ఇల్లంతా పరిమళభరితం

బయటి వాతావరణం చెమ్మగా ఉన్నప్పుడు ఇంట్లోనూ దుర్వాసన మొదలవుతుంది. అందుకే సీజన్‌కు తగినట్లుగా గదులన్నింటినీ పరిమళభరితం చేసుకోవాలి.వంటింటి నుంచి మొదలుపెడితే.

Published : 29 Jul 2022 01:19 IST

బయటి వాతావరణం చెమ్మగా ఉన్నప్పుడు ఇంట్లోనూ దుర్వాసన మొదలవుతుంది. అందుకే సీజన్‌కు తగినట్లుగా గదులన్నింటినీ పరిమళభరితం చేసుకోవాలి.

వంటింటి నుంచి మొదలుపెడితే... ముందుగా వ్యర్థాలు వేసే చెత్తడబ్బాను ఏరోజుకారోజు ఖాళీ చేయాలి. లేదంటే బయట వాతావరణం తడిగా ఉన్నప్పుడు వ్యర్థాల దుర్వాసన మరింత వేగంగా ఇల్లంతా వ్యాపిస్తుంది. రోజూ ఆ డబ్బాను ఖాళీచేసి తాజా కవరు వేస్తూ ఉండాలి. వంటింటి దిమ్మ, పొయ్యి వద్ద చెమ్మ లేకుండా ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా జాగ్రత్తపడాలి.

పీల్చుకొని..

ఫ్రిజ్‌లో ఉంచే ఆహారపదార్థాలు, కూరగాయల కారణంగా తలుపు తీయగానే అన్నీ కలిపిన వాసన బయటకొచ్చి ఇల్లంతా వ్యాపిస్తుంది. ఫ్రిజ్‌ లో ఓ మూల గిన్నెలో వంటసోడా లేదా నిమ్మ చెక్కను ఉంచితే దుర్వాసనను పీల్చుకుంటాయి. బయట వర్షం కురుస్తున్నప్పుడు ఇంట్లోని కార్పెట్‌, రగ్గు వంటి వాటి నుంచి చెమ్మవాసన వస్తుంది. రెండు చెంచాల వంటసోడాకు ఏదైనా ఎసెన్షియల్‌ నూనె కలిపి వీటిపై రాత్రి చిలకరించి వదిలేయాలి. తెల్లారేసరికి వాసన మాయమవుతుంది.

తాజాగా..

ఈ సీజన్‌లో మధ్యాహ్నం కిటికీలు తీసి ఉంచాలి. లోపల ఉన్న చెమ్మ బయటకు పోతుంది. కిటికీలూ తలుపులూ మూసి ఉంటే వంటింటి వాసనలు ఇల్లంతా వ్యాపించి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎయిర్‌ ప్యూరిఫయర్‌లో నాలుగైదు చుక్కల లెమన్‌గ్రాస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి ప్లగ్‌ అమర్చితే చాలు. ఇల్లంతా తాజా సువాసనలతో నిండిపోతుంది. పెంపుడు జంతువులుంటే... రోజూ రెండు చెంచాల వంట సోడాకు రెండు కప్పుల డిస్టిల్డ్‌ వాటర్‌, 10 - 12 చుక్కల పెట్‌ సేఫ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి దాని బెడ్‌పై స్ప్రే చేయాలి. వాసన పోతుంది.

పూలవాసనతో..

దళసరి తువ్వాళ్లను ఇంట్లో ఆరబెట్టకూడదు. వీటి నుంచి వచ్చే వాసన ఇల్లంతా వ్యాపించి ఇబ్బందిని కలిగిస్తుంది. వీటిని రెండు కప్పుల వెనిగర్‌ కలిపిన వేడి నీటిలో రాత్రంతా నాననిచ్చి, ఉదయం వాషింగ్‌ మిషన్‌లో వేయాలి. బాగా డ్రయర్‌ చేసి ఆరబెడితే దుర్వాసన దూరమవుతుంది. తడి బూట్లను ఆరనిచ్చి ర్యాక్‌లో సర్దడం, సాక్సు ఎప్పటికప్పుడు తీసి ఉతకడంతో దుర్వాసనను అరికట్టొచ్చు. హాల్‌ మధ్యలో టీపాయిపై డ్రై ఫ్లవర్స్‌ నింపిన బౌల్‌ ఉంచాలి. ఇందులో రెండు చుక్కల లెమన్‌, వెనీలా, లావెండర్‌, గంధం, పెప్పర్‌మెంట్‌ వంటి ఏదైనా ఒక ఎసెన్షియల్‌ ఆయిల్‌ను వేస్తే, ఇల్లంతా పూలపరిమళమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్