జీతం తక్కువని నేనే చేయాలట!

మావారి కన్నా నాకు జీతం తక్కువ. నిజానికి నాకు మంచి అవకాశం వచ్చినా బాబు, ఇంటి పనులను చూసుకుంటూ ఇంటి నుంచే పని చేయొచ్చని ఈ సంస్థలో  కొనసాగుతున్నా. ఇంట్లో ఏ సాయమడిగినా ‘నీ జీతం తక్కువ.

Published : 16 Aug 2023 12:55 IST

మావారి కన్నా నాకు జీతం తక్కువ. నిజానికి నాకు మంచి అవకాశం వచ్చినా బాబు, ఇంటి పనులను చూసుకుంటూ ఇంటి నుంచే పని చేయొచ్చని ఈ సంస్థలో  కొనసాగుతున్నా. ఇంట్లో ఏ సాయమడిగినా ‘నీ జీతం తక్కువ. నువ్వే చేయాలి’ అంటున్నారు. ఇంటి పనికి విలువ లేదా? ఆయనతో మాట్లాడాలా? ఉద్యోగం మారడమే పరిష్కారమా?

- శ్రీవల్లిక, బెంగళూరు

మెరుగైన జీవితం కావాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు మగవారూ ఇంటి పనులు పంచుకోవాలన్న మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే మనకీ పని సులువవుతుంది. కానీ అలా ఆలోచించట్లేదు. కాబట్టే, చాలామంది ఆడవాళ్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఇంటిపని ఆడాళ్లది అన్న తీరు బలంగా నాటుకుపోయింది. బహుశా మీవారూ అలాగే ఆలోచిస్తున్నారేమో! అందుకే జీతాన్ని కారణంగా చెబుతుండొచ్చు. అలాగని మీ పని మీరు చేసుకుంటూ వెళితే అవతలివారికి ఎప్పటికీ అర్థమవదు. ముందు ఆఫీసు, ఇతర విషయాల్లో తన ఇబ్బందులను అర్థం చేసుకొని, వీలైన సాయం చేయండి. ఆపై మీ ఇబ్బందులను చెబితే అర్థం చేసుకునే అవకాశముంది. పని తెలియకా సాకులు వెతుకుతుండొచ్చు. కాబట్టి, వంతులు వేసుకున్నట్టు కాకుండా సాయం కోరుతున్నట్లుగా అడగండి. చేయగలిగినవే అప్పగిస్తే సరి. అయినా పరిస్థితిలో మార్పు రాకపోతే.. నేరుగానే మాట్లాడండి. కుటుంబం కోసం ఏమేం చేస్తున్నారో చెబుతూనే అవతలి వ్యక్తి నుంచి ఏమేం ఆశిస్తున్నారో సూటిగా చెప్పండి. అయితే నిందిస్తున్నట్లుగానో, కోపం వ్యక్తం చేస్తున్నట్లుగానో మీ మాట తీరు ఉండకూడదు. ధైర్యంగా, ప్రశాంత స్వరంతో మాట్లాడండి. పని పంచుకోవడం దగ్గర్నుంచి, నిర్ణయాలు ఏకపక్షంగా సాగడం వల్ల వచ్చే ఇబ్బందులు అన్నింటి ప్రస్తావనా తెండి. అప్పుడే మీ ఆలోచనలూ తెలుస్తాయి. నెమ్మదిగా మీ అనుబంధంలో సమానత్వం, పరస్పర గౌరవం వంటివాటికీ చోటు ఏర్పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని