శ్రీవారూ... ఇలా ఉంటారా మీరూ!

ప్రతి అమ్మాయికీ తల్లి అవ్వడం కొత్త అనుభూతే! పిల్లలను ఎత్తుకోవడం దగ్గర్నుంచి బాగోగులు చూసుకోవడం వరకూ అన్నీ మనం మాత్రం ముందే నేర్చుకుంటామా ఏంటి? క్రమంగా ఒక్కోటీ తెలుసుకుంటాం.

Updated : 03 Jul 2024 14:20 IST

ప్రతి అమ్మాయికీ తల్లి అవ్వడం కొత్త అనుభూతే! పిల్లలను ఎత్తుకోవడం దగ్గర్నుంచి బాగోగులు చూసుకోవడం వరకూ అన్నీ మనం మాత్రం ముందే నేర్చుకుంటామా ఏంటి? క్రమంగా ఒక్కోటీ తెలుసుకుంటాం. అదంతా మన బాధ్యతే అనుకుంటాం. కాబట్టే, మగవారికి పరిచయం అవ్వవు. తలనొప్పి అనో... కాస్త జ్వరంగా అనిపించో అలా పడుకుంటామా! ‘ఫలానాది ఎక్కడుంది?’, ‘పిల్లాడు ఏడుస్తున్నాడు...’, ‘పాపకి జడలెలా వేయాలి’... అంటూ శ్రీవారి నుంచి బోలెడు సందేహాలు వచ్చి పడతాయి. అవన్నీ తీర్చలేక ఓపిక లేకపోయినా లేచి మనమే చూసుకుంటాం. అలా లేచే వీలూ లేకపోతే ఏమవుతుంది? శ్రీవారి విసుగుతో కూడిన మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అవును మరి... ఏమాత్రం పరిచయం లేని పనులు ఒక్కసారే చేయాలన్నా వాళ్లకీ చిరాకే! అందుకే వాళ్లకీ వాటిని నేర్పించాలి. ఇదే ఆలోచించాడు జువాన్‌ డేవిడ్‌. మగవారికి ఇవన్నీ నేర్పించడానికి ‘కేర్‌ స్కూల్‌’ ప్రారంభించాడు. దీనిలో ఒకటీ రెండూ కాదూ ఇంటిపనులు, పిల్లల పెంపకానికి సంబంధించి 101 పనులను నేర్పిస్తారు.

ఆలోచన ఎలా?

కొవిడ్‌లో ఎలా జీవించాం? స్కూళ్లు, ఆఫీసుల్లేవు. అంతా ఇంట్లోనే! అందరికీ ఎంతో కొంత విశ్రాంతి దొరికినా మహిళలకు మాత్రం శ్రమ పెరిగింది. ఇక ఉద్యోగినుల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఇంటి పనులు, పిల్లల చదువులు, పెద్దవాళ్ల బాగోగులకు తోడు ఉద్యోగ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొందరు ప్రాణాలూ కోల్పోయారు. అమెరికాలోనూ ఇదే పరిస్థితి. ఆ సమయంలో పిల్లలను ఎలా చూసుకోవాలో, వాళ్లతో ఎలా గడపాలో తెలియక ఎంతోమంది మగవాళ్లు ఒత్తిడికి లోనయ్యారట. అది గుర్తించే డేవిడ్‌ ఈ స్కూల్‌ని ప్రారంభించాడు. యూనివర్సిటీ విద్యార్థులే కాదు ఉద్యోగులు, వ్యాపారస్థులైన మగవాళ్లు మొత్తం 1.6లక్షల మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ల్లో ఈ శిక్షణ తీసుకున్నారు. డైపర్‌ ర్యాష్‌ నివారణ పద్ధతులు, బాత్రూమ్‌కి వెళితే కడగడం, జడలు వేయడం, హోమ్‌వర్క్‌ చేయించడం వంటివే కాదు మహిళల భావోద్వేగాలను గమనించుకోవడం, వాళ్ల బాధ్యతలు పంచుకోవడం వంటి లింగ సమానత్వ పాఠాలకూ అందులో చోటిచ్చాడు. ఇంటిపనులు ఆడవాళ్లవి, బయటి బాధ్యతలు మగవాళ్లవి అనే సిద్ధాంతానికి తను వ్యతిరేకమంటాడు డేవిడ్‌. అందుకే కాలేజీ స్థాయి నుంచే మగవాళ్లని సిద్ధం చేస్తున్నానంటాడు. ఇదంతా చదివాక ఇలాంటి స్కూలు మన దగ్గరా ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది కదూ! డేవిడ్‌ మాత్రం నిజానికి మహిళలు నోరు విప్పి తమ ఇబ్బందిని చెబితే ఈ మార్పు ఎప్పుడో మొదలయ్యేది అంటాడు. అలాగే ‘మీ అమ్మ, భార్యలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, అలా మారడానికి ప్రయత్నించ’మన్న సలహానిస్తున్నారు. ఏమండోయ్‌ శ్రీవారూ... మరి ప్రయత్నిస్తారా మీరూ? 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్