అమ్మలూ మంత్రాలు వల్లిస్తున్నారు..

కోల్‌కతా అమ్మవారికి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఏటా జరిగేవే కదా అంటారా? విశేషమేమంటే అక్కడ పూజలు చేసే అవకాశాన్ని గతేడాది నుంచి మహిళలు అందుకొన్నారు. వీరిప్పుడు ఆలయాల్లోనే కాదు.. వివాహ వేదికలపైనా.. వేద మంత్రాలు చదువుతూ.

Updated : 28 Sep 2022 13:22 IST

కోల్‌కతా అమ్మవారికి నవరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఏటా జరిగేవే కదా అంటారా? విశేషమేమంటే అక్కడ పూజలు చేసే అవకాశాన్ని గతేడాది నుంచి మహిళలు అందుకొన్నారు. వీరిప్పుడు ఆలయాల్లోనే కాదు.. వివాహ వేదికలపైనా.. వేద మంత్రాలు చదువుతూ... వధూవరులతో ఏడడుగులూ వేయిస్తున్నారు. పూర్తిగా పురుషాధిక్యత ఉండే ఈ రంగంలో పెళ్లి మంత్రాలు వల్లిస్తూ.. మహిళాశక్తికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు.

భారతీయ యువకుడు జర్మనీ యువతి మెడలో ఈ ఫిబ్రవరిలో మూడు ముళ్లు వేసిన వివాహ క్రతువును తన బృందంతో కలిసి దత్తాత్రేయ ఘోషల్‌ జరిపించారు. దత్తాత్రేయ భరతనాట్య కళాకారిణి. కాగా, శాస్త్రీయ సంగీతంలో ఈమె మాస్టర్స్‌ చేశారు. ఇంతకీ తన వయసు 23! దత్తాత్రేయ బృందంలో 39 ఏళ్ల సోమాచక్రవర్తి శాస్త్రీయ సంగీతంలో మాస్టర్స్‌ చేశారు. డబ్బింగ్‌, థియేటర్‌ కళాకారిణి కూడా. 52 ఏళ్ల కేయా బెనర్జీ ఉపాధ్యాయిని. 35 ఏళ్ల తనుశ్రీచక్రవర్తి, 54 ఏళ్ల సుప్రదా ఆచార్య గృహిణులు. ఈ బృందంలో ఇరువురే బ్రాహ్మణులు. చిన్నప్పటి నుంచి వీరికి వేదాలపై ఆసక్తి. వివాహాలై ఎవరి కెరియర్‌లో వారున్నా, పౌరోహిత్యంలో శిక్షణ తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. వేద పండితులు షోభాకర్‌ చక్రవర్తి, గౌతం చక్రవర్తి వద్ద 2018లో ఏడాది శిక్షణ పొందారు. రుగ్‌, సామ, యజుర్‌, అథర్వ వేదాలను నేర్చుకున్నారు. తర్వాత ‘ద కలకతా ఈవెంట్‌’ సంస్థతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఇక్కడున్న 18 మంది మహిళా పూజారులూ నాలుగు జట్లుగా శుభకార్యాలను నిర్వహిస్తుంటారు.

పట్టుదలగా..

‘మేం ఒక్కో రంగం నుంచి వచ్చాం. పూజలు నిర్వహించడంలో మహిళలూ తీసిపోరని నిరూపించాలనుకున్నాం. అందుకే ఎంత కష్టమైనా, పట్టుదలగా సాధించాం. మొదట థియరీలో భాగంగా అక్షర దోషాల్లేకుండా.. పొల్లుపోకుండా సంస్కృత శ్లోకాలు చదవాలి. శిక్షణలో చాలా ఏకాగ్రత అవసరం. మంత్రోచ్ఛారణలో తప్పు రాకూడదు. రోజూ.. రెండు గంటలు సంస్కృత మంత్రాలను వల్లించాలి. ప్రయోగాత్మకంగా పలు పూజలు, శుభకార్యాలను నిర్వహించాలి. అలా ఏ పూజనైనా బాగా చేయడం నేర్చుకోగలిగాం. విధుల్లో ఎరుపు జరీ అంచున్న చీరను యూనిఫాంగా ధరిస్తుంటాం. దుర్గాపూజకు మాత్రం తెలుపు చీరకు కాషాయ అంచున్నవి ధరిస్తున్నాం. గతేడాది నుంచి కోల్‌కతా అమ్మవారి పూజా కార్యక్రమాలను నిర్వహించే అదృష్టం, అవకాశం దక్కాయి. ఎన్నో ఏళ్లుగా ఆ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలకు మగవారే పూజలు చేస్తున్నారు. ఆదాయం కూడా బాగానే వస్తుంది. ఇక్కడ ప్రధాన సమస్య లింగ వివక్షే. ఈ బాధ్యతలను పురుషులే నిర్వహించాలని వాదిస్తుంటారు కొందరు. కొన్ని వివాహ కార్యక్రమాల్లో వధూవరుల బంధువులు లేదా స్నేహితుల్లో ఎవరో ఒకరు మాపట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తుంటారు. కొన్నిచోట్ల వేడుక ముగిసిన వెంటనే త్వరగా అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటాం. కొన్ని చోట్ల మగ పురోహితులే వాదనకు దిగి, అవమానించడానికి ప్రయత్నిస్తుంటారు’ అని చెప్పుకొస్తారు దత్తాత్రేయ.

విదేశంలోనూ..

పశ్చిమ్‌ బంగాకు చెందిన కొన్ని కుటుంబాలు దుబాయిలో అయిదేళ్లుగా దుర్గాపూజ నిర్వహిస్తుండగా, ఈ ఏడాది మహిళా పూజారుల బృందానికి పిలుపొచ్చింది. దీంతో ఒక బృందం అక్కడకు వెళ్లి దుర్గాపూజలను నిర్వహిస్తోంది. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌, హూగ్లీ జిల్లా సేరంపోర్‌లోనూ నవరాత్రుల్లో అమ్మవారికి సేవలను అందిస్తోంది మరో బృందం. ‘ఈ ఏడాది ఏప్రిల్‌లో భోపాల్‌లో ఒక ఎన్నారై వివాహాన్ని జరిపించాం. ఆ పెళ్లికి గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మందికిపైగా అతిథులు హాజరు కాగా, అందరూ మమ్మల్ని పొగడటం మరవలేని అనుభవం’ అని అంటారు సుప్రజా ఆచార్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్