ఆర్థిక విషయాలు పట్టించుకుంటున్నారా?

ఇంటి బడ్జెట్‌ చక్కగా నిర్వహిస్తాం. ఇతర ఆర్థిక విషయాలకు మాత్రం దూరంగా ఉంటాం. ఉద్యోగినులలో కూడా చాలా మందిదీ ఇదే పరిస్థితి. ఈ పద్ధతే మంచిది కాదంటున్నారు నిపుణులు.

Published : 25 Aug 2022 00:21 IST

ఇంటి బడ్జెట్‌ చక్కగా నిర్వహిస్తాం. ఇతర ఆర్థిక విషయాలకు మాత్రం దూరంగా ఉంటాం. ఉద్యోగినులలో కూడా చాలా మందిదీ ఇదే పరిస్థితి. ఈ పద్ధతే మంచిది కాదంటున్నారు నిపుణులు.

* ఇంటి ఖర్చులే కాదు.. ఇతరత్రా పెట్టుబడులు, సేవింగ్స్‌ గురించీ అడిగి తెలుసుకోండి. మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా? దేశంలో ఇప్పటికీ దాన్ని తీసుకోవాలన్న సంగతే తెలియని మహిళలెందరో! దీనిలో చదువుకున్న వాళ్లూ ఉన్నారని ఓ సంస్థ అధ్యయనం చెబుతోంది. మీకంటూ ఓ ఖాతా తెరుచుకోండి. చిన్న చిన్న పెట్టుబడులను పెట్టుకోండి. ఇంటికే పరిమితమయ్యాం.. ఇవన్నీ తెలియదంటారా? అయితే సాయం తీసుకోండి. బ్యాంకు వాళ్లే సలహాలూ, సూచనలూ ఇస్తారు కూడా.

* ఏమీ తెలియదు.. అని కూర్చొంటే ఎప్పటికీ తెలుసుకోలేం. మొబైల్‌ ఉంటే ప్రపంచమంతా చేతిలో ఉన్నట్లే. ఆర్థిక విషయాలపైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు ఇప్పుడు సోషల్‌ మీడియాలో బోలెడుమంది. వాళ్ల సూచనలన్నీ పాటించాల్సిన పనిలేదు. కనీస అవగాహన తెచ్చుకోండి. పాఠాలు వింటున్నట్లుగా అన్నమాట!

* మగవారి కంటే ఆడవాళ్ల జీవిత కాలమెక్కువ. ఒకరి మీద ఆధారపడొద్దు అనుకున్నా పొదుపు మొదలుపెట్టేయండి. చూసుకునే వాళ్లు ఉండకపోతే, మంచం దిగలేకపోతే.. ఇంకా ఏమేం ఇబ్బందులుండొచ్చో అన్నింటినీ ఆలోచించుకోండి. అప్పుడూ అక్కరకొచ్చేలా రిటర్న్‌లతో లేదా నెలవారీ కొంత మొత్తం చేతికొచ్చేలా ప్లాన్‌ చేసుకోండి.

* ‘నా కోసం’ అనుకొని కొంత మొత్తం పక్కన పెట్టుకోండి. కొంత స్వార్థంగా అనిపిస్తోంది కదూ! కానీ అది తప్పు కాదంటున్నారు నిపుణులు. జీవితంలో ఏరోజు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. తీరా అత్యవసర సమయాల్లో ఏం చేయాలో తెలియక తికమక పడే మహిళలే ఎక్కువ. ఆ సందర్భాలు రావొద్దంటే నెలవారీ కొంత మొత్తం పక్కన పెట్టుకోండి. ఇంటి బడ్జెట్‌లో పొదుపు చేస్తారో, అడిగి తీసుకొని పక్కన పెట్టుకుంటారో.. ఎలాగైనా సరే.. దీన్నో నియమంగా పాటించండి. ఉద్యోగినులైతే జీతం వచ్చేరోజే కట్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు.

* డబ్బులన్నీ తీసుకొని వెళ్లి తెలిసిన వారి చేతుల్లో పెడుతుంటారు కొందరు. అందరూ మోసం చేయకపోవచ్చు. కానీ వాళ్లు ఏం చేస్తున్నారన్న అవగాహన మీకైతే ఉండదు కదా! అందుకే సలహా తీసుకోండి. ఏం చేసినా మీరే చేయండి. అకౌంట్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌లు వంటివి ఇచ్చి కూర్చొంటే.. తర్వాత మీరే బాధ పడాల్సి వస్తుంది. జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు.

* ఖర్చు, దాచినమొత్తం, తీసుకున్న అప్పు.. చిన్నదైనా పెద్దదైనా ఓ పుస్తకంలో రాసుకోండి. ఎవరికో తర్వాత ఉపయోగపడాలని కాదు.. మర్చిపోవడం మానవ సహజం. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా గుర్తురాదు. అనవసర కంగారు. కాబట్టి, అన్నీ ఓ చోట రాసి ఉంచుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్