కొంచెం మనంగా... కొంచెం స్వార్థంగా!

కొత్త ఏడాదిలో ఇవన్నీ చేయాలి, అవి వదిలేయాలి... ఇలా అందరూ తీర్మానాలు చేసేసుకుంటారు. మరి.. మీ సంగతేంటి? ఎంత సేపూ ఇంట్లో వాళ్లకు కావాల్సినవి అందించడం, గుర్తుచేయడమేనా! కొత్త ఏడాది తొలి రోజు నుంచే కాస్త స్వార్థం పెంచుకోండి.

Updated : 01 Jan 2023 05:26 IST

కొత్త ఏడాదిలో ఇవన్నీ చేయాలి, అవి వదిలేయాలి... ఇలా అందరూ తీర్మానాలు చేసేసుకుంటారు. మరి.. మీ సంగతేంటి? ఎంత సేపూ ఇంట్లో వాళ్లకు కావాల్సినవి అందించడం, గుర్తుచేయడమేనా! కొత్త ఏడాది తొలి రోజు నుంచే కాస్త స్వార్థం పెంచుకోండి.

మీకోసం మీరు..

* ఉదయం త్వరగా లేవడం మనకలవాటే. రాత్రుళ్లూ త్వరగా నిద్రపోండి. రేపు చేయాల్సిన వాటిని ఆలోచిస్తూ పడుకుంటారు చాలామంది. అదీ ఒత్తిడే! దీంతో కలత నిద్ర. ఆలోచనలు పక్కన పెట్టండి.. నిద్రపుచ్చే మార్గాలు, అరోమా థెరపీ వంటివి ప్రయత్నించండి. మీపై ఖర్చుకు ‘అనవసరం’ అన్న ట్యాగు వేయడం మాని కాస్త స్వీయ ప్రేమ చూపించండి.

* రోజువారీ చర్మసంరక్షణపై దృష్టిపెట్టే వారెందరు? పిల్లలు పుట్టాక ఇవన్నీ అవసరమా అనుకుంటారు. మిమ్మల్ని మీరే అలా వదిలేస్తే ఎలా? అందం కోసమనే కాదు.. ఆరోగ్యంగా కనిపిస్తోంటే.. మనసూ ఉల్లాసంగా మారుతుంది.

* లేవగానే హడావుడిగా పనిలో పడిపోవద్దు. ఓ కప్పు కాఫీ/ టీ, కొద్దిపాటి ధ్యానం.. ఇలా ఆనందాన్నిచ్చే వాటికి కేటాయించుకోండి. మహా అయితే పావుగంట. ఆ సానుకూల ప్రభావం రోజంతా ఉంటుంది.

* పనిలో పడి నీళ్లు, తిండి మర్చిపోతుంటాం.. ఫలితమే అనారోగ్య సమస్యలు. మీ కోసమే ప్రత్యేకంగా ఓ బాటిల్‌ కొనుక్కోండి. దాని వంక చూసినప్పుడల్లా నీళ్లు తాగాలని గుర్తొస్తుంటుంది. లేచిన గంటలోపు ఏదైనా తినాలంటారు నిపుణులు. మనమేమో అతిముఖ్యమైన అల్పాహారాన్నే మానేస్తుంటాం. పండు, నట్స్‌, ఓట్స్‌ వంటివి పక్కన పెట్టుకోండి. ఆకలేసినప్పుడు త్వరగా తినేయొచ్చు.

సానుకూలంగా సాగుదాం..

* ‘ఇంట్లోనేగా ఉండేది..’ చిన్న గొడవొచ్చినా గృహిణులకు ఈ మాట ఎదురవుతుంది. హస్తకళలు, చిన్న వ్యాపారం, యూట్యూబ్‌.. ఇలా ఏదైనా ‘సొంతంగా’ ప్రయత్నించేయండి.

* మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతి విషయంలో పక్కవారితో పోల్చుకుంటే నెగెటివిటీ పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలను నమ్మడం.. వాటిని మెరుగు పరచుకోవడంపైనే దృష్టి పెట్టండి.. పని ప్రదేశమూ ఉత్సాహాన్ని నింపగలదు.

* ‘ఇతరుల’ మెప్పు కోసం పని చేయొద్దు. మన మనసును మించిన జడ్జి ఉండదు. దాన్ని మెప్పించండి ముందుకెళ్లడం ఖాయం. ‘ఎందుకొచ్చిందిలే’ అని మనం వేెసే వెనకడుగే ఎన్నో సమస్యలను తెచ్చి పెడుతుంది. చేసిన పనికి గుర్తింపు రాకపోయినా.. ఏ విషయంలోనైనా అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా ప్రశ్నించండి. మీ తరఫున మీరే నిలబడాలి, హక్కుల్ని దక్కించుకోవాలి.

* నచ్చకపోయినా, భారమైనా ఏమనుకుంటారోనని మోయలేని బాధ్యతలు మీదేసుకోవడం మన ఆడ వాళ్లకు అలవాటు. తరువాత ఆ ఫలితాన్ని భరించాల్సిందీ మనమే. మీకు వీలు కాకపోతే మొహమాటపడకుండా చెప్పేయండి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు.

చెమట చిందిద్దాం

‘ఫుల్‌ బాడీ చెకప్‌’ చేయించుకోండి. ‘నాకేమెంiది.. ఆరోగ్యంగా ఉన్నా’ అని మీరనుకుంటే సరిపోదు. రిపోర్టుల్లోనూ ఏ సమస్యా లేదని వస్తే అంతకు మించిన ఆనందమేది? ఫలితం ఏదైనా రోజూ కొంతసేపు వ్యాయామానికి కేటాయించండి. జిమ్‌కే వెళ్లాలనేం లేదు. కాలు బయట పెట్టకుండానూ చెమట చిందించొచ్చు. ‘20 నిమిషాలు’ అని సమయం పెట్టుకొని నడక, తేలికపాటి వ్యాయామాలు తప్పక చేస్తూ ఉంటే ఫిట్‌గా ఉండొచ్చు. ఇన్ని కేజీలు తగ్గాలి, పొట్ట తగ్గించుకోవాలి లాంటి ఆరోగ్యకరమైన లక్ష్యాలు పెట్టుకుంటే కొనసాగించడమూ తేలికే! మనసు గురించీ ఆలోచించండి. ఫోన్‌ వినియోగానికి పరిధులు పెట్టుకోవడం, పుస్తక పఠనం, సంగీతం వినడం, మొక్కల మధ్య 10 నిమిషాలు గడపడం వంటివి తప్పనిసరి చేసుకోండి.. మనసుకీ హాయి.

దాచుకోండి.. ఫర్లేదు

పూర్వం కూతురి సంసారం ఎలా సాగుతోందని తెలుసుకోవడానికి అమ్మలు ‘పోపుల పెట్టె’ వెదికే వారట. అది నిండుగా ఉంటే సంసారం బాగుందనుకునేవారు. ఆమెకేదైనా సాయం చేయాలనుకున్నా.. దానిలోనే డబ్బులు పెట్టేవారట. మీరూ అదే సూత్రం అనుసరించండి. ఉద్యోగం చేస్తోంటే.. చేతిలో డబ్బులు మెదులుతాయి. గృహిణులకా అవకాశమేది అంటారా.. వేలు లక్షలే అవసరం లేదు. ఫ్యామిలీ బడ్జెట్‌లో మీకోసం కొంత కేటాయించుకొని, దాచుకోండి. అయితే ప్రతి చిన్న అవసరానికీ తీయొద్దు. ఒక లక్ష్యం పెట్టుకొని అంత మొత్తం పోగు చేశాక పెట్టుబడి, అత్యవసరనిధి కింద విభజించుకోండి. పెట్టుబడిని రాబడి వచ్చే వాటిల్లో పెట్టొచ్చు. అత్యవసరనిధిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోండి. అది మీ మలి దశ అవసరాలకు మాత్రమే! ఈ సూత్రం ఉద్యోగినులకీ వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్