గులకరాళ్లతో గదుల అందం..
గదుల అందాన్ని గులకరాళ్లతోనూ పెంచొచ్చు అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. డోర్‌మ్యాట్స్, డైనింగ్ మ్యాట్స్ అంటూ రకరకాల డిజైన్లలో సొంతంగా తయారుచేసే మ్యాట్స్ ఇంటికే ప్రత్యేకతను తెస్తాయంటున్నారు.
గదుల అందాన్ని గులకరాళ్లతోనూ పెంచొచ్చు అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. డోర్‌మ్యాట్స్, డైనింగ్ మ్యాట్స్ అంటూ రకరకాల డిజైన్లలో సొంతంగా తయారుచేసే మ్యాట్స్ ఇంటికే ప్రత్యేకతను తెస్తాయంటున్నారు.
గోడ వర్ణాలకు తగినట్లుగా ముందుగా గులకరాళ్ల రంగును ఎంచుకోవాలి. రబ్బరు ప్యాడ్స్ ఉన్న ప్లాస్టిక్ మెష్‌ను తీసుకోవాలి. దీనిపై రాళ్లను వరుసగా సర్దుతూ వాటర్‌ప్రూఫ్ గ్లూతో అంటించి ఆరనివ్వాలి. వాష్‌రూమ్స్ ముందు వీటిని వేస్తే తడికి కాళ్లు జారకుండా ఉంటాయి. చూడటానికి ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. పాదాల్లో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. మసాజ్ ప్రభావాన్ని అందించే వీటిని ఎకో మ్యాట్‌గానూ పిలుస్తారు. ఇటువంటి ప్రాంతంలో సాధారణంగా నలుపు, తెలుపు, లేత ఊదా వర్ణం రాళ్లు అందంగా ఇమిడిపోతాయి. ఈ రాళ్లను అతికించేటప్పుడు పూల డిజైన్లలో సర్దితే ఆ చోటుకే ప్రత్యేకతను తెస్తాయి.
భోజన బల్లపై..
డైనింగ్ మ్యాట్‌ను సమానపరిమాణంలో నాలుగు ముక్కలుగా కట్ చేయాలి. వీటిపై బూడిద, తెలుపు, లేత ఆకుపచ్చ వంటి లేతవర్ణం రాళ్లను అంటించి ఆరనిస్తే చాలు. కాఫీ, టీ కప్పులు, టీ కెటిల్‌సహా వంటపాత్రలనూ ఉంచుకోవచ్చు. ఈ పాత్రల వేడి డైనింగ్‌టేబుల్ క్లాత్‌పై పడకుండా ఉంటుంది. భోజనాల బల్లపై చూడటానికి కొత్తగానూ ఉంటాయి. అలాగే లంచ్‌ప్లేట్స్ కింద కూడా ఇలా తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు.
ముందుగదిలో..
హాల్‌లో నలువైపులా గోడ వద్ద వరుసగా వచ్చేలా.. గులకరాళ్లతో బోర్డరు డిజైన్‌ను తీర్చిదిద్దుకోవచ్చు. రబ్బరు ప్యాడ్స్ ఉన్న ప్లాస్టిక్ మెష్‌ను కావలసిన ఆకారంలో కట్‌చేసి దానిపై ఈ రాళ్లను వరుసగా వచ్చేలా అతికించాలి. ఆరనిచ్చి గదిలో నాలుగువైపులా సర్దితే చాలు. ఇందులో మూడునాలుగు రకాల రంగుల్లో రాళ్లను అద్దితే గదికే కొత్త కళను తెచ్చిపెడతాయి. గోడవారగా ఇండోర్ మొక్కల తొట్టెలనుంచి, వాటికింద ఇటువంటి గులకరాళ్ల మ్యాట్‌నుంచినా చాలు. గదికి రాయల్ లుక్‌ను తెస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.