ఆర్థిక పొరపాట్లు చేస్తున్నారా!

చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు... ఒకటేమిటి... అన్ని విషయాల్లో మగవాళ్లకి దీటుగా నిలుస్తున్నాం. మరి ఆర్థిక విషయాల సంగతేంటి? ఈ పొరపాట్లు చేయడం లేదు కదా!

Published : 20 Sep 2022 00:28 IST

చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు... ఒకటేమిటి... అన్ని విషయాల్లో మగవాళ్లకి దీటుగా నిలుస్తున్నాం. మరి ఆర్థిక విషయాల సంగతేంటి? ఈ పొరపాట్లు చేయడం లేదు కదా!

* బడ్జెట్‌.. కొలువులో చేరడంతోనే ఆర్థిక స్వేచ్ఛ వచ్చేస్తుంది. నచ్చినవన్నీ కొనేయడం, అడగ్గానే అందరికీ డబ్బులిచ్చేయడం వంటివి చేస్తున్నారా? మరి తర్వాతి అవసరాలకెలా? పైగా ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే సంపాదించిందంతా ఏమైందో కూడా తెలియదు. రూపాయి ఖర్చుపెట్టినా తప్పకుండా ఓ చోట నోట్‌ చేసుకోండి. ఎక్కడ ఎలా ఖర్చు చేశారన్న దానిపై అవగాహన ఉంటుంది.

* ఏం కొంటున్నారు? ఇంకొందరికి డబ్బు వృథా అవుతుందేమోనని భయం. దీంతో నగలు, ఇంట్లోకి వస్తువులంటూ కొనిపెట్టేస్తుంటారు. బంగారు నగలంటే సరే! తర్వాత అయినా విలువ వస్తుంది కాబట్టి ఫర్వాలేదు. మిగతా వస్తువేదైనా కాలపరిమితి ఉంటుంది. కొన్నాళ్లకి పాడవుతాయి. అంటే వృథానేగా! పైగా నగల డిజైన్లు తరచూ మారుతుంటాయి. ఇప్పుడు కొనిపెట్టుకున్నా తర్వాత పాతగా అనిపించొచ్చు. మారిస్తే తరుగు దండగ. కొనే ప్రతిదీ ఇప్పుడు నిజంగా అవసరమా? కొనకపోతే గడవదా? అని ప్రశ్నించుకోండి. నిజాయతీగా అవుననిపిస్తేనే కొనండి.

* దాయడమేనా? పొదుపు పేరుతో ఊరికే దాస్తూ వెళ్లకండి. కొంత మొత్తాన్ని చిన్న చిన్న పెట్టుబడులు పెట్టండి. రిస్క్‌ భయం ఉంటే సురక్షితమైన వాటిలో పెడితే సరి. ఎంతోకొంత రిటర్న్స్‌ అయినా వస్తాయి. జీవితమంటే అనుకోనిది జరగడం. అనారోగ్యం, అనుకోని ఖర్చు, ఉద్యోగం పోవడం లాంటివి ఎప్పుడైనా ఎదురవొచ్చు. కాబట్టి, అత్యవసర నిధినీ ఏర్పాటు చేసుకోండి.

* దాన్నీ ముందుగానే.. పిల్లల భవిష్యత్తు కోసమనీ, పెళ్లిళ్ల కోసమనీ ప్రతి రూపాయి పక్కన పెట్టారు. సరే.. మరి మీ సంగతేంటి? మీకోసమూ మీరే ఆలోచించుకోవాలి. వయసులో ఉండగానే రిటైర్‌మెంట్‌నీ ప్లాన్‌ చేసుకోవాలి. కొంతమొత్తాన్ని జమ చేసుకొని ఉంచుకోవాలి. భవిష్యత్‌లో మీ ఆరోగ్యం, నివాసం.. దేనికైనా అవసరం అవొచ్చు. ముసలి వయసులో ఎవరిపైనా ఆధారపడకుండానూ బతకొచ్చు.


బాధ్యత ఎవరిది.. ‘ఈ డబ్బు విషయాలు నాకు తెలియదు బాబూ’.. అంటూ నాన్న, అన్నయ్య, భర్త చేతిలో డబ్బంతా పోసేవారే ఎక్కువ. ఇదీ తప్పేనంటారు నిపుణులు. పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. తీరా కష్టం ఎదురైతే చిక్కుల్లో పడొచ్చు. తెలియకపోతే తెలుసుకోండి. సలహా కోరండి. కానీ ప్రతి రూపాయీ ఏమవుతుందన్న విషయం మీకు తెలిసేలా చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్