వంటింటి తోటకు ఇవి చాలు!
ఇంటి ముందు మొక్కలుంటే ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఇప్పుడందరూ మిద్దెలపైనా, పెరట్లోనూ, కిచెన్ బాల్కనీల్లోనూ పచ్చదనాన్ని పెంచుకోవాలని పరితపిస్తున్నారు. ఇలా సులువుగా పెంచుకోగలిగే రకాలు ఇవన్నీ...
ఇంటి ముందు మొక్కలుంటే ఆ ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ఇప్పుడందరూ మిద్దెలపైనా, పెరట్లోనూ, కిచెన్ బాల్కనీల్లోనూ పచ్చదనాన్ని పెంచుకోవాలని పరితపిస్తున్నారు. ఇలా సులువుగా పెంచుకోగలిగే రకాలు ఇవన్నీ...
కొత్తిమీర... కూరల్లో కొత్తిమీరను తాజాగా వాడుకోవాలంటే... ధనియాలను రాయితోనో, చేత్తోనో కాస్త నలిపి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. వాటిని ఉదయాన్నే కుండీల్లో చల్లుకోవాలి. దీన్ని నేరుగా ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతుంటే.. ఇరవై రోజులు దాటాక మొలకలు మొదలవుతాయి. కాస్త పెరిగాక తెంచుకుని వాడుకోవచ్చు.
పుదీనా... దీన్ని పెంచడం చాలా తేలిక. మనం మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనా ఆకులు వాడుకుని వేర్లను మట్టిలో నాటండి. ఆపై కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఉంటే క్రమంగా చిగుళ్లు వస్తాయి. పుదీనా ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి రోగాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. కూరలకూ మంచి రుచీ, సువాసననూ ఇస్తుంది.
తులసి... దీన్ని ఇంటి డాక్టరుగా పిలుచుకుంటాం. ప్రతి ఇంటి పెరట్లోనో, బాల్కనీలోనో తప్పక ఉండేలా చూసుకుంటాం. అనేక అనారోగ్య సమస్యల నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. దీని నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల కూడా కొన్ని రోగాలను నివారించగలం. పెంచడమూ తేలికే.
రణపాల... సర్వరోగ నివారిణిగా దీనిని పిలుస్తారు. ఇది మట్టితోపాటు నీటిలోనూ పెరుగుతుంది. దీని ఆకుల నుంచి కూడా వేర్లు వచ్చి సులభంగా పెరుగుతుంది. ఇది ఆస్తమా, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు తగ్గించడానికి ఔషధంలా ఉపయోగపడుతుంది.
వామాకు... తక్కువ శ్రద్ధపెట్టినా సులువుగా పెరిగే మొక్క వాము. కొమ్మను నాటినా సులువుగా నిలదొక్కుకుంటుంది. ఇది సహజ మౌత్‌ప్రెష్‌నర్‌లానూ, కడుపునొప్పికి ఉపశమనంగా పనిచేస్తుంది. మంచి సువాసనా వస్తుంది.
లెమన్‌గ్రాస్... ఈ మొక్క నుంచి కాండాన్ని వేరు చేసి నీటిలో ఉంచాలి. నిమ్మగడ్డి రెండు అంగుళాల పొడవు పెరిగే వరకు రోజూ నీటిని మారుస్తూ ఉండాలి. ఆ తర్వాత దాన్ని కుండీలోకి మార్చుకోవాలి. అయితే, ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు పోయడం మరిచిపోవద్దు. నేరుగా ఎండ తగిలేచోట ఈ తొట్టెను ఉంచితే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.