అవీ.. జాగ్రత్త!

వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. బయట అడుగు పెట్టామంటే నీరసం ఆవరించేస్తోంది. పిల్లల సంగతి సరేసరి! మరి ప్రేమగా పెంచుకునే మొక్కల సంగతేంటి? ఎంత ఎండ అవసరమైనా ఈ తీవ్రతను అవీ తట్టుకోలేవు.

Published : 24 Feb 2023 00:20 IST

వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. బయట అడుగు పెట్టామంటే నీరసం ఆవరించేస్తోంది. పిల్లల సంగతి సరేసరి! మరి ప్రేమగా పెంచుకునే మొక్కల సంగతేంటి? ఎంత ఎండ అవసరమైనా ఈ తీవ్రతను అవీ తట్టుకోలేవు. కాబట్టి.. వాటినీ చిన్నారుల్లా జాగ్రత్తగా సంరక్షించుకోవాలంటారు నిపుణులు!

*ఒంట్లో నీరు ఆవిరైపోతుందని పిల్లలకు ఎక్కువ నీరు తాగమని చెబుతాం కదా! మొక్కల విషయంలోనూ అంతే! ఈ కాలం వాటికీ మామూలుగా కంటే ఎక్కువ నీరు అందించాలి. సాయంవేళ అందిస్తే ఇంకా మంచిది. అప్పుడు మొక్కలకు నీటిని గ్రహించే సమయం దొరుకుతుంది. మొక్కల చుట్టూ కాగితాలు, కొబ్బరి పీచు, కొన్ని రకాల గడ్డితో కప్పండి. మట్టినుంచి తేమ త్వరగా ఆవిరవ్వకుండా ఉంటుంది.

*పిల్లలు ఎండ వేడికి కాడల్లా వేలాడతారు. అందుకని బయటికి త్వరగా వెళ్లనివ్వం. కొన్ని మొక్కలూ ఎక్కువ వేడిని తట్టుకోలేవు. దీంతో త్వరగా ఎండిపోతుంటాయి. అలాంటి వాటన్నింటినీ నీరెండలోకి మార్చడమో.. వాటికి గ్రీన్‌ షేడ్‌ వంటివో ఏర్పాటు చేయండి.

*ప్రేమగా పెంచుకునే మొక్కలు చనిపోతాయి. కానీ.. కలుపు, గడ్డిమొక్కలు మాత్రం బాగా పెరిగిపోతుంటాయి. ఇవి మొక్కల్లోని సారాన్ని, పోషకాలను వేగంగా పీల్చుకొంటాయి కూడా. కాబట్టి, వీలున్నప్పుడల్లా వాటిని తీసి పారేయడం తప్పనిసరి.

*ఇంట్లో ఉన్నంత మాత్రాన వేడితాపం తగ్గదు. కాస్త పరిస్థితి మెరుగు పడుతుందంతే! అందుకే ఇండోర్‌ మొక్కలూ సురక్షితం అనుకోవడానికి వీల్లేదు. వేడి ప్రభావం వీటిపైనా పడుతుంది. వాతావరణంలో తేమ తగ్గి మొక్కలు వేలాడిసినట్లుగా తయారవుతాయి. కుండీ కింద ఒక ప్లేటుని రాళ్లు, నీటితో నింపితే ఈ సమస్య ఉండదు.

* పిల్లలకు ఈ కాలం వదులు, కాటన్‌ వస్త్రాలు ఇస్తాం కదా! గాలి ఆడితే శరీరానికి హాయి అన్న ఉద్దేశమే! మొక్కలకీ ఆ తరహా హాయినివ్వాలి. ఎదిగే మొక్కకి చిన్న కుండీ అనుకూలంగా ఉండదు. కాబట్టి, పెద్ద కుండీల్లోకి మార్చండి. అలాగే ఈ కాలం పురుగుల మందులు పిచికారీ వంటివి చేయొద్దు. ఇవి వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. అత్యవసరమైతే సాయంత్రం బాగా చల్లబడ్డాకే అందించాలి. అలాగే కొమ్మలు కత్తిరించడం లాంటివి చేయొద్దు. ఎండిపోయిన, కుళ్లిన ఆకులను మాత్రం తొలగిస్తే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్