ఆకృతి భయానకం.. ప్రార్థనతో ప్రసన్నం

మనం సూర్యోదయ సూర్యాస్తమయాలతో కాలాన్ని లెక్కిస్తాం. వీటికి అతీతమైన, అంతు తెలియని మహా కాలమే ఈశ్వరశక్తితో కలిసి మహాకాళిగా ఆవిర్భవించింది. విశ్వ మాత ఒక్కోచోట ఒక్కో విధంగా

Updated : 29 Sep 2022 02:40 IST

శరన్నవరాత్రులు

మనం సూర్యోదయ సూర్యాస్తమయాలతో కాలాన్ని లెక్కిస్తాం. వీటికి అతీతమైన, అంతు తెలియని మహా కాలమే ఈశ్వరశక్తితో కలిసి మహాకాళిగా ఆవిర్భవించింది. విశ్వ మాత ఒక్కోచోట ఒక్కో విధంగా దర్శనమిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నాలుగు చేతుల్లోనూ నాలుగు నీలి కమలాలు ధరిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో కనిపిస్తుంది.

కాళీమాత స్వరూపం కాటుకలా నల్లని రంగులో, పది చేతులు, పచ్చని వెంట్రుకలతో, బయటకు చాచిన నాలుకతో మెడలో రుండమాలతో రౌద్రాకారంలో ఉంటుంది. ఆకృతి ఎలా ఉంటేనేం తన తత్వాన్ని అర్థం చేసుకుని ప్రార్థించే భక్తుల పట్ల అమిత ప్రసన్నురాలవుతుంది. దశమహావిద్యల్లో మొదటిది కాళీ విద్య. సమస్త విద్యలకూ కాళీ మాతే మూలమని, ఏళ్ల తరబడి యోగ సాధనలో సాధించలేని విద్యలను సైతం కాళీ సాధనతో శీఘ్రంగా సాధించవచ్చునని చెబుతారు. ఆమె అనుగ్రహంతోనే మహాకవి కాళిదాసు అమ్మవారి పలువరుసలో ఒకటిగా మారిపోయాడు.

కాళీమాతను శాక్తేయులు తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా ఆరాధిస్తే, మరికొందరు భవతారిణిగా కొలుస్తారు. బంగాలీలు కాళీమాతను ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. రామకృష్ణ పరమహంసకు పిలిస్తే పలికే అమ్మ కాళీమాత. కోల్‌కతా దక్షిణేశ్వర్‌ ఆలయంలో కొలువైన మాతను తల్లిలా భావించారాయన. అమ్మ ఆదరించింది, ఓదార్చింది, దివ్యానుభూతులను అలవోకగా ప్రసాదించింది.

కోల్‌కతా నగరంలోని కాళీ మందిరం శక్తి పీఠాల్లో ఒకటి. సతీదేవి కుడికాలి వేళ్లు ఈ క్షేత్రంలో పడి కాళీ ఘాట్‌గా మారింది. ఇక్కడి మాత రౌద్ర రూపంలో కనిపిస్తుంది. దక్షిణేశ్వర్‌ ఆలయంలో మాత్రం దట్టమైన కేశాలతో అందమైన మహిళగా దర్శనమిస్తుంది. ఆమె చేతుల్లో కత్తి, త్రిశూలం, తెగిన తల, కపాలం ఉంటాయి. మిగిలిన చేతులు అభయ ముద్రను, ఆశీర్వాదాన్ని సూచిస్తాయి. భక్తితో కొలిచిన వారికి సర్వం ప్రసాదించే కాళీమాత మోక్షప్రదాయిని కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే లక్ష్యంగా అవతరించిన శక్తిమంతమైన రూపమే కాళీమాత.


* ఈరోజు అమ్మవారు శ్రీలలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా, పంచాదశాక్షరీ మంత్రాది దేవతగా లలితాదేవిని భక్తులు ఆరాధిస్తారు. వాస్తవానికి ఈ రూపం నుంచే మనం ఆరాధిస్తున్న దేవతా రూపాలు దిగివచ్చాయని పురాణాలు చెబుతున్నాయి. శరీరం, మనసు, బుద్ధి అనేవి త్రిపురాలు. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ శక్తులు కలిగినది లలితాదేవి అంటారు.


* అయిదో రోజున బతుకమ్మను ‘అట్ల బతుకమ్మ’గా పిలుస్తారు. ఇవాళ బియ్యప్పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.


- ఉషా కామేష్‌ డొక్కా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్