మొక్కలకు పసుపు

వర్షాకాలంలో మొక్కలకు ఇన్ఫెక్షన్లు తేలికగా సోకుతాయి. వీటి నుంచి దూరంగా ఉంచడానికి పసుపు, నిమ్మనూనె వంటివెలా ఉపయోగపడతాయో నిపుణులు చెబుతున్నారు.

Updated : 14 Jul 2023 04:40 IST

వర్షాకాలంలో మొక్కలకు ఇన్ఫెక్షన్లు తేలికగా సోకుతాయి. వీటి నుంచి దూరంగా ఉంచడానికి పసుపు, నిమ్మనూనె వంటివెలా ఉపయోగపడతాయో నిపుణులు చెబుతున్నారు.

కుల వెనుక మచ్చల వ్యాధి ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా వచ్చే చిగుళ్లకూ ఇది వ్యాపిస్తుంది. లీటరు నీటికి 5 ఎంఎల్‌ నిమ్మనూనె, 10 చుక్కల లిక్విడ్‌ డిష్‌ వాష్‌ కలిపిన మిశ్రమాన్ని రెండు వారాలకొకసారి మొక్కలపై స్ప్రే చేస్తుండాలి. కొన్నిసార్లు ఏం చేసినా ఇన్ఫెక్షన్లు దూరం కావు. అప్పుడు లీటరు నీటికి 10 ఎంఎల్‌ నిమ్మనూనె, రెండు టీ స్పూన్ల పసుపు, నాలుగైదు వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని కలపాలి. దీన్ని మొక్కలకు వారానికొకసారి స్ప్రే చేస్తే వ్యాధులు దూరమవుతాయి.   

పసుపుతో.. నేచురల్‌ ఏజెంట్‌గా పిలిచే పసుపులో పుష్కలంగా ఉండే యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. తొట్టెలు, మొక్కల మొదళ్లలో చేరుకున్న చీమలను దూరంగా ఉంచాలంటే తొట్టెలో చిటికెడు పసుపు చల్లితే సరి. మొక్కను తొట్టె మార్చేటప్పుడు మట్టిలో చెంచా పసుపు వేసి కలిపితే, పోషకాలను మొక్క తేలికగా గ్రహించడానికి తోడ్పడుతుంది. లీటరు నీటిలో టీ స్పూన్‌ పసుపు కలిపిన మిశ్రమాన్ని అందించినా మంచి ఫలితం ఉంటుంది. కొమ్మలు విరిగిన చోట పసుపు ముద్దను అద్ది, పాలిథీన్‌ కవరు కడితే, కొమ్మ ఎండిపోదు. గులాబీ మొక్కకు పూలు రాలిన తర్వాత కొన్నిసార్లు ఆ కొమ్మ నల్లగా మారుతుంటుంది. అలాగే వదిలేస్తే మొక్కంతా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం. నల్లగా మారినంతవరకు కొమ్మను కట్‌ చేసి అక్కడా పసుపు ముద్ద ఉంచితే తిరిగి కోలుకుంటుంది.

వ్యాధులకు మందుగా.. మొక్కలకొచ్చే కొన్నిరకాల ఫంగల్‌ వ్యాధులనూ పసుపు నివారిస్తుంది. ఆకులపై తెల్లని చుక్కల్లా కనిపిస్తే, లీటరు నీటిలో రెండు టీ స్పూన్ల పసుపు కలిపిన స్ప్రే చేయాలి. రెండు టీస్పూన్ల చొప్పున పసుపు, డిస్టిల్డ్‌ వైట్‌ వెనిగర్‌, 100 ఎంఎల్‌ పాలను లీటరు నీటికి కలపాలి. ఈ మిశ్రమాన్ని మొక్కపై స్ప్రే చేసినా ఇన్ఫెక్షన్ల బెడద ఉండదు. మందార, మల్లి వంటి మొక్కల కొమ్మలను విడిగా మట్టిలో నాటే ముందు అడుగున చిటికెడు పసుపు అద్దితే, త్వరగా ఆ ప్రాంతంలో వేర్లు వస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని