పడేయొద్దు... వాడేద్దాం!

కూర నచ్చలేదట... రాత్రి మిగిలిపోయింది... కాడలు ముదిరిపోయాయి... ఇలా చెబుతూ ఎన్ని ఆహారపదార్థాలను చెత్తబుట్ట పాలు చేస్తుంటామో కదా? దీంతో డబ్బులు వృథానే కాదు, పర్యావరణానికీ హాని.

Published : 09 Jul 2024 01:34 IST

కూర నచ్చలేదట... రాత్రి మిగిలిపోయింది... కాడలు ముదిరిపోయాయి... ఇలా చెబుతూ ఎన్ని ఆహారపదార్థాలను చెత్తబుట్ట పాలు చేస్తుంటామో కదా? దీంతో డబ్బులు వృథానే కాదు, పర్యావరణానికీ హాని. మన బామ్మల కాలంలో చూడండి... ప్రతిదాన్నీ ఏదోరకంగా వాడేసేవారు. వాళ్లలాగే  మనమూ వంటింట్లో ‘జీరో వృథా’కి ఓటేద్దామా?

సాధారణంగా బీర, సొర, దోస, కీరదోసలను తొక్క తీసి వంట లేదా సలాడ్‌లకు వాడుతుంటాం. కానీ వాటి తొక్కల్లోనూ బోలెడు పోషకాలుంటాయి. ఈసారి వాటిని వేయించి రోటిపచ్చడిగానో... ఉప్పు, కారం, నిమ్మకాయ రసం చేర్చి సలాడ్‌గానో ప్రయత్నించి చూడండి. రుచికి రుచీ వృథా కూడా తగ్గుతుంది. కూరగాయలు పండినా, ముదిరినా ఇలా ప్రయత్నించొచ్చు. దొండకాయ పండితే టొమాటో చేర్చి రోటిపచ్చడి చేయొచ్చు. ముదిరిన వంకాయలే కాదు క్యాలీఫ్లవర్, క్యాబేజీ కింద గట్టిగా ఉండే కాడలూ నిల్వ పచ్చడికి బాగుంటాయి. కాస్త ఆలోచించాలేగానీ కొత్త రుచులు పుట్టుకొచ్చేస్తాయి.

  •  కాడలూ పనికొస్తాయ్‌

కొత్తిమీర ఆకులను వాడి, కాడలను పడేస్తుంటాం కదా! వాటినీ పులుసులు, చారుల్లో కత్తిరించి వేయండి. వంటకాలు సువాసనలు వెదజల్లుతాయి. ఇదంటే సరే! ముదిరిన ఇతర ఆకుకూరల కాడలనేం చేస్తామంటారా? ఓ పొడవైన పాత్రలో నీరుపోసి ఉంచడమో, మట్టిలో గుచ్చడమో చేస్తే సరి. కొత్త చిగుళ్లు పుట్టుకొస్తాయి. తిరిగి తాజా ఆకులను వాడుకోవచ్చు.

  • దాచేప్పుడే చూసుకుంటే...

పురుగు పట్టాయనో, పదార్థాలు పాడయ్యాయనో పడేస్తుంటాం. అదీ వృథానే! బియ్యం, పప్పులు వగైరా పోసే డబ్బాలను తడిలేకుండా తుడుచుకోవాలి. ఆపై వాటిల్లో బిర్యానీ ఆకులు, వేపాకులు వేస్తే పురుగులు పట్టవు. ఆకుకూరలను గాలి చొరబడని డబ్బాలో టిష్యూ వేసి ఉంచితే పాడవవు. డెయిరీ పదార్థాలు, గుడ్లు వంటివి ఎప్పటికప్పుడు తాజాగా వాడేస్తుంటే పాడయ్యే ప్రమాదం ఉండదు. కూరగాయలు ఎక్కువగా ఉంటే చక్రాల్లా కోసి, ఎండబెట్టుకున్నా, ప్యూరీ రూపంలో భద్రపరుచుకున్నా భవిష్యత్తులో వాడుకోవచ్చు.

  • పండిపోయాయా?

పండ్లు ఎక్కువ రోజులు రావాలని కాస్త పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవడం మనలో చాలామందికి అలవాటు. తీరా అవి ఒకేసారి పండిపోతాయి. బాగా మగ్గాయనో, కుళ్లాయనో పడేస్తుంటాం. అరటిపండ్ల తొడిమలను పాలిథీన్‌ కవర్‌తో చుట్టండి. త్వరగా పాడవవు. పండిన వాటిని రోజూ చెక్‌ చేసుకొని తిన్నా చాలావరకూ సమస్య ఉండదు. పోనీ ఎక్కువగా ఉన్నాయనుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ముందే ఫ్రిజ్‌లో పెడితే సరి. సలాడ్, కస్టర్డ్, కేకుల తయారీలో భాగం చేసుకుంటే వృథా కావు.

  •  పండ్ల తొక్కలూ...

బంగాళదుంప, పచ్చి అరటి తొక్కలను కాస్త కండ ఉండేలా కోసుకొని, నూనెలో వేయించుకుంటే చిప్స్‌లా తినొచ్చు. ఉల్లిపొట్టును నూనెలో మరిగిస్తే కురులకు ఔషధంగా మారుతుంది. పండ్ల తొక్కలూ పనికొస్తాయని తెలుసా? అరటి తొక్కలతో సింక్, కిటికీలు, ట్యాపులు రుద్ది, తరవాత నీటితో కడగండి. తళతళా మెరుస్తాయి. నిమ్మ, నారింజ తొక్కలను ఎండబెట్టి ఫేస్‌ ప్యాక్‌ల్లో భాగం చేసుకోవచ్చు. సన్నగా తరిగి భద్రపరుచుకుంటే మిఠాయిల్లో ఫ్లేవర్లుగానూ పనికొస్తాయి.

  • అది చూసుకుంటే...

తగ్గినా పర్లేదు కానీ వృథా కావొద్దు... ఏదైనా వండేటప్పుడు ఈ నియమం పాటించండి చాలు. ఏదైనా నచ్చకపోయినా, మిగిలిపోయినా వాటిని తిరిగి ఎలా ఉపయోగించొచ్చో ఆలోచించండి. కూరలు మిగిలితే పరాటాల్లోకి స్టఫ్‌గా, సూపులు, సమోసా, శాండ్‌విచ్‌ల్లో భాగంగా వాడండి. అన్నాన్ని భిన్న ఫ్లేవర్లతో అల్పాహారానికి ఉపయోగించండి. చపాతీలు మిగిలితే ముక్కలుగా చేసి కూరగానో, పాలతో కలిపి స్వీట్‌గానో చేస్తే సరి. ప్రతిదానికీ మార్గం ఉంటుంది... ప్రయత్నించాలంతే! కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఉపాయం తట్టదు. లేదా పాడైపోతాయి. అలాంటివాటిని ఓ డబ్బా పెట్టుకొని కంపోస్టుగా మార్చండి. మొక్కలకి ఎరువు, జీరో వృథా. కుటుంబ ఆరోగ్యమే కాదు... చుట్టూ పరిసరాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యతా మనమీద ఉంది. ఇంటి నుంచే వృథా తగ్గిస్తే... చాలావరకూ ప్రకృతికి మేలు చేసినట్లే. మరి... ప్రయత్నించి చూద్దామా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్