తొట్టె మారుస్తున్నారా?

మొక్క ఎదుగుదలలో మార్పు లేనప్పుడు, పెరగడానికి చోటు సరిపోనప్పుడు కుండీలు మారుస్తుంటాం. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం... వెంటనే మొక్క చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Published : 10 Apr 2023 00:49 IST

మొక్క ఎదుగుదలలో మార్పు లేనప్పుడు, పెరగడానికి చోటు సరిపోనప్పుడు కుండీలు మారుస్తుంటాం. ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం... వెంటనే మొక్క చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఆరోగ్యంగా ఎదుగుతున్న మొక్కను కొంచెం పెద్ద తొట్టెలోకి మార్చితే మరింత పెరుగుతుందని ఆశిస్తాం. తీరా ఆ పనిచేశాకా... అప్పటివరకు ఆకుపచ్చగా ఉన్న ఆకులన్నీ పసుపు వర్ణంలోకి మారి రాలుతుంటాయి. పచ్చని చిగుర్లు సైతం వడలిపోతాయి. ఎదుగుదల మాట అటుంచి చివరకు మొక్క చనిపోయే స్థితికి వచ్చేస్తుంది. అందుకే ఎలా మార్చాలో తెలుసుకుని ఆపని చేస్తే ఈ ఇబ్బందులను తప్పించుకోవచ్చు.

కొత్త కుండీలోకి మొక్కను మార్చేటప్పుడు  వేర్లతోపాటు కొంత మట్టిని కూడా కలిపి తీయాలి. అలాగే కొత్త తొట్టెలో మట్టి, ఎరువు కలిపిన మిశ్రమాన్ని గుల్లగా ఉండేలా ముప్పావు వంతు నింపాలి. మట్టి నిండుగా నింపేస్తే... నీటిని అందించేటప్పుడు ఎక్కువైనవివి బయటకు ప్రవహించి, మట్టితోపాటు పోషకాలూ వృథా అవుతాయి.

పరిమాణం.. మొక్క పరిమాణం బట్టి తొట్టెను ఎంచుకోవాలి. ఎదిగిన తర్వాత కూడా మొక్క సౌకర్యంగా ఉండాలి. అలాగే చిన్న మొక్కకు పెద్ద పాట్‌ని ఎంచుకోవద్దు. దీనివల్ల ఎక్కువ నీటిని మట్టి పీల్చుకుంటుంది. నీరెక్కువై మొక్క ఎదుగుదల మందగిస్తుంది. కొన్నిసార్లు చనిపోయే ప్రమాదమూ ఉంది. మార్చడానికి తొట్టెను ఎంచుకున్న తర్వాత అడుగున రంధ్రాలున్నాయా లేదా పరిశీలించాలి. లేకపోతే రంధ్రాలు చేసిన తర్వాతే మట్టిని నింపాలని మరవకూడదు.

వెలుతురు.. మొక్కను మరో కుండీలోకి మార్చిన తర్వాత దాన్ని తక్కువ ఎండ లేదా పూర్తిగా గది వాతావరణానికే పరిమితం చేయాలా అనే అంశాల్లో సందేహం సహజమే. ఆ మొక్క ఎదుగుదలకు ఎంత వెలుతురు కావాలో ముందే తెలుసుకోండి. తొట్టె మార్చిన రోజు మాత్రం ఎండలో ఉంచొద్దు. తర్వాత ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఉంచాలి. కొత్త తొట్టెలో మొక్క స్థిరపడిన తర్వాత నిపుణుల సూచన ప్రకారం ఉంచితే సరిపోతుంది. అంతేకాదు మొక్కని మరోచోట నాటాం కదా అని కావాల్సిన దాని కన్నా ఎరువులెక్కువేసినా మొక్కకు చేటే. అలాగే ఒకే మొక్కను పదే పదే మార్చి మరోచోట నాటడమూ మంచిది కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్