కనిపించేలా ఉంచండి. కూరలకు అవసరమైన నూనె, ఉప్పు, కారం, కందిపప్పు, ఇతరత్రా దినుసులు మరో అరలో అమర్చండి. అరుదుగా అవసరమయ్యే సరుకులు వెనుకవైపు సర్దండి. వీటి స్థలం మార్చొద్దు. ఎప్పుడూ ఒకేచోట ఉంటే రోజూ వంటింటి ముఖం చూడని పిల్లలకు కూడా తేలిగ్గా దొరుకుతాయి.

* యూట్యూబ్‌లో కొత్తరకం వంటకం చూసిన కొడుకు అర్జంటుగా దాన్ని చేసుకుని తినాలనుకుని ఒక్కో వస్తువు కోసం మళ్లీ మళ్లీ ఫోన్లు చేస్తాడు తల్లికి. పిండి, రవ్వ, నెయ్యి లాంటివన్నీ ఒక దగ్గర ఉంటే చెప్పడమూ, తీసుకోవడమూ కూడా తేలికవుతుంది.

* తన స్నేహితురాలు ఇంటికి వచ్చిందని వెంటనే దుప్పటి మార్చేయాలనుకుంటుంది కూతురు. తల్లికి ఫోన్‌ చేసి ఉతికినవన్నీ ఎక్కడున్నాయని అడుగుతుంది. వాటినెప్పుడూ వార్డ్‌రోబ్‌లో అడుగు అరలోనే పెడుతుంటే ఎవరికీ అడగాల్సిన అవసరం ఉండదు. మంచానికి అండర్‌ స్టోరేజ్‌ బాక్స్‌ అమర్చుకుంటే అదనంగా ఉన్న దిండ్లు, దుప్పట్లు అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు. ఎదురుగా అడ్డంగా అనిపించవు, ఎవరికీ వెతుక్కునే శ్రమ ఉండదు.

* దువ్వెన్లు, అద్దాలు, క్రీములూ లోషన్లూ లాంటి బ్యూటీ సామగ్రి డ్రెస్సింగ్‌ టేబుల్‌ సొరుగుల్లో సరిపడకుంటే పక్కనున్న అరల్లో ఎదురుగా కనిపించేలా సర్దేయండి. ఎవరికైనా తేలిగ్గా దొరికేస్తాయి. అలాగే పెన్నులూ కాగితాలూ, పుస్తకాలూ లాంటి స్టేషనరీ వస్తువులు ముందుగది అల్మరలోనే సర్దండి. ప్లగ్గులు, వైర్లు, బల్బులు లాంటి ఎలక్ట్రికల్‌ సామగ్రి అరుదుగా తప్ప అవసరం ఉండదు కనుక వాటిని ఒక ట్రేలో ఉంచి, అటక మీద ముందు వరుసలో పెట్టండి. ఏ వస్తువులు ఎక్కడుండేదీ అందరికీ చెప్పి, తెలిసేలా అమర్చితే అందరికీ సులువుగా ఉంటుంది.

* సాధారణంగా నెలకూ రెండు నెలలకూ సరుకులు తెచ్చుకున్నా ఒక్కోసారి కొన్ని ముందే అయిపోవడం కద్దు. అలా నిండుకున్నప్పుడు వంటింట్లో తగిలించిన చార్టు మీద వెంటనే రాస్తే ఎవరు గమనించినా బయటకు వెళ్లినప్పుడు వాటిని తెచ్చేస్తారు. ఎవరికీ ఇబ్బంది ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని