తోడుగా.. పెంచేయండి!

తక్కువ స్థలంలోనూ ఎక్కువ మొక్కలు పెంచాలా? కంపానియన్‌ ప్లాంటింగ్‌ విధానాన్ని అనుసరించండి. మూడు నాలుగు రకాల మొక్కలను విధానంలో ఒకే తొట్టెలో కలిపి నాటితే.. ఎదుగుదలకు సాయపడుతూనే పరాగసంపర్కం, కీటకబారి నుంచి తప్పించడంలో మొక్కలు ఒకదానికొకటి సాయపడతాయి.

Published : 15 Jul 2023 00:10 IST

తక్కువ స్థలంలోనూ ఎక్కువ మొక్కలు పెంచాలా? కంపానియన్‌ ప్లాంటింగ్‌ విధానాన్ని అనుసరించండి. మూడు నాలుగు రకాల మొక్కలను విధానంలో ఒకే తొట్టెలో కలిపి నాటితే.. ఎదుగుదలకు సాయపడుతూనే పరాగసంపర్కం, కీటకబారి నుంచి తప్పించడంలో మొక్కలు ఒకదానికొకటి సాయపడతాయి.

ఈ విధానంలో కాయగూరలు, ఆకు కూరలు లేదా పూల మొక్కలను ఒకే తొట్టెలో కలిపి పెంచొచ్చు. టొమాటో మొక్కలను పెంచాలన్నప్పుడు దానికి తోడుగా పచ్చిమిర్చి, తులసి వంటి మొక్కలు నాటాలి. మొక్కకు చీడపట్టకుండా ఇవి కాపాడతాయి. వెడల్పుగా ఉన్న తొట్టెను ఎంచుకొని  సేంద్రియ ఎరువులు కలిపిన మట్టిని నింపాలి. ఎప్పటికప్పుడు నీటి సౌకర్యాన్ని అందిస్తే చాలు. టొమాటో మొక్కలు ఎదుగడానికి అవసరమయ్యే వాతావరణాన్ని కంపానియన్‌ మొక్కలు అందించడమే కాకుండా తెగుళ్లు, శిలీంధ్ర వ్యాధులను దరిచేరనివ్వవు. అలాగే తులసి మొక్క నుంచి వచ్చే సువాసన టొమాటో మొక్కపై కీటకాలను దరిచేరనివ్వదు.

పూల మొక్కలతో.. టొమాటోకు మరోపక్క బంతి, చామంతి పెంచినా ప్రయోజనాలెక్కువే. టొమాటో ఎత్తుగా పెరిగినా, ఆ నీడలో హైబ్రిడ్‌ బంతి, చామంతి మొక్కలకు ఎదుగుదల సమస్య ఉండదు. చీడ బెడద లేకుండా చూడాలి. తొట్టె పెద్దదిగా ఉంటే లోపలివైపు చుట్టూ పెట్యూనియాలాంటి ఆర్నమెంటల్‌ ప్లాంట్స్‌ నాటొచ్చు. టొమాటో, బంతి, చామంతి, ఆర్నమెంటల్‌ ఫ్లవర్స్‌ విరబూసి తోటకే ప్రత్యేకమవుతాయి. ఈ విధానంలో టొమాటో పువ్వులు కాయలుగా మారడానికి పాలీనేటర్స్‌ ప్లాంట్స్‌గా బంతి పూలు పరాగసంపర్కానికి దోహదపడతాయి. వీటి నుంచి విడుదలయ్యే ఒక రకమైన రసాయనం ప్రభావంతో టొమాటోపై చేరే పురుగులు, తెల్లదోమలను దరిచేరవు.

ఆకుకూరల్లో.. కూరగాయలు, ఆకుకూరల పెంపకంలోనూ ఈ విధానం దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తోటకూర, బచ్చలి, పుదీనాకు తోడుగా పొద్దుతిరుగుడు పూల మొక్కలను చుట్టూ నాటితే మంచిది. కొత్తిమీరకు టొమాటో తోడు మంచిది. ప్రయోజనకరమైన కీటకాలను కొత్తిమీర  పరిమళం ఆకర్షిస్తుంది. దీంతో టొమాటోకి ఎదురయ్యే చీడను దరికి రానివ్వదు. టొమాటోతోపాటు ఉల్లి కాడలను కూడా పెంచుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని