సప్తవర్ణాల బాల్కనీ..
చినుకులు పడిన తర్వాత ఆకాశంలో విరిసే ఇంద్రధనస్సు నిత్యం కళ్లెదుట ఉంటే ఎలా ఉంటుంది. ఆ అనుభూతిని బాల్కనీలో పొందొచ్చు. అదెలాగో చూద్దాం.
చినుకులు పడిన తర్వాత ఆకాశంలో విరిసే ఇంద్రధనస్సు నిత్యం కళ్లెదుట ఉంటే ఎలా ఉంటుంది. ఆ అనుభూతిని బాల్కనీలో పొందొచ్చు. అదెలాగో చూద్దాం.
ఒత్తిడిగా ఉన్నప్పుడు సేదతీరేలా.. ఆహ్లాదం కలిగేలా బాల్కనీని తీర్చిదిద్దుకోవచ్చు. పచ్చదనంతో నింపేస్తే చాలు... మనసుకి హాయిగా ఉంటుంది. చిన్నా పెద్దా తొట్టెల్లో బంతి, చామంతి, మందార, గులాబీ అంటూ సీజన్‌కు తగ్గ పూల మొక్కల్ని చక్కటి ఆకృతిగల కుండీల్లో పెంచితే ఆ ప్రదేశానికి మరింత అందం. ఉన్న స్థలంలో ఒద్దికగా సర్దుకోవాలంటే... ప్లాంట్ స్టాండ్స్, హ్యాంగింగ్ పాట్స్ వంటివి వాడాలి.
రంగులతో అందంగా... మొక్కల్ని పెట్టే కుండీలకు ముదురు, లేత వర్ణాల కాంబినేషన్‌తో పెయింట్ వేస్తే చూడ్డానికీ బాగుంటాయి. ముదురు వర్ణాల కుండీలపై లేత రంగులతో చిన్నచిన్న డిజైన్లు, చుక్కలు వంటివి అద్దాలి. బోర్డర్లూ గీసుకోవచ్చు. అయితే, ఒకే రంగున్న కుండీలన్నీ ఒక్క చోటే కాకుండా... కంటికింపుగా కనిపించేలా ఓ క్రమపద్ధతిలో వాటిని సర్దాలి. ప్లాంట్ స్టాండుకు తెలుపు లేదా ఆకుపచ్చని రంగు వేయాలి. ఇలా చేస్తే... రంగురంగుల తొట్టెల్లో పచ్చదనం మధ్య వర్ణభరితమైన పూలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అదనంగా.. సిట్టింగ్ ఏరియానూ.. రంగులతో నింపాలి. టీపాయ్, కుర్చీలు, వాటిపై వేసే పిల్లో కవర్స్ వంటివన్నీ కూడా కలర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకోవాలి. హ్యాంగింగ్ ప్లాంట్స్‌కు కట్టే వైర్లు కూడా ముదురు వర్ణాల్లో మెరవాలి. కొన్నింటికి ఫ్లోరోసెంట్ వర్ణం అద్దితే చీకట్లో అవి మరింత మెరుస్తూ కంటికింపుగా ఉంటాయి. అలాగే బాల్కనీ గోడలపై పూలు లేదా ప్రకృతిదృశ్యాల పెయింటింగ్ వేసి, మరోవైపు గోడకు వాల్ డెకార్స్‌గా చిన్న చిన్న బొమ్మల్నీ వేలాడదీస్తే చూడముచ్చటగా ఉంటాయి. బాల్కనీకి కొత్త అందం వస్తుంది. రంగులన్నీ ఒకేచోట ఉండి ఇంద్రధనస్సు నిత్యం మన కళ్లెదుట ఉన్నట్లే అనిపిస్తుంది. మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఇంకెందుకాలస్యం.. మీరూ ప్రయత్నించొచ్చు కదా..
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.