జగన్మాత సర్వచైతన్యరూప

సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీ మహి బుద్ధిం యా నః ప్రచోదయాత్‌ శరన్నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే రోజులు. శక్తికి భౌతికరూపాన్ని ఇస్తే అది స్త్రీ.

Published : 27 Sep 2022 00:46 IST

శరన్నవరాత్రులు

సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీ మహి బుద్ధిం యా నః ప్రచోదయాత్‌

శరన్నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే రోజులు. శక్తికి భౌతికరూపాన్ని ఇస్తే అది స్త్రీ. కంటికి కనిపించే ఈ సృష్టి అంతా శక్తికి వ్యక్తరూపమే. ప్రకృతిస్వరూపిణి అయిన మహిళకి ఉన్నతస్థానం ఇచ్చి గౌరవించాలని, చులకన చేస్తే నశించక తప్పదని నవరాత్రి ఇతివృత్తాలు తెలియచేస్తాయి. జగన్మాత మహిషాసురుణ్ణి సంహరించిందని, శుంభనిశుంభులను హతమార్చిందని, దుర్గమాసురుడు, అరుణాసురుడు, రక్తబీజుడు మొదలైనవారినెందరినో మట్టుపెట్టిందని పురాణ కథలున్నాయి. అమ్మ లోకాలన్నింటికీ తల్లి. అందరూ ఆమె బిడ్డలే. మరి వారినెందుకు చంపింది?

ఎందుకంటే అమ్మ కదా! అందుకే లోక కంటకులను ఏరి పారేసి, సజ్జనులు సుఖంగా ధర్మ మార్గంలో చరించటానికి అవకాశం కలిగించింది. ఏ తల్లయినా తన బిడ్డలంతా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. మొదట మందలించి, సర్దిచెప్పి మంచి దారికి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. కుదరకపోతే రెండుదెబ్బలేసి చూస్తుంది. శిక్షల స్థాయి పెంచుతుంది. అప్పటికీ లాభం లేకపోతే సంహరిస్తుంది. తిట్టినా, కొట్టినా, మట్టుపెట్టినా తల్లికే అధికారం ఉంటుందని ఈ కథలు నిరూపిస్తాయి. పిల్లలను దండించి దారిలో పెట్టే అధికారం స్త్రీలకే ఉంటుందని మనం గ్రహించాలి.

మహిషాసురుడు, శుంభ, నిశుంభులు తమకు చావు లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుణ్ణి అడిగే సందర్భంలో ఆడవాళ్ల సంగతి తాము చూసుకుంటామని చులకనగా మాట్లాడారు. అందుకే స్త్రీ చేతిలోనే మరణించారు. సృష్టిలో స్త్రీల ప్రాధాన్యతను అందరూ గుర్తించాలన్నదే ఈ పండుగల అంతరార్థాల్లో ఒకటి.

దుర్గాదేవి అష్టభుజగా దర్శనమిస్తుంది. నిజానికి ప్రతి స్త్రీ అష్టభుజయే. పిల్లల్ని లాలించేటప్పుడు శ్రీమాత. వంట చేసేటప్పుడు చేతిలో గరిటతో అన్నపూర్ణ. పిల్లలకి చదువు చెప్పేటప్పుడు, జోలపాడేటపుడు సరస్వతి. తప్పు చేస్తే దండిస్తూ మహాకాళి. అలంకారాలు చేసుకుని కళకళలాడుతూ మహాలక్ష్మి. ఇంటివ్యవహారాలను చక్కదిద్దుతూ రాజరాజేశ్వరి. ఉద్యోగధర్మాన్ని నిర్వర్తిస్తూ దండనాథ. సమస్యలను పరిష్కరిస్తూ శ్యామలాదేవి. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో! ఇన్ని శక్తులు జన్మతః పొందిన స్త్రీలు తమశక్తులను గుర్తుచేసుకుని వినియోగించుకునే సమయమిది. విజయదశమి స్త్రీశక్తి విజయకేతనం.


* శరన్నవరాత్రుల్లో రెండో రోజున బెజవాడలో దుర్గమ్మ భక్తులకు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. త్రిమూర్తుల నుంచి ఉద్భవించిన రూపమే త్రిపుర. అక్షమాలను చేతబూని కనిపించే ఈ దేవి నిత్య సంతోషాన్ని ప్రసాదిస్తుంది.


* ముచ్చటగా మూడోరోజున చేసే బతుకమ్మను ‘ముద్దపప్పు బతుకమ్మ’ అంటారు. తీరొక్క పూలతో బతుకమ్మని అలంకరిస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదాన్ని చేసి గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు.

  - డాక్టర్‌ అనంతలక్ష్మి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని