సమస్యల్ని.. ఉతికేద్దాం!

రోజూ ఇల్లంతా ఊడ్చి శుభ్రపరుస్తాం. దుస్తుల్నీ ఓ సారి వేసుకోగానే ఉతుకుతాం. కానీ, నిత్యం వినియోగించే కొన్నింటి విషయంలో మాత్రం అశ్రద్ధ చూపిస్తాం. మరి అవేంటో? ఎందుకు వాటి పరిశుభ్రతపై దృష్టిపెట్టాలో చూద్దామా! 

Published : 18 Aug 2023 00:03 IST

రోజూ ఇల్లంతా ఊడ్చి శుభ్రపరుస్తాం. దుస్తుల్నీ ఓ సారి వేసుకోగానే ఉతుకుతాం. కానీ, నిత్యం వినియోగించే కొన్నింటి విషయంలో మాత్రం అశ్రద్ధ చూపిస్తాం. మరి అవేంటో? ఎందుకు వాటి పరిశుభ్రతపై దృష్టిపెట్టాలో చూద్దామా! 

సాధారణంగా... దుప్పట్లు మాసిపోతేనే ఉతుకుతాం. లేదంటే ఏ పది రోజులకో మారుస్తాం. కానీ, ఆస్తమా, ఎగ్జిమా వంటి సమస్యలున్న వారు రెండు రోజులకోసారైనా వాటిని ఎండలో ఆరనివ్వాలి. ఐదు రోజులకోసారైనా ఉతికేయాలి. లేదంటే దుప్పట్లలోని డస్ట్‌మైట్స్‌ వ్యాధిని తీవ్రతరం చేస్తాయి. వీటిని చన్నీళ్లకు బదులుగా వేడి నీళ్లతో ఉతికి ఆరబెట్టాలి. గలేబులని తరచూ ఉతుకుతాం. కానీ దిండ్లని ఉతకడం సాధ్యం కాదనుకుంటే కనీసం ఎండలో ఐదారు గంటలైనా ఉండనిచ్చి దులిపేయండి. 

 పరుపులు మురికి అవ్వకుండా కవర్‌ తొడగడం తప్పనిసరి. వీటిని వాక్యూమ్‌ సాయంతో శుభ్రం చేయొచ్చు. ఆపై బేకింగ్‌ సోడా నీళ్లూ కలిపిన మిశ్రమంలో ముంచిన స్పాంజితో మొత్తం తుడిచేయొచ్చు. లేదంటే ఎండలోపెట్టి... షాంపూలో ముంచిన వస్త్రంతో మరకలు ఉంటే తుడిస్తే సరి. శుభ్రపడతాయి.

 కార్పెట్లని సంవత్సరాలు తరబడి ఉతక్కుండా అలానే వదిలేయద్దు. కనీసం ఏడాదికి ఒకసారైన వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేస్తే గది అలర్జీ కారకాలతో నిండకుండా ఉంటుంది.

 జీన్స్‌ కదా ఉతకడం కష్టం అని చెప్పి... ఓ పదిసార్లు వేసుకున్న తర్వాత ఉతుకుదాంలే అనుకోవద్దు. రెండూ లేదా మూడు సార్లు వేసుకున్న తర్వాత చల్లని నీళ్లలో ఉతికేస్తే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని