నా మీదే ఆధారపడుతోంది!

ఒంటరి తల్లిని. తండ్రిలేని పిల్ల అని పాపకు అన్నీ దగ్గరుండి సమకూర్చేదాన్ని. తన సమస్యేదైనా నేనే పరిష్కరించాలి. డిగ్రీ చదువుతున్నా నామీదే ఆధారపడుతోంది. ఇలాగైతే పైచదువులు, ఉద్యోగ సమయంలో సమస్య అవుతుంది కదా? తనలో ఆత్మవిశ్వాసం నింపుతూ తన కాళ్ల మీద తను నిలబడాలంటే ఏం చేయాలి?

Updated : 13 Sep 2023 14:13 IST

ఒంటరి తల్లిని. తండ్రిలేని పిల్ల అని పాపకు అన్నీ దగ్గరుండి సమకూర్చేదాన్ని. తన సమస్యేదైనా నేనే పరిష్కరించాలి. డిగ్రీ చదువుతున్నా నామీదే ఆధారపడుతోంది. ఇలాగైతే పైచదువులు, ఉద్యోగ సమయంలో సమస్య అవుతుంది కదా? తనలో ఆత్మవిశ్వాసం నింపుతూ తన కాళ్ల మీద తను నిలబడాలంటే ఏం చేయాలి? అలా సిద్ధం చేసే క్రమంలో ఏమేం గుర్తుంచుకోవాలి?

- ఓ సోదరి

ఒంటరి తల్లి, పైగా ఉద్యోగిని.. ఆత్మవిశ్వాసం, స్వతంత్ర భావాలుండేలా పిల్లలను పెంచడం కొంచెం కష్టమే. ముందు ఏదైనా సొంతంగా చేసేలా చూడండి. విఫలమైనా పర్లేదని ప్రోత్సహించండి. అప్పుడే ఆత్మవిశ్వాసం, పరిణతి పెరుగుతాయి. అవకాశాలు, ప్రతిభ ఉన్నా తమపై తమకు నమ్మకం లేకే చాలామంది విఫలం అవుతుంటారు. ముందు ‘నేను చేయగల’నని తను నమ్మితే చాలు.. మీ బెంగ తీరినట్లే. అయితే దీనికి సమయం, సాధన కావాలి. కాబట్టి.. తనపై తనకున్న అభిప్రాయం, బలాలు, బలహీనతలు అన్నింటినీ రాయమనండి. ఆఫీసులో కష్టపడి పనిచేసినా చాలామంది మహిళలకు గుర్తింపు దక్కదు. ఇందుకు ప్రధాన కారణం వారిపై వారికి అవగాహన, ప్రమోట్‌ చేసుకునే నైపుణ్యం లేకపోవడం వల్లే. తనని తాను తెలుసుకునేలా చేస్తే ఏం చేయాలన్న దానిపై ఆమెకే అవగాహన వస్తుంది. ఇప్పటివరకూ మీమీదే ఆధారపడింది కాబట్టి, నాకేమీ రాదని బాధపడొచ్చు. అప్పుడు ఆమె బలాలను చెప్పి వెన్నుతట్టండి. వస్త్రధారణ కూడా ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. అవసరమైతే నిపుణుల సాయంతో దాన్నీ మార్చండి. పెద్ద వ్యాపారవేత్తలు, ఏదైనా సాధించినవారి వీడియోలు చూపించండి. వాళ్లు ఎదిగిన క్రమాన్ని కథలుగా చెప్పండి. అవసరమైతే వారి శైలిని అనుసరించమనొచ్చు. నెమ్మదిగా ఒక్కో నిర్ణయం తననే తీసుకునేలా చేయండి.. మార్పు సాధ్యమే. ఈ క్రమంలో మీరూ ఓపికగా, దృఢంగా ఉండాలి మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని