జగదంబకు నీరాజనాలు..

యుగయుగాలుగా తరతరాలుగా అందరినీ, అన్నివేళలా కాచికాపాడే జగన్మాత, శక్తి స్వరూపిణి జగదంబ. ఆ అమ్మ మహిళాలోకానికి ప్రతీక. ‘యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా..’ అంటూ పండితులు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు.

Updated : 04 Jul 2023 05:03 IST

యుగయుగాలుగా తరతరాలుగా అందరినీ, అన్నివేళలా కాచికాపాడే జగన్మాత, శక్తి స్వరూపిణి జగదంబ. ఆ అమ్మ మహిళాలోకానికి ప్రతీక. ‘యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా..’ అంటూ పండితులు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో బోనాల సంబరాలు ఘనంగా చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం

రూరా గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తూనే ఉంటాం. ఏ ఊళ్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించి, అక్కడి స్థలపురాణాన్ని విన్నా... నమ్మిన భక్తులను కాపాడింది, ఆ గ్రామాన్ని వ్యాధుల బారి నుంచి రక్షించింది.. లాంటి ఉదంతాలెన్నో మన దృష్టికి వస్తాయి. వాటిల్లో అమ్మ కారుణ్యం కనిపిస్తుంది. అనంత ప్రేమ, చల్లదనం అనుభూతికొస్తాయి. పవిత్ర కార్యాలన్నింట్లో దేవి ఆరాధనే ప్రధానంగా ఉంటుంది. ఈ పూజల వెనుక ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక చైతన్యాంశం కూడా ఒకటుంది. అది తెలుసుకుని మనమంతా పండుగ చేసుకోవాలి. అప్పుడు ఎందరో మహిళలు ఎదుర్కొంటున్న దాడులూ దౌర్జన్యాలకు తావుండదు. అహంకారాలూ, ఆధిపత్య ధోరణులూ అడ్డు తగలవు. ఆడది, అబల లాంటి పనికిమాలిన, అవమానకరమైన భావనలు ప్రబలవు. స్వార్థచింతన, కపటచిత్తంతో కొందరు పురుషులు తామే గొప్ప అని చలామణి అయ్యే తీరు మారుతుంది. ఆ ఇనుప తెరలను తునకలు చేసి, ఆ భావనల గుట్టు రట్టు చేసే మహిళా మహోద్యమం విలసిల్లుతుంది. అలాంటి శుభ పరిణామానికి సంస్కృతి సమ్మిళితమైన సంప్రదాయ వేదికే బోనాల సంబరాలు.

ఐకమత్యమే ధ్యేయం

బోనం భోజనానికి ప్రతిరూపమే. అమ్మవారికి సమర్పించే భోజనాన్ని కొత్తకుండలో వండి ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దీపం పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ పండుగ నిర్వహణ, పూజా విధానం అన్నీ అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం నిర్వహించడమే ఆనవాయితీ. ఊరేగింపులో పోతురాజుగా ఉన్న వ్యక్తి వెంట నడుస్తున్న మహిళలను తోబుట్టువులుగా చూసుకుంటూ వారికి గౌరవ మర్యాదలనిస్తాడు. స్త్రీలకు రక్షణ కల్పించాలి, గౌరవ మర్యాదలతో కాచికాపాడాలి అన్న సామాజిక సందేశం ఇందులో దాగి ఉంది. ఊరేగింపులో సామాజిక ఐకమత్యం, బోనం సమర్పించేటప్పుడు ఆడపడుచులకు ఇచ్చే గౌరవం. ఇవన్నీ పండుగ నాటితో సరిపెట్టక జీవితాంతం కొనసాగిస్తే ఈ పండుగలకు మరింత సార్థకత చేకూరుతుంది. అదే మనకు శ్రీరామరక్ష. అప్పుడిక అమ్మవారికి బోనాలు అర్పించడంతో బాటు మన మహిళలకు నిత్యనీరాజనాలు సమర్పించినట్లవుతుంది.


ఆడబిడ్డకు వందనం

షాఢ మాసంలో శక్తిస్వరూపిణి అమ్మవారు, తన పుట్టింటికి వెళ్తుందని విశ్వసిస్తారు. ఆ నమ్మకంతోనే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని తమ కూతురిగానే భావిస్తారు. ఆనంద పరవశంతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను సమర్పిస్తారు. అనేక రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించటమే బోనం. స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి. ఆ  సంప్రదాయంతోబాటు ఇంటికొచ్చిన ఆడపడుచుకు ఎన్నిరకాల మర్యాదలు చెయ్యాలి? ఎలా ఆదరించాలి- అనే రీతులు బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. ఇంతటి మంచి సంస్కారాన్ని నేర్పే బోనాలకు వివిధ ప్రాంతాల్లో వేరేవేరే పేర్లున్నాయి. పండుగ ప్రక్రియను ఊరడి అంటారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పండుగ, వంటల పండుగ అనీ పిలుస్తారు.


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని