వాకిట్లో... జాజిపూల వాన..!

నిన్నమొన్నటివరకూ సుగంధాలు వెదజల్లే మల్లె పొదలు వర్షాలు పడటం మొదలు కాగానే ఒక్కసారిగా పూయడం మానేస్తాయి. దాంతో చాలామంది ఏడాదంతా మల్లెలు పూస్తే ఎంత బాగుంటుందో అనుకోవడం సహజం.

Updated : 11 Jul 2024 13:27 IST

నిన్నమొన్నటివరకూ సుగంధాలు వెదజల్లే మల్లె పొదలు వర్షాలు పడటం మొదలు కాగానే ఒక్కసారిగా పూయడం మానేస్తాయి. దాంతో చాలామంది ఏడాదంతా మల్లెలు పూస్తే ఎంత బాగుంటుందో అనుకోవడం సహజం. అందుకేనేమో ఈ వానల్లో విరబూసిన విరజాజులతో పలకరిస్తుంది ప్రకృతి సుందరి.

రుమల్లెల్ని మరిపించే మధురమైన పరిమళంతో విరిసే విరజాజి పూలను ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ఈ వాసన మనసును సేదతీరుస్తూ ఉత్సాహభరితం చేస్తుంది. అందుకే ఇప్పుడు వాటిని సైతం బాల్కనీ కుండీల్లో పెంచుకునేలా డ్వార్ఫ్‌ మొక్కల్నీ విక్రయిస్తున్నారు. పైగా దీన్ని కత్తిరిస్తే మళ్లీ కొన్ని రోజుల్లోనే గుబురుగా పెరిగిపోతుంది. ముదురాకుపచ్చ ఆకుల్లోంచి సన్నగా చిన్నగా చొచ్చుకుని వచ్చే లేతాకుపచ్చ మొగ్గలు విచ్చుకుంటే మొక్కమీద నక్షత్రాలు పరిచినట్లుగా తెల్లని పూలతో ఎంతో అందంగా కనిపిస్తుంది. కాస్త సంరక్షణ చేయాలేగానీ ఏడాదంతా పూస్తూనే ఉంటుంది. కాకపోతే విరజాజి పూలు వర్షాకాలం ఎక్కువగా వస్తాయి. పూయడం ఆగిపోగానే ఒకసారి కొమ్మల్ని కత్తిరిస్తే మళ్లీ చిగురుతోపాటు మొగ్గలు వస్తుంటాయి. ఒక్క వేసవిలో తప్ప మిగిలిన కాలాల్లో నీటిని తక్కువగా పోస్తూ మధ్యమధ్యలో కొద్దిగా ఎరువును వేస్తూ ఎండ తగిలేచోట ఉంచితే సరిపోతుంది.

విరజాజి శాస్త్రీయనామం జాస్మినమ్‌ ఆరిక్యులేటమ్‌. దీన్నే కొందరు అడవి మల్లె అనీ పిలుస్తారు. పార్వతీదేవికి ఈ పూలు అంటే ఎంతో ఇష్టమనీ చెబుతారు. అందుకే శ్రావణ మాస పూజల్లోనూ వ్రతాల్లోనూ పూలమాలలతో దేవీదేవతల్ని అలంకరిస్తుంటారు. ఈ మొక్క అన్ని భాగాల్నీ ఆయుర్వేదంలో వాడతారు. వేళ్లతో చేసిన కషాయాన్ని మూత్రాశయ సమస్యలకూ, ఆకుల నుంచి తీసిన రసాన్ని చిగుళ్లు, దంతక్షయ నివారణకీ ఉపయోగిస్తారు. అన్నింటికన్నా ఈ పూలవాసన మనసును మరోలోకంలో విహరించేలా చేస్తుంది. మరి... పెంచేద్దామా జాజి మొక్కని!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్