మెనోపాజ్‌కీ మలబద్ధకానికీ సంబంధం ఉందా?

నా వయసు యాభై ఏళ్లు. కొన్నాళ్లుగా మలబద్ధకంతో బాధపడుతున్నా. దీంతో కడుపుబ్బరం, అసౌకర్యం వేధిస్తున్నాయి. మెనోపాజ్‌కి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆహారపుటలవాట్లతో ఏమైనా ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉందా?

Published : 13 Jun 2024 15:48 IST

నా వయసు యాభై ఏళ్లు. కొన్నాళ్లుగా మలబద్ధకంతో బాధపడుతున్నా. దీంతో కడుపుబ్బరం, అసౌకర్యం వేధిస్తున్నాయి. మెనోపాజ్‌కి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆహారపుటలవాట్లతో ఏమైనా ఈ సమస్యను తగ్గించుకునే అవకాశం ఉందా?

లలిత, హైదరాబాద్‌

మెనోపాజ్‌ దశలో మలబద్ధకం సమస్య కనిపించడం అసాధారణం కాదు. హార్మోన్ల అసమతుల్యత వల్ల అంటే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ల హెచ్చు తగ్గుల వల్ల జీర్ణ ప్రక్రియ వేగం మందగిస్తుంది. దీనికి తోడు ఆడవారిలో వయసు పెరిగే కొద్దీ పెల్విక్‌ కోర్‌ మజిల్స్‌ బలహీనమవుతాయి. అలానే, కొన్నిరకాల మందులు అంటే థైరాయిడ్, బీపీ, ఐరన్‌ మాత్రలతో పాటు యాంటీ డిప్రెసెంట్స్‌ వల్లా ఇలా కావొచ్చు. దీన్ని ఆహారపుటలవాట్లతోపాటు కొన్ని వ్యాయామాల ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా రిజిస్టర్‌ డైటీషియన్‌తో మీ శరీర అవసరాలకు తగ్గట్లు డైట్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకుంటే మేలు. లేకపోయినా అధిక పీచు ఉండే పదార్థాలు తీసుకోవడం ప్రారంభించండి.. అంటే..తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పాలిష్‌ పట్టని గోధుమలు, క్వినోవా, మొక్కజొన్నల నుంచి వచ్చిన పిండి, రవ్వలతో చేసినవన్నీ ఈ తరహానే. పప్పుల్లో సెనగలు, బొబ్బర్లు, పెసర్లు వంటివి తరచూ తినాలి. ఇక, కాలానుగుణంగా స్థానికంగా దొరికే పండ్లు... బత్తాయి, జామ, బొప్పాయి... వంటివాటిల్లోనూ అధిక మోతాదులో పీచు లభిస్తుంది. ఇక, కూరగాయల్లో పచ్చిగా తినగలిగే రకాలు కీరా, క్యారెట్, టొమాటోల నుంచీ,  కూర రూపంలో అయితే చిక్కుళ్లు, గోరు చిక్కుళ్లు, బెండకాయ, దోసకాయ వంటివాటినీ మీ డైట్‌లో చేర్చుకోండి. రోజూ ఐదారు నానబెట్టిన బాదం, టీ స్పూన్‌ అవిసెలు, గుమ్మడి గింజలు వంటి నట్స్‌ తీసుకుంటే... ఇవన్నీ స్టూల్‌ని సాఫీగా వెళ్లేలా చేస్తాయి. మెంతులు నానబెట్టి తిన్నా సాల్యుబుల్‌ ఫైబర్‌ దొరుకుతుంది..అయితే, తినేవాటికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో! తినకూడనివాటి జోలికి పోకుండా ఉండటమూ అంతే ముఖ్యం. వాటిల్లో ప్రధానంగా రిఫైన్డ్, ప్రాసెస్‌ చేసిన ఆహార ఉత్పత్తులైన బేకరీ ఐటెమ్స్, మైదాతో చేసిన తినుబండారాలూ, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ వంటివాటికి దూరంగా ఉండాలి.  అప్పుడే జీర్ణాశయ కదలికలు మెరుగ్గా ఉంటాయి. మలబద్ధకం అదుపులో ఉంటుంది. అయితే, దీంతోపాటు తప్పనిసరిగా రోజూ కనీసం అరగంటైనా వ్యాయామాలు చేయాలి. నడక, పరుగు, ఈత, సైక్లింగ్‌ ఏదైనా మంచిదే.. అలానే పెల్విక్‌ ఫ్లోర్‌ వర్కవుట్లనూ చేయండి. ఇవి బ్లాడర్, జీర్ణాశయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్