దుర్వాసనను దూరం చేస్తాయి..

స్నానాలగది ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. పైగా వర్షాకాలంలో వాతావరణంలో తేమతో తడి ఆరక... ముక్క వాసన ఇబ్బంది పెడుతుంది. కొన్ని రకాల ఇండోర్‌ మొక్కలను ఈ గదిలో పెంచితే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు. అవేంటో చూద్దాం.

Updated : 24 Jul 2022 05:31 IST

స్నానాలగది ఎప్పుడూ చెమ్మగా ఉంటుంది. పైగా వర్షాకాలంలో వాతావరణంలో తేమతో తడి ఆరక... ముక్క వాసన ఇబ్బంది పెడుతుంది. కొన్ని రకాల ఇండోర్‌ మొక్కలను ఈ గదిలో పెంచితే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ నిపుణులు. అవేంటో చూద్దాం.

ఆర్కిడ్స్‌.. తక్కువ వెలుతురుండే చోట పెంచగలిగే మొక్కల్లో ఆర్కిడ్స్‌ ఒకటి. ఇది చుట్టు పక్కల వాతావరణాన్ని పొడిగా ఉంచడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతుంది. ఉదయం నిద్రలేచాక వర్ణభరితమైన వాటి పూల పలకరింపు మనసును ఆహ్లాదంగా మారుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. రాత్రి అలసిన మనసుకు ఇవి ప్రశాంతతనిస్తాయి. వెంటిలేటర్‌ వద్ద ఆర్కిడ్స్‌ మొక్క తొట్టెనుంచితే చాలు. ఈ మొక్క తేలికగా ఎదుగుతుంది.
వెదురు.. లక్కీ బాంబూ అని పిలిచే ఈ మొక్క ఇండోర్‌కు సరైన ఎంపిక. మట్టి అవసరం లేకుండా నీటిలోనే ఎదిగే ఈ మొక్క స్నానాలగదిని పచ్చదనంతో నింపుతుంది. వాతావరణాన్ని పరిశుభ్రంగా మారుస్తుంది. అలాగే మనీ ప్లాంట్‌నిని ఈ గదిలో అమర్చుకోవచ్చు. నీరు అంతగా అవసరం ఉండదు. ఎండ లేకున్నా ఇట్టే చిగురిస్తుంది. ఎక్కువ ఆకులతో, వాతావరణంలోని బెంజిన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ వంటివాటిని దూరం చేసి కాలుష్యరహితంగా మార్చేస్తుంది. దుర్వాసన లేకుండా చేస్తుంది.

స్పైడర్‌ప్లాంట్‌.. తక్కువ వెలుతురులోనూ సునాయసంగా ఎదిగే ఈ మొక్క చుట్టుపక్కల వాతావరణంలోని ఫార్మాల్‌డిహైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి టాక్సిన్స్‌ను పారదోలగలదు. దీన్ని స్నానాలగదిలో వేలాడే తొట్టెలో లేదా సింకు పక్కన ఉంచినా చాలు. అలాగే పీస్‌లిల్లీ చూడటానికీ.. అందంగా ఉంటుంది. మెరిసే ఆకులు, తెల్ల పూలతో మనసును ఆహ్లాదంగా మార్చేయగలదు. ఈ ఆకులు పర్యావరణాన్ని కాపాడతాయి. వాతావరణంలోని అమ్మోనియా, ఫార్మాల్‌డిహైడ్‌, బెంజిన్‌ వంటి టాక్సిన్లను తొలగిస్తాయి. వాతావరణాన్ని పరిశుభ్రంగా మారుస్తాయి.

ఫెర్న్‌.. బోస్టన్‌ ఫెర్న్‌, కలబంద వంటి మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ఇవి వాతావరణాన్ని తాజాగా ఉంచగలవు.  తక్కువ స్థలం చాలు. స్నానాలగదిలో వీటి తొట్టెలను ఓ మూల అమర్చితే చాలు. వీటికి సూర్యరశ్మి ఎక్కువ అవసరం ఉండదు. ఫెర్న్‌ మొక్క ఆకులు గుబురుగా పెరిగి గదిని పచ్చగా మార్చడమే కాకుండా   వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. వీటన్నిటివల్లా స్నానాలగదిలో దుర్వాసనా దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని