అందమైన ఆర్చిగా అల్లేయొచ్చు..

ఇంటి ముంగిట లేదా పెరట్లో బోగన్‌విల్లియా, నైట్‌క్వీన్‌ వంటి మొక్కలకు ఆర్చి ఏర్పాటు చేస్తుంటాం. ఇంట్లో, బాల్కనీలో పెంచుకునే మనీ ప్లాంట్‌, గులాబీ వంటి మొక్కలకూ అందమైన ఆర్చి కట్టి.. ఇంటికి కొత్త అందాన్ని తెచ్చుకోవచ్చు.

Published : 20 Sep 2022 00:28 IST

ఇంటి ముంగిట లేదా పెరట్లో బోగన్‌విల్లియా, నైట్‌క్వీన్‌ వంటి మొక్కలకు ఆర్చి ఏర్పాటు చేస్తుంటాం. ఇంట్లో, బాల్కనీలో పెంచుకునే మనీ ప్లాంట్‌, గులాబీ వంటి మొక్కలకూ అందమైన ఆర్చి కట్టి.. ఇంటికి కొత్త అందాన్ని తెచ్చుకోవచ్చు.

తీగతో..  తొట్టె పరిమాణాన్ని, మొక్కను బట్టి కావాల్సినంత ఎత్తు లేదా డిజైన్‌కు తగినట్లు ఇనుపతీగను కట్టర్‌తో కట్‌ చేసుకోవాలి. హృదయాకారం, దీర్ఘచతురస్రం లేదా గుండ్రంగా తీగను చుట్టి చివర్లో ముడి వచ్చేలా చేసి చివర్లను కలపాలి. ఈ తీగ మొదటి నుంచి చివరివరకు పురికొసను చుట్టి బిగుతుగా ముడి వేయాలి. ఇలా తయారు చేసిన తీగను మనీప్లాంట్‌ వంటి తీగజాతి మొక్కల తొట్టెలోని మట్టిలో లోతుగా గుచ్చాలి. ఆ తర్వాత మొక్క చివర్లను ఈ తీగకు చుట్టినట్లు సర్దితే చాలు. మొక్క అదే ఆకారంలో పెరుగుతుంది. ఇలా ఎదిగిన మొక్కను పడకగది లేదా భోజనబల్లపై ఉంచితే, ఆ ప్రాంతమంతా ప్రత్యేకమవుతుంది. అలాగే గది మూలలో వేలాడేసేలా చేయాలంటే ముందుగా దీనికి ఇండోర్‌ మొక్కను ఎంచుకోవాలి. ఈ తొట్టెను ఒక మెటల్‌ పాట్‌లో ఉంచాలి. ఆ తర్వాత కావాల్సిన ఆకారంలో తీగను కట్‌ చేసి మెటల్‌ పాట్‌ చుట్టూ వచ్చేలా చుడుతూ.. పైకి గుండ్రంగా వచ్చేలా చేయాలి.  దీనికి మొక్కను అల్లుకునేలా సర్దితే చాలు. దీన్ని ఇంట్లో ఏ మూల వేలాడేసినా అందమే. 

వెదురుతో..  తీగ గులాబీ జాతి మొక్క లేదా శంఖుపూల మొక్కను ఆర్చిపై పాకేలా చేసి, ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దొచ్చు. వెదురు ముక్కలను పల్చగా, సన్నగా కావాల్సిన పరిమాణంలో కట్‌ చేసుకోవాలి. వీటిని చిన్న చాప ఆకారం వచ్చేలా ఒకదానిపై మరొకదాన్ని ఉంచి మధ్య మధ్యలో చిన్నచిన్న మేకులను కొట్టాలి. ఇలా చేసిన వెదురు చాపను ఓ వైపు తొట్టెలోని మట్టిలోపల ఉండేలా గుచ్చాలి. దీనిపై మొక్క పాకడానికి వీలుగా సర్ది అక్కడక్కడా మొక్కను వెదురు ముక్కలకు కలిపి పురికొసతో కట్టాలి. మొత్తమంతా పాకిన మొక్కకు పూలు విరబూసినప్పుడు చూడటానికి బొకేలా, గదికే ఆకర్షణగా మారుతుంది. మనీ ప్లాంట్‌ వంటి మొక్కలనూ వెదురుతో అందంగా పాకేలా చేయొచ్చు. ముందుగా పల్చని వెదురు బద్దల్ని కావాల్సిన ఆకారంలో వంచి, తొట్టెలో లోతుగా గుచ్చాలి. ఆ తర్వాత తొట్టెలోని మొక్కను దానికి చుడితే చాలు. మెల్లగా మొక్క వెదురు ఆకారానికి తగినట్లు పెరిగి చూడటానికి అందంగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్