భద్రంగా ఉండాలంటే...

సౌకర్యమో, అవసరమో ఇప్పుడు ప్రతి వంటింట్లోనూ ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరిగింది. వీటిని శుభ్రం చేయడంలో కాస్త తేడా వచ్చినా ప్రమాదాలకు గురవుతుంటారు.

Published : 03 Jul 2023 00:39 IST

సౌకర్యమో, అవసరమో ఇప్పుడు ప్రతి వంటింట్లోనూ ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగం పెరిగింది. వీటిని శుభ్రం చేయడంలో కాస్త తేడా వచ్చినా ప్రమాదాలకు గురవుతుంటారు. అలా కాకుడదంటే...

కుక్కర్‌: ఇటీవలి కాలంలో అంతా ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ల్లో అన్నం వండేవారే. వర్షాకాలం రాగానే దీని కండిషన్‌ని ఓ సారి చెక్‌ చేయడం మంచిది. గిన్నెని కుక్కర్‌లో పెట్టే ముందు అడుగు భాగంలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. లేదంటే షాక్‌ తగలొచ్చు. మరకలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే కొత్తదానిలా మెరిసిపోతుంది.  

మిక్సీ/గ్రైండర్‌: వీటితో పనయ్యాక గిన్నెల్లో వేణ్నీళ్లు, కాస్త బేకింగ్‌ సోడా వేసి ఓ పది నిమిషాలాగి శుభ్రం చేయండి. పొడి వస్త్రంతో తుడిచాకే మరోసారి వాడండి. తడిగా ఉన్న వాటిని మిక్సీలో నేరుగా పెట్టొద్దు. చాలామంది ఫ్లగ్‌ పెట్టి ఉంచి.. గిన్నెలు అమర్చుతుంటారు. ఇలా చేయడం వల్ల షాక్‌ కొట్టొచ్చు. అంతేకాదు పూర్తిగా మోటారు ఆగాకే గిన్నెను తీయాలి.

ఇస్త్రీ పెట్టె: నేల, ఇనుప మంచాల మీద ఇస్త్రీ చేయకపోవడం మేలు. ప్లగ్‌ పెట్టకుండా ఇస్త్రీ పెట్టెకు నీళ్ల డబ్బా అమర్చాలి. తీగలు ఊడిపోయినప్పుడు తాత్కాలికంగా ముడి వేసి చాలామంది వాడుతుంటారు. ఇది క్షేమం కాదు. ఎప్పటికప్పుడు బాగు చేయించుకోవాలి. పనయ్యాక వేడి పూర్తిగా తగ్గిన తర్వాతే లోపల పెట్టాలి.
ఓవెన్‌: పదార్థాన్ని బట్టి గిన్నె పరిమాణం ఉండాలి. దీన్ని వారానికోసారైనా శుభ్రం చేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో చెంచా బేకింగ్‌ సోడా వేసి మరగనివ్వాలి. ఐదునిమిషాల తర్వాత ఆ ఆవిరంతా లోపలి గోడలకు పడుతుంది. అప్పుడు పొడి వస్త్రంతో తుడిచేస్తే సరి.

టీవీ: దీన్ని పొడి వస్త్రంతో మాత్రమే అద్దాలి. వీటి కోసం ప్రత్యేకమైన క్లీనర్లు బజార్లో దొరుకుతాయి. టీవీ కట్టేసిన వెంటనే కవరు వేసేయకండి. అది పూర్తిగా చల్లారాకా ఆ పని చేయాలి.

ఫ్రిజ్‌: వేడి వేడి పదార్థాలను పెట్టడం వల్ల చల్లబరిచే సామర్ధ్యం మందగిస్తుంది. ఏ పదార్థమైనా సరే కాస్త చల్లబడ్డాక మూత ఉన్న గిన్నె లేదా డబ్బాలో ఉంచి పెట్టాలి. లోపల ఐసు గడ్డ కట్టకుండా చూసుకోవాలి. ట్రేలకు ఉప్పు రాసి ఉంచితే ఇలాంటి సమస్య ఉండదు. ఇక, లోపలి భాగంలో ఖాళీ ఉంది కదాని పదార్థాలన్నీ కూర్చడం సరికాదు. గాలి ప్రవేశించడానికి వీలుగా కాస్త స్థలం ఉంచడం మంచిది. అప్పుడే ఫ్రిజ్‌ పనితీరు క్రమంగా ఉంటుంది.

వాషింగ్‌ మెషీన్‌: సామర్థ్యానికి మించి ఎక్కువ దుస్తులు వేయకపోవడం మేలు. నీళ్లు కారుతున్నా, అధిక వేడి వస్తున్నా... గమనించుకుని సర్వీస్‌ చేయించుకోవాలి. ఎప్పుడు బట్టలు వేసినా...లోపల రబ్బరులో పేరుకున్న మురికిని క్లీన్‌ చేయాలి. వారానికోసారైనా బేకింగ్‌సోడా వేసి క్విక్‌ వాష్‌ చేస్తే లోపలి భాగాల్లో పేరుకున్న మురికే పోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని