సౌభాగ్యమిచ్చే విఘ్నేశ్వరి!
వైనాయకి.. విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని.. పొరపాటున అనడం లేదు! స్త్రీరూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపుర్, భువనేశ్వర్‌లలో స్త్రీలు సర్వసంపదలనిమ్మని వైనాయకి వ్రతం చేస్తుంటారు..పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు
వైనాయకి.. విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని.. పొరపాటున అనడం లేదు! స్త్రీరూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపుర్, భువనేశ్వర్‌లలో స్త్రీలు సర్వసంపదలనిమ్మని వైనాయకి వ్రతం చేస్తుంటారు..
పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు. తనకంటూ నాయకుడు లేని, తానే లోక నాయకుడైన వినాయకుడు సర్వ స్వతంత్రుడు. 108 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ 8 రూపాలతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. తొండం ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి. వినాయకుడు తన అంశేనని, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనంది ఆదిపరాశక్తి. అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రీ గణపతిగా పూజిస్తున్నాం. ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలూ ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పార్వతీమాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు. హంపీలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ‘అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..’ తరహాలో తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి.
లోకాన్ని అల్లకల్లోలం చేయమని..
తల్లి మాట మేరకు తండ్రినెదిరించి ప్రాణాలు కోల్పోయాడు చిన్నిగణపతి. పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, బగళ, ఛిన్నమస్త, ధూమవతి, మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి. అంతే! ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు. తట్టుకోలేక విష్ణ్వాది దేవుళ్లందరూ పార్వతిని స్తుతించి, ప్రసన్నం చేసుకుని, ఏనుగు తలను తెచ్చి, బాలునికి అతికించి, మళ్లీ బతికించారు. అదీ స్త్రీశక్తి. అదీ మాతృశక్తి, పురుషులంతా కలిసినా ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక దాసోహమన్నారు. ఆ తల్లిని సంతోషపెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి, గణాధిపత్యాన్ని కట్టపెట్టాడు. తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుంది. అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి..
తల్లిదండ్రుల పదోదకము బోలంగ వే
దాకాశ గంగా మహాజలంబు
మాతా పితలతో సమానత గనజాల
రఖిల గీర్వాణ చూడాగ్రమణులు
అంటూ వారి విలువను లోకానికి తెలియచేశాడు. ‘అమ్మ కడ సౌభాగ్యమడిగి మాకీయవా దేవాదిదేవా’ అని స్త్రీలు వినాయకుని వేడుకుంటున్నారు.
పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్ని, సంపదని, విద్యను, మంత్రవిద్యను, జవసత్వాలను అందిస్తున్నాడు. గణపతి స్త్రీ పక్షపాతి. అందుకే స్త్రీ దేవతా మూర్తులతో కూడి స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు.
సంపదలిచ్చే వైనాయకి
వినాయకునిది పృథ్వీ తత్త్వం. భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు. అందుకే గణపతిని మట్టిరూపంలో పూజించమని, పంట ఫలం, ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది శాస్త్రం.
వినాయకుడు పంచముఖుడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ మహాభూతాలు, పంచ కోశాలు, పంచ తన్మాత్రలే ఆ పంచ ముఖాలు.
ఓంకార మాద్యం ప్రవదన్తి సన్తో
వాచః శ్రుతీనామపి యం గృణన్తి
గజాననం దేవ గణానతాంఘ్రి
భజే హ మర్దేన్దు కృతావతంసం
విఘ్నాలను కలిగించేదీ, నివారించేది కూడా వినాయకుడే. త్రిమూర్తుల, త్రిమాతల, సకల దేవతల, అష్ట దిక్పాలకుల, నవగ్రహాల పూజలందుకునే ఆదిపూజ్యుడు గణపతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.