Updated : 25/09/2021 05:05 IST

మనకు మధ్యవర్తిత్వమే మేలు!

భర్త వేధిస్తున్నా... పోలీసుస్టేషన్‌ గడప తొక్కడం ఇష్టం లేక మౌనంగానే భరిస్తోంది లలిత (పేరు మార్చాం). అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకోవాలనుకుంటోంది గీత (పేరు మార్చాం). కానీ చాలామంది కోర్టుల చుట్టూ తిరగలేరు. అలా వెళ్లి ఆర్థికంగా, మానసికంగా సతమతమవుతోన్న మహిళలెందరో! వీటన్నింటికీ మధ్యవర్తిత్వమే పరిష్కారమంటున్నారు హైదరాబాద్‌కి చెందిన అమికా మధ్యవర్తిత్వ కేంద్రం నిర్వాహకురాలు, సీనియర్‌ న్యాయవాది జ్యోతీరావ్‌...

మధ్య ఓ జంటకు సంబంధించిన ఇరవైయ్యేళ్ల కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ధర్మాసనం అతి తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా  పరిష్కరించింది. అమికా సంస్థ ద్వారా మేము కూడా ఇలానే వితంతు వదినకు ఆస్తి ఇవ్వనన్న మరిదికి చట్టాన్ని వివరించి... సంప్రదింపుల ద్వారా సమస్యను ఓ కొలిక్కి తెచ్చాం. ఓ జంట పెళ్లయిన ఏడాది నుంచే స్పర్థలతో ఉండే వారు. రెండేళ్లు అలా సాగాక విడాకులు తీసుకోవాలనుకున్నారు. వాళ్లను కూర్చోబెట్టి మాట్లాడితే ఏకమయ్యారు. భర్తమీద అలిగి పుట్టింటికి వెళ్లిపోయి కేసు పెట్టాలనుకుందో భార్య. తదనంతర పరిణామాలను గ్రహించి ‘అమికా’ సాయంతో సర్దుబాటు చేసుకుంది. ఇవే కాదు... ఓ ఇంటి పెద్ద చనిపోయారు. ఆస్తుల పంపకంలో కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లాలనుకున్నారు. వారూ మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకోగలిగారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం, ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవడం ఎవరికైనా కష్టమే. ఇలా మానసిక వ్యథకి గురైన ఎందరినో చూశా. పైగా వ్యక్తిగత విషయాలపై కోర్టుల్లో బహిరంగ వాదోపవాదాలు ఆడవాళ్లకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. నేను దిల్లీలో పని చేసినప్పుడు వందకుపైగా గృహ హింస కేసులు కేవలం మధ్యవర్తిత్వం ద్వారానే ఓ కొలిక్కి వచ్చాయి. అప్పుడు వచ్చిన ఆలోచనతోనే మధ్యవర్తిత్వ వేదిక ఏర్పాటు చేశాను.

మహిళల కోసం...  కుటుంబ వివాదాల్లో ఎందరో మహిళలు నిందితులుగా, బాధితులుగా మిగులుతున్నారు. దేశంలో పెండింగ్‌లో ఉన్న 3.93 కోట్ల కేసుల్లో చాలా మధ్యవర్తిత్వంతో పరిష్కారమయ్యేవే. ఈ పద్ధతిలో నాలుగ్గోడల మధ్య స్త్రీ గోప్యత, ఆత్మాభిమానం దెబ్బతినకుండా పరిష్కారమవుతాయి.

మధ్యవర్తిత్వ కేంద్రాలు రిజిస్టర్డ్‌ సొసైటీగా ఏర్పాటవుతాయి. సుప్రీంకోర్టు నియమావళికి అనుగుణంగా, హైకోర్టుల మీడియేషన్‌ కేంద్రాల ఆధ్వర్యంలో పని చేస్తాయి. మధ్యవర్తులు జాతీయ స్థాయిలో మీడియేషన్‌ అండ్‌ కన్సిలియేషన్‌ ప్రాజెక్ట్‌ కమిటీ (ఎంసీపీసీ) కింద కనీసం 40 గంటల శిక్షణ తీసుకుంటారు. మా కేంద్రానికి వచ్చే క్లయింట్లకి ముందు చట్టాన్ని వివరిస్తాం. ఇరు పక్షాలకూ ఆమోదయోగ్య మార్గాలను చెబుతాం. చర్చలు జరిపి, వారు ఒక నిర్ణయానికి వచ్చాక సెటిల్‌మెంట్‌ అగ్రిమెంట్‌ని రాసిస్తాం. దానిపై ఇరుపక్షాలూ, మధ్యవర్తులూ సంతకాలు చేస్తారు. దీనికి న్యాయస్థానం గుర్తింపు ఉంటుంది. ఈ కేంద్రాల్లో జరిగే చర్చలు, కక్షుల వివరాలు గోప్యంగా ఉంచాలి.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 320లోని మొదటి భాగంలో ఉన్న ఏ నేరాలైనా వీటిద్వారా ద్వారా రాజీకి రావొచ్చు. ఈ వేదికల ద్వారా వ్యాపార - ఆస్తి వివాదాలు, ఇరుగు పొరుగుతో తగాదాలు వంటివెన్నో సరిదిద్దుకోవచ్చు. వ్యక్తులతో, సంస్థలతో, ప్రభుత్వం వల్ల వివిధ వర్గాలకు ఉన్న వివాదాలు అన్నింటికీ రాజీ మార్గంలో పరిష్కారం చూపిస్తాయి. ఈ సేవలు అందించేందుకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ న్యాయవాదులున్నారు. అవకాశమున్నంత వరకూ మహిళలు మధ్యవర్తిత్వంతో వివాదాలను పరిష్కరించుకోవడం మంచిది.


30 ఏళ్ల అనుభవం...

న్యాయవాదిగా మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నాను. దిల్లీ లీగల్‌ ఎయిడ్‌ సర్వీసెస్‌లో అమికస్‌ క్యూరీగానూ ఉన్నా. రంగారెడ్డి జిల్లా కోర్టులో, తెలంగాణ హైకోర్టు, జాతీయ వినియోగదారుల ఫోరం, రాష్ట్ర కన్స్యూమర్‌ కోర్టుల్లో పనిచేశా. మా వారు పి. మాధవరావు ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో సీనియర్‌ ఇంటర్నేషనల్‌ అడ్వైజర్‌గా వివిధ దేశాల్లో విధులు నిర్వర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని