వేలాడే విరులు...

బాల్కనీ, వరండా, గదుల మధ్యలో వేలాడదీసే మొక్కలకు పూలు విరబూస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ! ఇవి ఇంటి అందాన్ని పెంచి మనసుని ఆహ్లాదంతో నింపేస్తాయి. ఆ పూలమొక్కలేంటో తెలుసుకుందాం.. గులాబీ, ఎరుపు, నీలం, ఊదా, పసుపు, తెలుపు వర్ణాల్లో పూలు పూస్తూ నిత్యం ఈ మొక్క ...

Published : 20 Nov 2023 01:38 IST

బాల్కనీ, వరండా, గదుల మధ్యలో వేలాడదీసే మొక్కలకు పూలు విరబూస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ! ఇవి ఇంటి అందాన్ని పెంచి మనసుని ఆహ్లాదంతో నింపేస్తాయి. ఆ పూలమొక్కలేంటో తెలుసుకుందాం..

పెటూనియా.. గులాబీ, ఎరుపు, నీలం, ఊదా, పసుపు, తెలుపు వర్ణాల్లో పూలు పూస్తూ నిత్యం ఈ మొక్క ఇంటిని రంగులమయంగా మార్చేస్తుంది. ఏ సీజన్‌లోనైనా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఎండ పడేచోట ఉంచి, నెలకోసారి సేంద్రియ ఎరువును కలిపిన మట్టిని జత చేస్తే చాలు.

మిలియన్‌ బెల్స్‌.. ఎరుపు, పసుపు, ఊదా, తెలుపు, నీలం, మెజంతా రంగుల్లో ఈ పూలు నిండుగా విరబూస్తాయి. ఇవీ పెటూనియా జాతికి చెందినవే. ఎండని తట్టుకుంటాయి. తొట్టెలో మట్టి తడి పొడిగా ఉండేలా జాగ్రత్త పడితే చాలు.

జెరానియం.. ఎరుపు, ఊదా, గులాబీ, తెలుపు రంగుల్లో లభ్యమయ్యే ఈ మొక్కని వరండా లేదా బాల్కనీలో వేలాడదీయొచ్చు. ఎండపడేలా జాగ్రత్తపడితే ఏడాది పొడవునా పూలు పూస్తాయి. తొట్టెలో మట్టి బాగా పొడారిన తర్వాత నీటిని అందిస్తే చాలు.

టేబుల్‌రోజ్‌.. చిన్న కొమ్మను నాటినా చాలు తేలిగ్గా బతికేస్తుంది. నారింజ, గులాబీ, ఎరుపు రంగుల పూల కొమ్మలన్నింటినీ కలిపి ఒకే తొట్టెలో నాటి, బాల్కనీ లేదా వరండాలో వేలాడదీస్తే చాలు. రంగులన్నీ కలబోసినట్లుగా వివిధ వర్ణాల పూలతో ఇంటికి  అందం వస్తుంది. ఎంత ఎండనైనా తట్టుకోగలదు. తొట్టెలో మట్టితోపాటు ఇసుకనూ కలిపితే పూలు ఎక్కువగా పూస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని