స్నేహితులుగా మారాలి...

రాధ కూతురు అముద యుక్త వయసులోకి అడుగు పెట్టడంతో తల్లితో మాటలు తగ్గించింది. చదువుపట్ల ఏకాగ్రత తగ్గడమే కాదు, ఒంటరిగా, నిరుత్సాహంగా కనిపిస్తోంది. ఈ తీరు రాధకు అందోళన కలిగిస్తోంది.

Updated : 10 Nov 2021 06:16 IST

రాధ కూతురు అముద యుక్త వయసులోకి అడుగు పెట్టడంతో తల్లితో మాటలు తగ్గించింది. చదువుపట్ల ఏకాగ్రత తగ్గడమే కాదు, ఒంటరిగా, నిరుత్సాహంగా కనిపిస్తోంది. ఈ తీరు రాధకు అందోళన కలిగిస్తోంది. ఈ వయసులో పిల్లల్లో కనిపించే మార్పులను గుర్తించాలంటున్నారు మానసిక నిపుణులు. వాటికి కారణాన్ని తెలుసుకొనే ఆవశ్యకత తల్లిదండ్రులకు ఉందని సూచిస్తున్నారు.

ప్రమాదం.. పదిపన్నేండేళ్ల వరకు అమ్మా నాన్నలకు నచ్చినట్లుగా ఉండే పిల్లలు యుక్త వయసులోకి వచ్చేసరికి కొత్తగా కనిపిస్తారు. స్నేహితులు, కాలేజీ ప్రభావం పలు మార్పులను తెస్తాయి. అమ్మానాన్నల సలహాలకు ప్రాముఖ్యత తగ్గిస్తారు. దీంతో పిల్లలు జవ దాటుతున్నారని పెద్దవాళ్లు భావిస్తారు. ఈ పరిస్థితి ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతుంది.

నమ్మకం... పిల్లలపై తల్లిదండ్రులు నమ్మకం ఉంచాలి. ప్రేమగా వ్యవహరించాలి. వారి ప్రవర్తనకు కారణాలను గుర్తించి, సున్నితంగా చర్చించాలి. వారి మనసు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, ఏదైనా సమస్య ఉంటే స్వేచ్ఛగా చెప్పగలిగేలా భరోసా ఇవ్వాలి. అది పిల్లల్లో పరిపక్వతను పెంచుతుంది. చదువు లేదా స్నేహాల ప్రభావం వారి ఆందోళనకు కారణమవచ్చు. పరిష్కారాన్ని తల్లిదండ్రులు అందిస్తారనే నమ్మకం కలిగించగలిగితే చాలు... ఇరువురి బంధం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆత్మస్థైర్యం... ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని చిన్నప్పటి నుంచే అలవరచాలి. చిన్న సమస్యకు కూడా అతిగా స్పందించి, నిస్సహాయతను ప్రదర్శించకుండా, తేలికగా పరిష్కరించగలిగే తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపెడుతుంది. ఇది ఎంతటి సమస్యనైనా జయించగలిగేలా వారిని తీర్చిదిద్దుతుంది.

స్నేహం.. పిల్లలు ఎదుగుతున్నప్పుడు పెద్ద వాళ్లు వారికి మంచి స్నేహితులుగా మెలగాలి. మనసులోని మాటను చెప్పే స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే ప్రతి అంశాన్నీ తల్లిదండ్రులతో పంచుకోగలుగుతారు. దీనివల్ల పలురకాల సమస్యలకు వారు దూరంగా ఉంటారు. చదువులోనే కాదు, జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్