సకల విద్యా ప్రదాత సరస్వతి
శరన్నవరాత్రుల్లో ఇది ఏడో రోజు. ఈ మూలా నక్షత్రం నాడు అమ్మవారు సరస్వతి అవతారంతో దర్శనమిస్తుంది. ఈ నక్షత్రం అపార ప్రజ్ఞకు చిహ్నమంటుంది జ్యోతిష శాస్త్రం. సృష్టికార్య నిర్వహణలో తోడుగా ఉండేందుకు వాక్ పేరుతో సరస్వతిని సృష్టించాడు బ్రహ్మ.
శరన్నవరాత్రుల్లో ఇది ఏడో రోజు. ఈ మూలా నక్షత్రం నాడు అమ్మవారు సరస్వతి అవతారంతో దర్శనమిస్తుంది. ఈ నక్షత్రం అపార ప్రజ్ఞకు చిహ్నమంటుంది జ్యోతిష శాస్త్రం. సృష్టికార్య నిర్వహణలో తోడుగా ఉండేందుకు వాక్ పేరుతో సరస్వతిని సృష్టించాడు బ్రహ్మ. తన సృష్టిలో భాగమైన సరస్వతి అంటే విధాతకు మక్కువ ఎక్కువ. కానీ అలా ప్రేమ భావన ప్రదర్శించడం ధర్మ వ్యతిరేకమని పరమ శివుడు విధాతను సంహరించాడు. ఈశ్వరుడి అనుగ్రహం కోసం సరస్వతి తీవ్ర తపస్సు చేసింది. శివయ్యను ఒప్పించి భర్త ప్రాణాలను తిరిగి పొందింది. అలా సృష్టి మనుగడకు భార్యాభర్తల అవసరాన్ని లోకానికి తెలియజేసింది సరస్వతి.
వాగ్దేవతా స్వరూపం శరత్కాలపు వెన్నెల రాత్రిలా తెల్లని కాంతులు విరజిమ్ముతుంది. చంద్రుణ్ణి సిగలో అలంకరించుకుని ప్రకాశిస్తుంది. చతుర్బాహువుల్లో ఒక చేతిలో స్ఫటిక జపమాలను, మరో చేతిలో పుస్తకాన్ని ధరిస్తుంది. ఒక చేతితో వరద, మరో చేతితో అభయ ముద్రలను ప్రదర్శిస్తుంది. అందుకే ఆ పావన మూర్తికి ప్రణతులర్పిస్తే వాక్ సిద్ధి కలుగుతుందన్నారు. సకల విద్యా ప్రదాత సరస్వతీ మాతను ‘ధవళ వర్ణ సంశోభిత సురాసురాది సర్వ మునిజన వందిత వాగ్దేవత’ అంటూ వర్ణించారు స్కాంద పురాణంలో. ‘ధవళ కాంతులతో ప్రకాశించే శరత్కాల మేఘమాల, జాజి పూల చెండు, పున్నమి నాటి చంద్రబింబం, పచ్చ కర్పూరం, చందనం, రాజహంసలు, మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, తెల్ల మందారాలు, పాలసముద్రం, తామరపూలు, ఆకాశగంగ- ఇవే నీ రూపకాంతికి సరి పోలికలు. సకల విద్యా ప్రదాతవైన నీకు ప్రణతులమ్మా’ అంటూ సరస్వతీదేవిని స్తుతించాడు బమ్మెర పోతన.
తెలుపు స్వచ్ఛతకు ప్రతీక, ప్రశాంతతకు చిహ్నం, కీర్తి ప్రతిష్ఠలకు గుర్తు, జ్ఞాన కాంతులకు ప్రతిబింబం. సృష్టిలోని సకల సద్గుణాలకూ ఆనవాలు ధవళ వర్ణం. ఆపాద మస్తకం శ్వేతవర్ణంతో శోభాయమానంగా ఉండే సరస్వతీదేవిని అర్చించేవారు సత్ఫలితాలను అందుకోగలరన్నదే ఆధ్యాత్మిక రహస్యం.
ఎనిమిదో రోజున బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. నువ్వులు, వెన్న/ నెయ్యి, బెల్లం కలిపి లేదా ముద్దలుగా చేసి నైవేద్యం పెడతారు.
- జి.జానకి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.