ఇల్లు ఆకర్షణీయంగా ఉండాలంటే..

మనందరికీ చాలా చాలా ఇష్టమైన ప్రదేశం ఇల్లే కదూ! బయట ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇంటికి రాగానే సేదతీరతాం. ఉన్నదేదో కలిసి తింటాం.

Published : 26 Feb 2023 00:16 IST

మనందరికీ చాలా చాలా ఇష్టమైన ప్రదేశం ఇల్లే కదూ! బయట ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఇంటికి రాగానే సేదతీరతాం. ఉన్నదేదో కలిసి తింటాం. కపటం లేకుండా కబుర్లు చెప్పుకొంటాం. అలా ఆత్మీయత పెంచి ఆనందాలు పంచే ఇల్లు చిందరవందరగా ఉంటే ఏం బాగుంటుంది? ఎంచక్కా సర్దేసుకుందాం. అందుకోసం ఈ చిన్న చిన్న సూత్రాలు పాటించి చూడండి..

* చాన్నాళ్లుగా ఇల్లు సర్దక గందరగోళంగా ఉందా? మరేం ఫరవాలేదు. కంగారుపడొద్దు, ఒత్తిడి పెంచుకోవద్దు. ఇల్లంతా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలనేది మీ టార్గెట్‌ కదా! ఆదివారం ఉదయానే నడుం బిగించండి. ఆరోజు వంటకు సెలవిచ్చి బయటి నుంచి తెప్పించుకోండి. లేదా తేలిగ్గా పూర్తయ్యే ఫ్రైడ్‌ రైస్‌ లాంటిది చేసుకోండి. కుటుంబసభ్యులందరికీ తలా కొంత పనీ అప్పగించండి. అల్మరలు, అటకలు, వార్డ్‌రోబ్‌లు, బీరువాలు.. ఇలా ఒక్కొకరూ ఒక్కోటి చొప్పున సర్దితే తేలికవుతుంది. సాయంత్రానికల్లా పనైపోవాలని నియమం పెట్టుకుని, ఆలోపు పూర్తయ్యేలా చూడండి.

* ఇల్లు కడిగిన ముత్యంలా నీట్‌గా ఉండాలంటే మార్కెట్‌లో కనిపించినవల్లా కొనొద్దు. ఇంట్లో ఇప్పటికే పేరుకుపోయిన వాడని దుస్తులు, వస్తువులను నిర్దాక్షిణ్యంగా తొలగించండి. ఇంత డబ్బు ఖర్చుపెట్టి కొన్నాం, ఎలా పడేస్తాం అని సందేహించారంటే ఇక ఇల్లు అందంగా ఉండాలని మర్చిపోవాల్సిందే మరి. కనుక ఆకర్షణీయమైన ఇంటి కోసం ఆ పని చేయండి. పోనీ ఎవరికైనా ఇచ్చేయండి. మనకు అడ్డుగా ఉన్నవి ఇంకొకరికి ఉపయోగపడితే మంచిదేగా.

* అరుదుగా వేసుకునే దుస్తులను పై అరల్లో, రోజూ వాడని దుప్పట్లను  అడుగు అరల్లో పెట్టి కలరా ఉండలు వేయండి. తరచుగా ఉపయోగించేవి మధ్య అరల్లో ఉంటే తీసుకోవడం తేలికవుతుంది.

* బీరువాలూ, కబోర్డ్స్‌లో పెట్టగా మిగిలిన వస్తువులను పెద్ద అట్టపెట్టెల్లో సర్ది అటక మీద పెట్టండి. పైకి ఎక్కించిన వాటిని మాటిమాటికీ దించాలంటే కష్టం కనుక ఏవి ఎక్కువ అవసరం అనే ప్రాధాన్యత ప్రకారం ముందూ వెనుక వరుసల్లో అమర్చండి. వేటిల్లో ఏమున్నాయో లేబుల్‌ రాసి కనిపించేలా అతికించండి. అవసరమైనప్పుడు అన్నిటినీ వెతకాల్సిన శ్రమ తప్పుతుంది.

* పొయ్యి గట్టు కింది స్థలం వృథా కాకుండా సొరుగులు పెట్టించడం తెలిసిందే. వాటికి ఎక్కువ అరలు ఉంటే గరిటెలు, గిన్నెలు, కప్పులు, గ్లాసులూ లాంటివన్నీ పొందిగ్గా అమర్చుకోవచ్చు.

* స్టవ్వుకు దగ్గరగా ఉండే అరల్లో ఉప్పు, కారం, పసుపు, పోపుల డబ్బా, మసాలా దినుసులు లాంటి నిత్యావసర సామగ్రి ఉండేలా చూసుకుంటే వంట సమయంలో వెతుకులాట తప్పుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్