చినుకుల్లో.. చిట్టి మొక్కలు

చినుకులు పడుతున్నవేళ బాల్కనీ, ఇండోర్‌లో వర్ణభరితమైన ఆకులున్న మొక్కలను ఎంచుకోవాలి. తేమకు ఆరోగ్యంగా ఎదిగేవాటికి పెద్దపీట వేస్తే ఇల్లంతా మొక్కలతో కళకళలాడుతుంది. కలేడియమ్స్‌... హృదయాకారంలో పెద్ద సైజు ఆకులతో మధ్యలో గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు వర్ణాల మిళితంతో కాంతిమంతంగా కనిపిస్తాయి.

Published : 29 Jul 2023 00:04 IST

చినుకులు పడుతున్నవేళ బాల్కనీ, ఇండోర్‌లో వర్ణభరితమైన ఆకులున్న మొక్కలను ఎంచుకోవాలి. తేమకు ఆరోగ్యంగా ఎదిగేవాటికి పెద్దపీట వేస్తే ఇల్లంతా మొక్కలతో కళకళలాడుతుంది.

కలేడియమ్స్‌... హృదయాకారంలో పెద్ద సైజు ఆకులతో మధ్యలో గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు వర్ణాల మిళితంతో కాంతిమంతంగా కనిపిస్తాయి. రెండు మూడు వర్ణాలను కలిపి ఒక పెద్ద తొట్టెలో ఉంచితే రంగులన్నీ ఒకచోటే అన్నట్లుగా అనిపించి అందంగా ఉంటుంది. వర్షాకాలంలో ఎదుగుదల ఆరోగ్యంగా కనిపిస్తుంది. వాతావరణంలో తేమ ఉంటే ఈ మొక్క త్వరగా చిగురిస్తుంది. వర్షాలు పడుతున్నప్పుడు నెలకొకసారి నీటిని అందించినా చాలు. రోజులో రెండు మూడు గంటలు ఎండ పడేలా బాల్కనీలోనూ ఉంచొచ్చు. ఎరువుల అవసరం  ఎక్కువగా ఉండదు.

ఫెర్న్‌..  తేమనిష్టపడే మొక్కలివి. లెమన్‌ బటన్‌ ఫెర్న్‌ రకం ఇండోర్‌లో పెరుగుతుంది. బటన్స్‌ ఆకారం ఆకులతో ఉండి, ఏ గదిలో అయినా ఇట్టే ఒదిగిపోతుంది. అలాగే కాటన్‌ క్యాండీ బోస్టన్‌ ఫెర్న్‌ కూడా ఈ సీజన్‌కు సరిగ్గా సరిపోతుంది. దీనికి మూడునాలుగు రోజులకొకసారి నీటిని అందించినా చాలు.  

అరోయిడ్స్‌ జాతి..  అలోకేసియా, మాన్‌స్టెరా, ఫిలోడెండ్రాన్స్‌, ఆంథూరియమ్స్‌ వంటివి వర్షాకాలంలో ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఫంగల్‌, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఈ మొక్కలకు త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా పరిరక్షిస్తే వానాకాలంలో ఇంటికి అందాన్నిస్తాయివి.
ఫిట్టోనియా.. ముదురాకుపచ్చ, తెలుపు, ఎరుపు, గులాబీ రంగులో చిన్నచిన్న ఆకులతో చూడ ముచ్చటగా 18 అంగుళాలకన్నా ఎక్కువ పెరగదీ ఇండోర్‌ ప్లాంట్‌. గాలి తక్కువగా, తేమగా ఉండే గదుల్లో ఇది బాగా పెరుగుతుంది.

ట్రేడ్‌స్కాంటియా.. లేత, ముదురు ఊదావర్ణంపై ఆకుపచ్చని, తెలుపు గీతలుండే ఆకులతో ఈ మొక్క గదికే ప్రత్యేకతనిస్తుంది. వానాకాలంలో ఇండోర్‌ మొక్కగా దీన్ని ఎంచుకోవచ్చు. వాతావరణంలో తేమ ఉంటే, ఆరోగ్యంగా ఎదుగుతుంది. తొట్టెలో మట్టిని ఆరనిచ్చిన తర్వాత నీటిని అందిస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని