నట్టింట్లో పూల షాండిలియర్స్
ఇంటికి పూలవల్ల వచ్చే అందాన్ని దేనితోనూ పోల్చలేం. వెలుగులు విరజిమ్మే దీపాల స్థానంలో వర్ణభరితమైన పూల గుత్తులు షాండిలియర్స్‌గా వేలాడుతుంటే ఇంటికొచ్చే అందమే వేరు.
ఇంటికి పూలవల్ల వచ్చే అందాన్ని దేనితోనూ పోల్చలేం. వెలుగులు విరజిమ్మే దీపాల స్థానంలో వర్ణభరితమైన పూల గుత్తులు షాండిలియర్స్‌గా వేలాడుతుంటే ఇంటికొచ్చే అందమే వేరు..
ఖాళీ చెక్క ఫ్రేం, ప్లాస్టిక్ వైరు, జిగురు, ప్లాస్టిక్‌లో సహజంగా కనిపించే రంగురంగుల పూల గుత్తులుంటే చాలు. రీడింగ్ టేబుల్ లేదా భోజనబల్లపై పూల షాండిలియర్‌ని ఏర్పాటు చేయొచ్చు. ఫ్రేంకు మధ్యలో ప్లాస్టిక్ దారాలను గడులుగా వచ్చేలా అల్లాలి. వీటిలో ఒక్కొక్క పూల కాడను అవతలి వైపునకు వచ్చేలా సర్ది దారాలకు జిగురుతో అంటించాలి. మధ్యలో పొడవైన కొమ్మలు, ఫ్రేంలో మిగతా భాగమంతా రంగురంగుల గులాబీలు వచ్చేలా సర్దాలి. పూలు కిందకు వేలాడేలా ఫ్రేంను గది మధ్యలో వేలాడదీస్తే చాలు.
చక్రంలా కనిపిస్తూ.. ప్లాస్టిక్ బుట్ట అడుగుభాగం లేదా ఎంబ్రాయిడరీ వీల్‌తో దీన్ని తయారు చేయొచ్చు. వృథాగా ఉండే బుట్ట నుంచి అడుగు భాగాన్ని కట్ చేసి విడదీయాలి. దీనికి చెక్కరంగు పెయింట్ వేసి ఆరనివ్వాలి. ఎంబ్రాయిడరీ వీల్‌కూ..ఇలాగే చేసి ఆరబెట్టాలి. చిన్నాపెద్దా పూల కాడలను చక్రమంతా వచ్చేలా అంటించాలి. దీన్ని గది మధ్యలో వేలాడదీయాలి.
సహజంగా.. శుభకార్యం, పండుగ లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు సహజసిద్ధమైన పూల షాండిలియర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. గులాబీలు, లిల్లీలువంటి సువాసనలు వెదజల్లే పూలను ఇందుకోసం ఎంచుకోవాలి. దీర్ఘచతురస్రాకారం లేదా గుండ్రంగా ఉండే చెక్క ఫ్రేంను తీసుకోవాలి. దీనికి మధ్యలో పల్చని తీగలను ఫిక్స్ చేయాలి. ఫ్రేంకు పై వైపున పూలను తాజాగా ఉంచే స్టైరోఫోమ్‌ని జత చేయాలి. దానికి పూల కొమ్మలను గుచ్చి కిందకు వేలాడేలా చేయాలి. చివరగా ఫోమ్‌పై కాస్త నీటిని చల్లి నట్టింట్లో వేలాడదీస్తే సరి. ఎక్కువ గంటలు పూలు తాజాగా ఉండి పరిమళాలు వెదజల్లుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.