Published : 26/12/2021 00:51 IST

పనిని ప్రేమిస్తేనే...

శిరీష టీం లీడర్‌గా ఉద్యోగంలో చేరింది. మొదటిసారి పైఅధికారిని కలవనుంది. ఏ ప్రశ్నలు ఎదురవుతాయో, ఏం సమాధానాలు చెప్పాలో అని ఆందోళన పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తను చెప్పే సమాధానాలే కెరియర్‌లో ఆమె అభివృద్ధిని నిర్దేసిస్తాయి అంటున్నారు నిపుణులు. బృందంతో కలిసి పని చేసే ఉత్తమ పద్ధతుల్ని తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. వాటిని పై వారికి సమర్థంగా వివరించాలి అంటున్నారు...

సత్ఫలితాలకు... ఉద్యోగంలో నెలకు 160 గంటలు సహోద్యోగులు, బృందంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి దాదాపు 2000 గంటలకన్నా ఎక్కువసేపు కాలం అన్నమాట. ఈ సమయాన్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చుకోవాలంటే ముందుగా చేసే ఉద్యోగాన్ని ప్రేమించాలి. అక్కడి వాతావరణానికి తగినట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి.  ఒత్తిడి లేకుండా సునాయసంగా విధులు నిర్వర్తించేలా బృందాన్ని తయారు చేసుకోగలిగితే చాలు. ఎప్పటిపని అప్పుడు పూర్తవుతుంది.

గౌరవించి... బృందాన్ని గౌరవించాలి. సమాన సామర్థ్యాలు, నైపుణ్యాలు లేకపోయినా అందరినీ ఒకేలా గుర్తిస్తూనే, వెనుకబడిన వారిని ముందుకు నడిపించడానికి కృషి చేస్తుండాలి. ఎవరి నైపుణ్యానికి తగినట్లుగా వారికి పనులు కేటాయిస్తే వేగంగా పూర్తి అవుతాయి. అయితే ప్రతి విభాగం గురించి బృందంలో ప్రతి ఉద్యోగికి కాస్తో కూస్తో అవగాహన ఉండాలి. అత్యవసరానికి ఏ బాధ్యతనిచ్చినా చక్కగా పూర్తిచేయగలిగేలా బృంద సభ్యులను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రాజెక్టు వర్క్‌ వెనుకబడదు. ఇటువంటి ఆలోచనలను చెప్పడమే కాదు, వాటిని కార్యాచరణలో ఎలా పెడుతున్నారో, ఫలితాలేంటో కూడా వివరించగలగాలి.

అనుసంధానంగా... ఉద్యోగులకు మేనేజ్‌మెంట్‌కు అనుసంధానంగా టీమ్‌ లీడర్‌ ఉండాలి. చేపట్టాల్సిన బాధ్యతలకు సంబంధించి ప్రతి అంశాన్నీ ఉద్యోగికి తెలియజేయాలి. పని తీరుపై అభిప్రాయం నుంచి ప్రశంసల వరకు వారికి అందజేస్తుండాలి. అప్పుడే తామే స్థాయిలో ఉన్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. వెనుకబడిన వారిలో ప్రోత్సాహాన్ని నింపి అందరితోపాటు వారినీ నడిపించే సామర్థ్యం టీమ్‌లీడర్‌కు ఉండాలి. చిన్న విభాగం కూడా సంస్థ ఎదుగుదలలో భాగస్వామ్యం వహిస్తుందనే అవగాహన ఉద్యోగుల్లో కల్పించగలగాలి. ఈ తరహా ఆలోచనలు పై అధికారికి చెప్పినప్పుడు మీపై భరోసా కలిగే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని