మిద్దెతోట కోసం..
సరళ పక్కింటామెను చూసి మిద్దెతోట ప్రారంభించింది. ఇంటికి కావాల్సిన కూరగాయ లన్నింటినీ పండించుకోవచ్చు అని సరదాపడింది. కానీ మూడునెలల్లో చాలా మొక్కలు చనిపోయాయి. మిద్దెతోట పెంపకానికి పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు...
సరళ పక్కింటామెను చూసి మిద్దెతోట ప్రారంభించింది. ఇంటికి కావాల్సిన కూరగాయ లన్నింటినీ పండించుకోవచ్చు అని సరదాపడింది. కానీ మూడునెలల్లో చాలా మొక్కలు చనిపోయాయి. మిద్దెతోట పెంపకానికి పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు...
మిద్దెతోట ఆరోగ్యంగా పెరగాలంటే సీజన్లకు తగిన మొక్కలను ఎంపిక చేసుకోవాలి. ముందు మీరు ఎక్కువగా వాడే కూరగాయలతో మొదలుపెట్టాలి. తక్కువ నిర్వహణ, మొక్కను బట్టి ఇరుకు లేకుండా ఎదిగేలా తొట్టెలు ఎంచుకోవాలి. అదనపు నీరు బయటికి పోయేలా వాటికి రంధ్రాలుండాలి. అన్ని మొక్కలకూ రోజూ నీరు అవసరం ఉండదు. మట్టి తేమగా కనిపిస్తే పోయవద్దు. ఇంకా అనుమానం వస్తే వేలు గుచ్చి చూడండి.
విభజించి..
వారానికొకసారైనా తొట్టెలను ఒకవైపు నుంచి మరొకవైపు తిప్పాలి. ఒక్కోసారి మొక్కకి ఇరుకుగా ఉండి, ఆ కారణంగా కూడా మొగ్గలు చిన్నవిగా వస్తుంటాయి. ఇలా తిప్పడం వల్ల తిరిగి సాధారణ పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది. ప్రకటనలు చూసి రసాయనాలు కలిపిన ఎరువులను ఎంచుకోకూడదు. సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి. వంటింటి వ్యర్థాలు, ఎండిన ఆకులు, ఆవుపేడ వంటివి కలిపి తయారుచేసిన ఎరువునే వినియోగిస్తే మంచిది. మొక్కలను ఒకదానికొకటి మరీ దూరంగా కాకుండా దగ్గరదగ్గరగా పెంచాలి. కూరగాయల తోటకు సమీపంలో పరాగసంపర్కం జరిగే పూల మొక్కలనుంచితే మంచి దిగుబడి ఉంటుంది. కూరగాయల్లో వంకాయలు, బెండ వంటివి కాకుండా బీర, సొర, దోసకాయలకు పాదులు, ఆకుకూరలకు చిన్నచిన్న మడులను విభజిస్తే పెంపకం సునాయాసమవుతుంది.
దినచర్యగా..
తోటను పెంచడంతోపాటు మొక్కలతో అనుబంధాన్ని పెంచుకోవాలి. రోజూ కాసేపు వాటి మధ్య తిరగాలి. రాలిన ఆకులు తీసేయాలి. క్రిమికీటకాలేమైనా చేరుతున్నాయా గుర్తించాలి. పురుగుపట్టిన కొమ్మలను ఏరాలి. వేరే ఏదైనా సమస్యలున్నాయా పరిశీలించడం దినచర్యగా చేసుకోవాలి. కూరగాయల మొక్కల మధ్య సుగంధ, ఔషధమొక్కలను పెంచితే మంచిది. అన్నింటికీ ఒకే రకమైన ఎరువులు కాకుండా, మొక్కలకు తగిన ఎరువు అందిస్తే ఎదుగుదల బాగుంటుంది. ప్రేమగా పెంచితే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.