కుంకుమార్చనతో అమ్మ ప్రసన్నం
‘అరుణాం కరుణాతరంగితాక్షీం’ అనేది అమ్మ ధ్యానశ్లోకం. ‘ఓ ఎర్రటి మాతా, నిరంతరం కళ్లలో కరుణ, వాత్సల్యం నింపుకున్న తల్లీ’ అంటూ వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని తదితర వశిన్యాది
‘అరుణాం కరుణాతరంగితాక్షీం’ అనేది అమ్మ ధ్యానశ్లోకం. ‘ఓ ఎర్రటి మాతా, నిరంతరం కళ్లలో కరుణ, వాత్సల్యం నింపుకున్న తల్లీ’ అంటూ వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని తదితర వశిన్యాది దేవతలు అమ్మను ప్రేమగా కీర్తించారు. అమ్మ ఎరుపు, ఆమె ధరించిన వస్త్రం ఎరుపు, అమ్మవారి అర్చనాద్రవ్యం ఎరుపు. ఈ అరుణ వర్ణం రజస్సుకి ప్రతీక. సృష్టికి మూలం. స్త్రీత్వానికి గుర్తు. ఇదే స్త్రీలకు ఐదోతనాన్ని, దీర్ఘసుమంగళీ యోగాన్ని ఇచ్చే ఈ సర్వమంగళ వర్ణం వెనకున్న రహస్యం. ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవాలంటే కుంకుమార్చనకు మించినది లేదంటారు.
అమ్మ పాపిట ధరించిన కుంకుమ, పరమేశ్వరుని దీర్ఘాయువుకు రక్ష. కుంకుమార్చన మనకు అఖండ సౌభాగ్యాన్ని, భర్తలకు దీర్ఘాయువును ఇస్తుంది. వివాహితలకు, పెళ్లి కాని యువతులకు.. సమస్త స్త్రీ జాతికీ వరంగా, మన జన్మకు సార్థకతగా కుంకుమార్చనను భావించాలంటారు పెద్దలు. ఆదిశంకరులు సౌందర్యలహరిలో కుంకుమతో భాసించే అమ్మ పాపిటను బాలసూర్యుని కిరణంతో, కేశాలను దట్టమైన చీకటితో పోల్చారు. ఆ కుంకుమ ఎరుపు ప్రతి స్త్రీ జీవితంలో వైధవ్యమనే చీకటిని పోగొట్టే అఖండ మార్తాండుని అద్భుతమైన వెలుగు. ఏ ఇంట నిరంతరం కుంకుమార్చన జరుగుతుందో అది అమ్మవారి స్థానమౌతుంది, అర్చన చేసేవారి నాలుకపై అమ్మ కొలువై ఉంటుంది అనేది శాస్త్రవచనం.
కుంకుమ ధారణ, కుంకుమార్చన రెండూ శక్తివంతమైనవే. మన శరీరంలోని ఆరు చక్రాలలో ఆఖరిదైన ఆజ్ఞాచక్రాన్ని ప్రభావితం చేసే శక్తి తిలక ధారణకు ఉంది. అందుకే కుంకుమ ధారణ, కుంకుమార్చన రెండూ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మామూలు రోజుల్లో కంటే ఈ నవరాత్రి పర్వదినాల్లో కుంకుమార్చన ఫలితం కోట్లరెట్లు అధికంగా ఉంటుంది. శ్రద్ధతో ఆచరించినవారికి అది అనుభవైకవేద్యం.
* శరన్నవరాత్రుల తొలిరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. రాక్షసులతో యుద్ధం చేసేందుకు అష్టభుజాలతో సింహాసనంపై త్రిశూలధారియై.. కనకపు కవచంతో కనిపిస్తుంది.
* బతుకమ్మకు మాత్రం ఇది రెండో రోజు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున చేసేదాన్ని ‘అటుకుల బతుకమ్మ’గా పిలుస్తారు. ఈరోజు పుట్నాల పప్పు, బెల్లం, అటుకులతో కలిపి ప్రసాదాన్ని తయారు చేస్తారు.
- పుల్లాభట్ల నాగశాంతి స్వరూప
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.