మా పుట్టింటివాళ్లను తిడుతున్నాడు
నాకు పెళ్లై ఆరేళ్లు. మావారికి ఎప్పుడు కోపం వచ్చినా మా అమ్మానాన్నలను, కుటుంబ సభ్యులను తిడుతూ, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మా అత్తమామలు, ఆడపడుచు కూడా నన్నూ, మా వాళ్లనే తప్పు పడుతూ దూషిస్తున్నారు.
నాకు పెళ్లై ఆరేళ్లు. మావారికి ఎప్పుడు కోపం వచ్చినా మా అమ్మానాన్నలను, కుటుంబ సభ్యులను తిడుతూ, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మా అత్తమామలు, ఆడపడుచు కూడా నన్నూ, మా వాళ్లనే తప్పు పడుతూ దూషిస్తున్నారు. నేనే విషయాల్నీ ప్రశ్నించకుండా ఉన్నంతసేపూ బాగుంటారు. అలాకాకుండా దేన్నైనా వ్యతిరేకిస్తే చాలు... నా మీద మాటల దాడి చేస్తుంటారు. అవన్నీ మర్చిపోయి ఉండటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.
- ఓ సోదరి
పెళ్లవ్వగానే ఆడపిల్ల అప్పటివరకూ ఎంతో అపురూపంగా చూసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అందరినీ వదిలిపెట్టి మెట్టినింట అడుగుపెడుతుంది. ఈ వేడుక పూర్తయ్యే వరకూ జరిగిన చిన్న చిన్న విషయాలతో సమస్య ఆరంభమవుతుంది. దానికి ఆ తర్వాత వచ్చే మాట పట్టింపులు, ఆస్తి తగాదాలు... వంటి వేర్వేరు కారణాలు తోడవుతాయి. దాంతో భర్త తరఫువారు ఆమె కుటుంబాన్ని శత్రువుల్లా చూడటం మొదలుపెడతారు. కొందరు ఆలుమగలు జీవితాంతం నీ వాళ్లూ, నా వాళ్లూ అంటూ పోట్లాడుకుంటూనే ఉంటారు. వాస్తవానికి పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఏకమవ్వడంతో పాటు రెండు కుటుంబాలు కలవడం కూడా. దాన్ని తెలుసుకుని ఇరువైపుల వారినీ సహృదయంతో అర్థం చేసుకున్నప్పుడే సమస్యలకు దూరంగా ఉండగలరు. ఈ విషయాల్ని ఎవరికి వారు తెలుసుకోగలగాలి. లేదా మూడో వ్యక్తితో చెప్పించాలి. ఇక, విషయానికి వస్తే... మీ భర్త మిమ్మల్ని అనలేక మీ తరఫున వారిని అనడం ద్వారా మిమ్మల్ని బాధపెట్టి తన అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. అతడిని వారించాల్సిన మీ అత్తమామలు దానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. మీ వారిలో మార్పు రావాలనుకుంటే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ సాయం తీసుకోండి. ముందు వారు అతడు తిట్టడానికి కారణాలు తెలుసుకుంటారు. వీలైతే అతడిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోతే మానసిక క్షోభపెడుతున్నాడని గృహహింస కింద కేసు పెట్టండి. అయితే, ఇలా పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం, డీవీసీ కేసు పెట్టడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.