మీతో మీరుంటే విజయం తథ్యం

అమ్మాయిలు నలుగురిలో నిలబడి మాట్లాడటానికీ, చొరవ తీసుకోవడానికి, నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. దీనికి ఆత్మన్యూనతా కారణమే. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.

Published : 26 Aug 2021 00:55 IST

అమ్మాయిలు నలుగురిలో నిలబడి మాట్లాడటానికీ, చొరవ తీసుకోవడానికి, నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. దీనికి ఆత్మన్యూనతా కారణమే. దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.

డైరీ రాయండి... లక్ష్యసాధన వైపు అడుగులేసేటప్పుడు ముందుగా మీపై మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అతిగా ఆలోచించడం, లేదా ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనే భావాన్ని మనసులోకి రానీయకూడదు. ఆ రోజు ఏం పనులు పూర్తి చేయాలనుకుంటున్నారో డైరీలో పొందుపరచడం అలవాటు చేసుకోవాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తిరిగి వాటిని ఎంత వరకు పూర్తి చేయగలిగారో పరిశీలించుకోవాలి. పూర్తి కాలేదనే ఆలోచనకన్నా, మిగిలిన పనులను మరుసటి రోజు ఎలాగైనా పూర్తిచేయాలని అనుకోవాలి.

ఉత్తరం... ఆత్మవిశ్వాసం పెరగడానికి మీకు మీరే ఉత్తరం రాసుకోండి. అది మిమ్మల్ని మీకు మంచి స్నేహితురాలిని పరిచయం చేస్తుంది. ఇదొక మానసిక వ్యాయామంలానూ పని చేస్తుంది. దీనివల్ల ప్రతికూల ఆలోచనలను దూరమవుతాయి. రోజూ ఉదయాన్నే అద్దం ఎదుట నిలబడి మీ మనసులోని సంకోచాలు, భయాలను బయటికి చెప్పడం అలవరుచుకోవాలి. ఇది మీ ఆత్మనూన్యతను పోగొడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించగలనని మీతో మీరు చెప్పుకుంటూ ఉంటే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

స్ఫూర్తి... గొప్ప లక్ష్యాలను సాధించిన వారి గురించి చదువుతూ ఉండాలి. ఇవి స్ఫూర్తిని కలిగిస్తాయి. కష్టాలెన్నెదురైనా అనుకున్న పని పూర్తి చేసిన వారిని కలిసి వారి అనుభవాలను తెలుసుకోవాలి. ఇవన్నీ మిమ్మల్ని ఉత్సాహవంతంగా మారుస్తాయి.

పాఠాలు... మీరు పూర్తిచేసిన వాటిని అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉంటే, విజయమెంతో దూరం లేదనే భావన కలుగుతుంది. అది మిమ్మల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది. అంతవరకూ ఎదురైన ఛాలెంజ్‌లను పాఠాలుగా మార్చుకుంటూ... చిన్న చిన్న వాటిని లక్ష్యాలుగా అనుకుని వాటిని చేరుతుంటే, గెలుపు మీదే అవుతుంది. ఈ ప్రయాణంలో కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవడానికి క్రీడలు, పుస్తక పఠనం, చిత్రకళ వంటి అభిరుచులను అలవరుచుకుంటే మంచిది. ఇవన్నీ మానసికంగా దృఢంగా మార్చి, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్