Updated : 24/11/2021 05:46 IST

ఆఫీసు స్నేహాలూ అవసరమే

సహోద్యోగులతో అనుబంధాలు ఉండాలి. అప్పుడే ఆఫీసులో అలసట కలగదు. యాంత్రికత చోటుచేసుకోదు. ఆయా పనులు ఇష్టంగా, బాధ్యతగా చేయగల్గుతాం. ఉద్యోగంలో చేరీచేరగానే అందరూ స్నేహితులైపోరు. కొలీగ్స్‌తో ఎలా మెలగాలో కెరీర్‌ నిపుణులు చెబుతున్న సలహాలు చూడండి...

సాధ్యమైనంతవరకూ ఆఫీసుకు సమయానికి వెళ్లండి. ఈ క్రమశిక్షణ ఆఫీసులో గౌరవభావం కలిగించే తొలి అంశం. పనిలో నైపుణ్యాలు, సులువైన పద్ధతుల గురించి సీనియర్ల సలహాలు తీసుకోండి. వారి సహాయానికి కృతజ్ఞత చూపండి. పదేపదే అడిగితే విసుగు కలగొచ్చు. కనుక క్లిష్టమనిపించిన విషయాలను ఒకచోట రాసిపెట్టుకోండి.

మీదెంత కలుపుగోలు తత్వమైనా పరిచయం అవగానే సొంత విషయాలన్నీ చెప్పొద్దు, వారి గురించి కూడా ఆరా తీయొద్దు. కొన్ని రోజులు అందర్నీ గమనించండి. మీ మనసుకు సరిపోయే వాళ్లెవరో అర్థమవుతుంది. తోటి ఉద్యోగులు లేదా పై అధికారుల విషయంలో లోటుపాట్లు ఏమైనా గమనించినా వాటిని చర్చకు పెట్టొద్దు. అవి చిలవలు పలవలై మీమీద సదభిప్రాయం పోగొడతాయి.

అప్పగించిన పనిని వాయిదా వేయొద్దు. కాలయాపన చేయొద్దు. సక్రమంగా, సమయానికి పూర్తి చేయడమే కెరీర్‌లో ఎదుగుదలకు సోపానాలని మర్చిపోవద్దు.

అటెండర్‌ నుంచి ఆఫీసర్‌ వరకు ఎవరిమీదా చులకన అభిప్రాయాలు వద్దు. అందరితోనూ సౌమ్యంగా మాట్లాడండి. ఆ సద్గుణమే మీకు తోడునీడగా ఉండి మేలు చేస్తుంది. మీరు తోటివారిని మన్ననగా ఆదరించినట్లే మీ గౌరవానికి కూడా భంగం కలగకుండా చూసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని