ఇద్దరు పిల్లలున్నారు... పెళ్లికాలేదట!

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఆ తరవాతే తెలిసింది అతడికి అమ్మాయిల పిచ్చి అని. లావుగా ఉన్నానని నన్ను దూరం పెట్టాడు.

Updated : 02 Jul 2024 21:35 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. ఆ తరవాతే తెలిసింది అతడికి అమ్మాయిల పిచ్చి అని. లావుగా ఉన్నానని నన్ను దూరం పెట్టాడు. గట్టిగా అడిగితే విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు. పెళ్లికాలేదని చెబుతూ ఆడపిల్లలతో తిరుగుతున్నాడు. ఆ విషయాన్ని వారికి తెలిసేలా చేస్తే... నాకు పిచ్చి అని చెప్పి వాళ్ల సానుభూతి పొందుతున్నాడు. అత్తమామలు నేను సరిగా కాపురం చేయకే తనలా తయారయ్యాడని నాపైనే నిందలేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? 

ఓ సోదరి

ప్రేమ గుడ్డిది అని చెప్పడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. ప్రేమించే ముందు అతడి గురించి ఏమీ తెలుసుకోలేదా? కుటుంబం, ఉద్యోగం, అలవాట్లు... వంటివి ఏమీ గమనించుకోలేకపోవడమే మీ పరిస్థితికి కారణం. సినిమా డైలాగులు చెప్పి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, ఆ బంధాన్ని మాత్రం నిలుపుకోవడం లేదు. మీ భర్తకి అమ్మాయిల వ్యసనం ఉందంటున్నారు. అందుకోసం మిమ్మల్ని పిచ్చిదానిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడనీ చెబుతున్నారు. ఇదంతా మానసిక హింసే. ఒకవేళ మీరు విడాకులు కావాలనుకుంటే క్రూరత్వాన్ని కారణంగా చూపించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13 ప్రకారం డివోర్స్‌కి దరఖాస్తు చేయొచ్చు. లేదూ భర్తతోనే కలిసి ఉండాలనుకుంటే గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేయండి. వారు డీవీసీ యాక్ట్‌ సెక్షన్‌ 12 ప్రకారం మీ ఫిర్యాదు పరిశీలించి కోర్టుకు పంపిస్తే మీకు తగిన సాయం అందుతుంది. ఆపై రక్షణ కల్పించమని(సెక్షన్‌ 18), ఇంట్లో నివసించే హక్కు(సెక్షన్‌ 19), పిల్లలకూ మీకూ జీవనభృతి(సెక్షన్‌ 20), పిల్లల కస్టడీ(సెక్షన్‌ 21), ఇన్నాళ్లూ మీరు పడ్డ మానసిక వేదనకు పరిహారం(సెక్షన్‌ 22) అడగండి. ఇవన్నీ కాదు... అతడికి కౌన్సెలింగ్‌ అవసరం అనుకుంటే ఫ్యామిలీ కౌన్సెలర్‌ దగ్గరకో, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకో వెళ్లండి. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకోసం అతడు ఏమైనా ఇవ్వగలడా? వారి రక్షణ కోసం తండ్రిగా ఏం చేయగలడు? వంటివన్నింటికీ కౌన్సెలింగ్‌ సెంటర్‌లోనే పరిష్కారం లభిస్తే... మీరు విడాకులు తీసుకున్నా ఫరవాలేదు. గడప దాటనంత సేపు మీ సమస్య ఓ కొలిక్కి రాదు. అయితే,  ఏ నిర్ణయమైనా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తీసుకోండి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్