Updated : 19/11/2022 04:18 IST

పాత సీడీలతో కొత్తగా..

ఇంట్లో పేరుకుపోయే పాత సీడీలతో వాల్‌ హ్యాంగింగ్స్‌, అద్దాల అలంకరణ, షాండిలియర్స్‌ వంటి ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేసి ఇంటిని కొత్తగా మార్చేయొచ్చు.

అద్దాలకు.. ముందుగది గోడకు మధ్య అమర్చే అద్దాన్ని సీడీలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. గుండ్రంగా లేదా కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దానికి చుట్టూ రెండు వరుసలొచ్చేలా గోడపై ముందుగా పెన్సిల్‌తో లైన్లు గీయాలి. సీడీలను ఒకదానికొకటి టచ్‌ అయ్యేలా ఉంచుతూ.. రెండు వరుసల లైన్ల మధ్య వచ్చేలా గమ్‌తో అంటించాలి. అద్దం చుట్టూతా మెరుపులీనుతూ.. చూడటానికి సీడీలన్నీ కలిసి అందంగా కనిపిస్తాయి. డ్రెస్సింగ్‌ రూంలోని దీర్ఘచతురస్రాకారంలో ఉండే అద్దాన్నీ.. తీర్చిదిద్దొచ్చు. ముందుగా సీడీలను త్రికోణం ఆకారంలో చిన్నచి న్న ముక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి. అద్దం ఫ్రేంపై వరుసగా ఈ ముక్కలు వచ్చేలా జిగురుతో అంటించి ఆరనిస్తే చాలు. మొజాయిక్‌ డిజైన్‌గా అనిపిస్తూ.. రంగురంగుల ముక్కలన్నీ కాంతులీనుతుంటే మధ్యలో అద్దం ఇంటికి కొత్తదనాన్ని తెస్తుంది.

సూర్యచంద్రులు.. నక్షత్రం, సూర్యుడు, అర్ధచంద్రాకారంలో దళసరి అట్టముక్కను, సీడీలను కట్‌ చేసి ఉంచుకోవాలి. అట్టముక్కలపై అదే ఆకారంలో కట్‌ చేసిన సీడీ ముక్కలను జిగురుతో అంటించి ఆరనివ్వాలి. ముందుగా సూర్యుడు, చంద్రుళ్లలా కట్‌చేసిన వాటిని ఒకదానికొకటి కింద వేలాడేలా దారంతో అంటించాలి. కింద ఉన్న అర్థచంద్రాకారపు ముక్కకు వరుసగా వేలాడేలా నక్షత్రాలను తాడుతో వేలాడేలా అంటిస్తే చాలు. దీన్ని గది మధ్యలో లేదా గోడకు వేలాడేసినా గాలికి ఊగుతూ అందంగా కనిపిస్తాయి. అలాగే పల్చని ప్లాస్టిక్‌ ప్లేటుకు వరసగా చిన్న రంధ్రాలు చేసి వాటిలో సీడీలను వరసగా కట్టిన తీగలను ముడి వేయాలి. ప్లేటుకు కింద ఇవన్నీ వేలాడుతూ గాలికి కదులుతూ ఉంటాయి. గది మధ్య దీన్ని అమర్చితే.. తళుక్కుమంటూ షాండిలియర్‌లా అనిపిస్తాయి. వృథా  పాత సామాన్లను ఇలా పలురకాల డిజైన్లుగా మార్చి అలంకరిస్తే కొత్తగా కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని