టొమాటో పండిద్దాం రండి!

కూరకు రుచి రావాలన్నా, కాస్త ఒదుగు ఉండాలన్నా వంటకంలో టొమాటో పడాల్సిందే అంటారు గృహిణులు. అందుకే, ఎప్పుడైనా కాస్త రేటెక్కువైతే బెంబేలెత్తిపోతారు. మరి ఈ ఇబ్బంది లేకుండా వీటిని మన పెరట్లోనే సులువుగా పెంచుకోగలిగితే ఎంత సంతోషమో కదా! మీకోసమే ఈ చిట్కాలు...

Published : 27 Jun 2024 01:35 IST

కూరకు రుచి రావాలన్నా, కాస్త ఒదుగు ఉండాలన్నా వంటకంలో టొమాటో పడాల్సిందే అంటారు గృహిణులు. అందుకే, ఎప్పుడైనా కాస్త రేటెక్కువైతే బెంబేలెత్తిపోతారు. మరి ఈ ఇబ్బంది లేకుండా వీటిని మన పెరట్లోనే సులువుగా పెంచుకోగలిగితే ఎంత సంతోషమో కదా! మీకోసమే ఈ చిట్కాలు...

సొలనేసి కుటుంబానికి చెందినది టొమాటో ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ... అమెరికాలోని పెరూవియా, మెక్సికో ప్రాంతాల నుంచి ప్రయాణం ప్రారంభించి ప్రపంచమంతా చుట్టేసింది. మొదట్లో దీన్ని అలంకరణకోసం పెంచుకునేవారు. కానీ, తరవాత ఇవి విషపూరితమనే ప్రచారం మొదలవడంతో అమెరికన్లు తినడానికి భయపడేవారట. కాల గమనంలో వీటిని నేరుగా తిన్నా, వంటకాల్లో వాడినా ఎటువంటి అనారోగ్యాలూ తలెత్తకపోవడంతో టొమాటో అందరి ఫేవరెట్‌ అయిపోయింది. పోర్చుగీసు వారితో మనదేశానికి వచ్చింది టొమాటో. బ్రిటిష్‌ వారి హయాంలో పెద్ద ఎత్తున సాగు మొదలయ్యింది. అమెరికన్లలానే మనదేశంలోనూ మొదట దీన్ని తినడానికి అంతా భయపడేవారట. ఇక, తెలుగునాట దీన్ని తక్కోళం, సీమ వంకాయ, రామములక్కాయ, ఎర్ర వంకాయ... ఇలా చాలా పేర్లతో పిలిచేవారట.

ఎన్నెన్నో రకాలు...

టొమాటోల్లోనూ ఎల్లో పియర్, బ్లాక్‌ క్రిమ్, బ్రాండీవైన్, గ్రీన్‌సాసే, గార్డెన్‌ పీచ్‌ ఇలా ఏడువేలకు పైగా రకాల్లో ఇవి లభిస్తున్నాయి.  మనకి ఎరుపు రంగువే ఎక్కువగా కనిపించినా పసుపు, నారింజ, ఊదా, గులాబీ, నీలం, గోధుమ, తెలుపు, పచ్చ వంటి ఎన్నో వర్ణాల్లోనూ ఇవి దొరుకుతున్నాయి. బఠాణీ గింజ సైజు నుంచి చిన్న దోసకాయ వరకూ పరిమాణాలు, ఆకృతుల్లోనూ లభిస్తున్నాయి. టొమాటోలను పెంచాలనుకుంటే వాటి వేర్లు విస్తరించేందుకు వీలుగా కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న కుండీని ఎంచుకోవాలి. వీటికి సూర్యకాంతి నేరుగా తగిలేలా చూసుకోవాలి. ఆ పరిస్థితి లేకపోతే కనీసం 14 నుంచి 18 గంటల పాటు కృత్రిమ కాంతి అందేలా ఏర్పాటు చేయాలి. మూడు వంతుల మట్టి ఒక వంతు కంపోస్ట్‌ని చేర్చి కుండీని నింపుకోవాలి. ఇందులో విత్తనాలు నాటాలి. అప్పటి నుంచి ప్రతి రెండు వారాలకోసారి కాసిని ఎరువులనూ చల్లడం తప్పనిసరి. విత్తు మొలకెత్తాక క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. మొదళ్లలో ఉండే మట్టి ఎండిపోకుండా మల్చింగ్‌ చేయాలి. ఇవి నిలబడటానికి సరైన ఆధారం ఇవ్వాలి.. ఈ మొక్కలకు సాధారణంగా తెల్లదోమ పట్టి పీడిస్తుంది. బేకింగ్‌ సోడా, సర్ఫ్‌ మిశ్రమాన్ని చల్లితే సమస్య దూరమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్