పూజా సామగ్రితో సంస్కారా హోమ్‌!

ఎంత మోడరన్‌ ఆలోచనలు ఉన్నవారైనా... శుభకార్యం, పండగల వేళ సంప్రదాయానికే చోటిస్తారు. పర్యావరణంపై ప్రేమ, సంస్కృతికి ప్రాధాన్యమివ్వాలనే ఆలోచన... ఏదైతేనేం అలనాటి లోహ వస్తువులకు ఇంట్లో చోటిస్తున్నవారూ పెరుగుతున్నారు. అలాంటప్పుడు దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదు అనుకున్నారు రైనా, అంజనా సింఘ్వి.

Published : 28 Jun 2024 02:51 IST

ఎంత మోడరన్‌ ఆలోచనలు ఉన్నవారైనా... శుభకార్యం, పండగల వేళ సంప్రదాయానికే చోటిస్తారు. పర్యావరణంపై ప్రేమ, సంస్కృతికి ప్రాధాన్యమివ్వాలనే ఆలోచన... ఏదైతేనేం అలనాటి లోహ వస్తువులకు ఇంట్లో చోటిస్తున్నవారూ పెరుగుతున్నారు. అలాంటప్పుడు దీన్నే వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదు అనుకున్నారు రైనా, అంజనా సింఘ్వి. ‘సంస్కారా హోమ్‌’ పేరుతో సంస్థను ప్రారంభించి, దూసుకెళుతున్నారు కూడా!

రైనా, అంజన అక్కాచెల్లెళ్లు. వీరిది తమిళనాడు. రైనా... మాంచెస్టర్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో పీజీ చేసింది. హైదరాబాద్‌ గూగుల్‌లో రెండేళ్లు పనిచేసింది. ఆపై కుటుంబ వ్యాపారం బాధ్యతలు తీసుకుంది. తూత్తుకూడిలో వీరికి పూల వ్యాపారముంది. పూలను ఎండబెట్టి 22 దేశాలకు ఎగుమతి చేస్తారు. దేశంలో అతిపెద్ద క్యాండిళ్ల తయారీ సంస్థ కూడా వీళ్లదే. సప్లై చెయిన్‌ ఆపరేషన్స్, దేశవిదేశాల నుంచి ఆర్డర్లను తీసుకోవడం వంటివన్నీ రైనానే చేసేది. దీంతోనే ఆగిపోకూడదు అనుకున్న ఆమె సొంతంగా పిల్లల కోసం లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘జిబుల్‌ అండ్‌ కజీ’ ప్రారంభించింది. ఇక అంజన... న్యూయార్క్‌లోని పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి గ్రాఫిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ డిజైన్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ప్రముఖ సంస్థల నుంచి ఇంటర్న్‌షిప్‌లు చేశాక సొంతంగా ‘చిప్పర్‌ క్రియేటివ్‌’ అనే స్టూడియోను ఏర్పాటు చేసింది. తన గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అనుభవంతో కస్టమైజ్‌డ్‌ స్నీకర్స్‌ను చేసిచ్చే సంస్థ ‘స్నీక్‌ నో మోర్‌’నీ ప్రారంభించింది. ఇవన్నీ లాభాల బాటలో నడుస్తున్నవే. అయినా అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి పనిచేయాలనుకున్నారు. అప్పుడే వారి దృష్టి...పూజ, సంప్రదాయ వస్తువులపై పడింది. అలా 2022లో ‘సంస్కారా హోమ్‌’ మొదలైంది.

‘ప్రత్యేక సందర్భాలనో, మానసిక ప్రశాంతత కోసమో... దైవారాధనను ఆధునిక తరాలూ కొనసాగిస్తున్నాయి. పైగా మన సంప్రదాయాలను మెచ్చి గృహాలంకరణలో ప్రత్యేక చోటిస్తున్నారు. పెరిగిన పర్యావరణ స్పృహతో సస్టెయినబుల్‌ వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. దానికి తగ్గ చేతివృత్తుల కళాకారులు మనవద్ద చాలామందే ఉన్నారు. వినియోగదారులకు తగినవి అందిస్తూనే చేతివృత్తుల వారికీ ఉపాధి కల్పించొచ్చని ‘సంస్కారా హోమ్‌’ ప్రారంభించాం. ఆర్గానిక్‌ పూజసామగ్రి, రాఖీలు, కుండీలు, దేవతావిగ్రహాలు, దీప కుందులు... లాంటివెన్నో అందిస్తున్నాం. ‘చక్కగా కుటుంబ వ్యాపారం చూసుకోవచ్చుగా! కొత్త ప్రయత్నాలెందుకు’ అనేవారూ చాలామందే. కొనసాగించడం కష్టమని తెలిసినా.. వారసత్వంగా వచ్చింది, దాన్ని నడిపించడంలో గొప్పేముంది అనేవారూ ఎక్కువే. వీటితో మా సత్తా నిరూపించుకోవడమే కాదు... ఆసక్తికీ ప్రాధాన్యమిచ్చినట్లు అవుతుంది. అందుకే నచ్చినవి ప్రయత్నిస్తూ వెళుతున్నాం. బోలెడంత పరిశోధన చేశాకే రంగంలో దిగుతున్నాం. కాబట్టే... విజయవంతంగా కొనసాగిస్తున్నా’మంటున్నారీ సోదరి ద్వయం. రూ.కోట్ల టర్నోవర్‌తో దూసుకెళుతున్న వీరికి ఇంకా చాలా వ్యాపార ఆలోచనలు ఉన్నాయట. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్