సుగంధంతో అలసట మాయం..

మొక్కల పెంపకం గురించిన ప్రస్తావన వస్తే మనలో కొందరు విసుగ్గా నిట్టూర్చేస్తారు. ఇంటిపనితోనే సతమతమవుతూ అవస్థ పడుతుంటే.. ఇంకా మొక్కలు కూడానా?! ఈ అదనపు బాధ్యత మేమెక్కడ మోయగలం- అనేస్తారు.

Updated : 05 Dec 2022 04:33 IST

మొక్కల పెంపకం గురించిన ప్రస్తావన వస్తే మనలో కొందరు విసుగ్గా నిట్టూర్చేస్తారు. ఇంటిపనితోనే సతమతమవుతూ అవస్థ పడుతుంటే.. ఇంకా మొక్కలు కూడానా?! ఈ అదనపు బాధ్యత మేమెక్కడ మోయగలం- అనేస్తారు. నిజానికి కాసిని నీళ్లు పోయడం తప్పించి పెద్దగా శ్రమించేదేం లేదు. ఫలితం మాత్రం అపారం. మొక్కల్ని పెంచితే.. ఆనందాలూ ఆహ్లాదాలూ పెనవేసుకుని పుష్పిస్తాయి..

మరువం

వేల ఏళ్ల చరిత్ర ఉన్న మరువాన్ని స్వీట్‌ మర్జోరం అంటారు. మన అమ్మమ్మలూ, నాన్నమ్మలూ ఇష్టంగా పెంచి పూలతో కలిపి మాల కట్టేవారు. మరువం పెంచడం ఎంత సులువంటే.. వేలెడంత కొమ్మ పాతినా వేళ్లూనుకుంటుంది. గుబురుగా తయారై పరిమళాలు వెదజల్లుతుంది. అరోమా థెరపీలో ఉపయోగించే ఈ మొక్క అల్సర్లు, గాయాలు, చర్మవ్యాధులు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు ఔషధంలా పనిచేస్తుంది.

కౌరవ పాండవుల పూలు

ప్యాషన్‌ ఫ్లవర్‌గా ప్రసిద్ధమైన ఈ తీగపాదు ఇంటికి కొత్త అందం తెప్పిస్తుంది. చుట్టూ ఉన్న వంద రేకలు కౌరవులు, మధ్యలో ఐదు కేసరాలు పాండవులు- అంటూ భాష్యం చెప్పే ఈ పూలు చూపులకూ, పరిమళానికీ కూడా ఆహా అనిపిస్తాయి. దీన్ని పెంచడం బహు తేలిక. ఖాళీస్థలం ఉంటే సరే.. లేకున్నా పెద్ద కుండీలో పెట్టి డాబా మీదికి పాకించవచ్చు. పడకగది కిటికీ దగ్గర ఈ మొక్క ఉంటే ఆ అద్భుత పరిమళానికి హాయిగా నిద్ర పడుతుంది.

రజనీగంధ

ఇలా పిలిస్తే ఇవేవో కొత్త పూలు అనుకుంటారేమో కానీ లిల్లీ లేదా ట్యూబ్‌రోజ్‌ అంటే అందరికీ అర్థమైపోతుంది. ఆ వెంటనే ముఖం విప్పారుతుంది. వాటి శోభ, సుమధుర సువాసనలూ అలాంటివి. ఈ దుంపను నాటితే నాలుగు నెలల్లో ఏపుగా పెరిగి గుత్తులు గుత్తులుగా పూలు పూసి మురిపిస్తాయి. కాసేపు ఈ మొక్కల మధ్య గడిపితే వంట పనితో కలిగిన అలసటంతా ఇట్టే మాయమైపోతుంది. ఇక ఒత్తిడి, ఆందోళనలకు చోటే ఉండదు.

ఇళ్లల్లో రసాయనాల రూమ్‌ ఫ్రెష్‌నర్లు కొట్టడం కంటే సహజ సుగంధాలు వెదజల్లే ఇలాంటి మొక్కలను పెంచుకుంటే ఇంటిల్లిపాదికీ హాయిగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్