Updated : 18/03/2021 02:51 IST

భరణం ఇవ్వాల్సి వస్తుందని ఉద్యోగం మానేశాడు!  

నా వయసు  ఇరవై ఏడేళ్లు. ఉద్యోగినిని. ఆరేళ్ల క్రితం మాకు పెళ్లయ్యింది. అతడు అనుమానంతో తరచూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటే తట్టుకోలేక రెండేళ్ల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాను. అప్పటి నుంచి వివిధ కారణాలతో వాయిదాలు కోరుతూనే ఉన్నాడు. ఒకవేళ డైవోర్స్‌ ఇచ్చినా... భరణం మాత్రం ఇవ్వనంటున్నాడు. తాను నిరుద్యోగినని, మెయింటెనెన్స్‌ ఇవ్వలేనని చెప్పడం కోసమే ఉద్యోగం కూడా మానేశాడు. కానీ తాత, తండ్రి నుంచి వచ్చిన స్థిర చరాస్తులు ఉన్నాయి. నాకేదైనా సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

ర్త నుంచి విడాకులు తీసుకునేటప్పుడు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌-25 ప్రకారం ఏక మొత్తంలో శాశ్వత భరణం అడగొచ్చు. సాధారణంగా భార్య ఉద్యోగం చేస్తూ, భర్త నిరుద్యోగి అయితే మెయింటెనెన్స్‌కి ఆమె అర్హురాలు కాదు. కాకపోతే అతడికి ఉద్యోగం లేకపోయినా ఆస్తులు ఉన్నాయని చూపించి శాశ్వత భరణం కోరవచ్చు. మీరు తెచ్చుకున్న పుట్టింటిధనం(కట్నం),వస్తువులు, బంగారం వంటివాటిని తిరిగి ఇప్పించమని కోరడంతో పాటు... మానసికంగా హింసించినందుకు, పెళ్లి తర్వాత మీరు నష్టపోయిన జీవితం... అన్నింటికీ కలిపి లెక్కగట్టి శాశ్వత భరణం ఇవ్వమనొచ్చు. అయితే భర్త ఆస్తిలో భాగం అడిగే హక్కు మాత్రం ఇప్పటిదాకా లేదు. విడాకులు, మెయింటెనెన్స్‌ కేసుల్లో భరణం పొందాలంటే ముందు మిమ్మల్ని మీరు పోషించుకోలేని స్థితిలో ఉన్నారని నిరూపించాలి. ఇద్దరూ కలిసి కొన్న ఆస్తులకు ఆధారాలు సమర్పించగలిగితే ఆస్తిలో భాగం అడిగి తీసుకోవచ్చు. ముందుగా  వీలైతే పరస్పర ఒప్పందం ద్వారా విడాకులు తీసుకోవడానికి ఒప్పించండి. అప్పుడు పెద్ద మనుషుల సాయంతో భరణం విషయంలో సెటిల్‌మెంట్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని