Updated : 02/02/2022 06:23 IST

పురోగతి.. సూత్రాలివీ!

ఉద్యోగం ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాదు, కొండంత ఆత్మస్థైర్యాన్నిస్తుంది. అంతకుమించి సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. ఇక ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తే ఆ అనుభూతికి మాటలే లేవు. అలాంటి పురోగతి కోసం ఈ సూత్రాలు పాటించి చూడండి...

ఉద్యోగినులు అన్ని పనులూ చక్కబెట్టుకోవాలంటే కష్టం కాబట్టి కొన్ని బాధ్యతలు భర్త, పిల్లలకు అప్పగించాలి. లేదంటే ఒత్తిడి, అలసట అధికమవుతాయి. వాళ్లకీ మొదట చేతకాకున్నా క్రమంగా అలవాటవుతుంది.

‘ఆడవాళ్లు మీకేం చేతనవుతుందిలే’ అంటూ గేలి చేసేవారితో వాదవివాదాలు వద్దు. మీ పనితీరే వాళ్లకి సమాధానం చెబుతుంది.

ఉద్యోగం మొక్కుబడిగా చేయొద్దు. శాయశక్తులా కష్టపడండి. సాధ్యమైనంత నేర్పుగా చేయండి. వెంటనే గుర్తించాలనుకోవద్దు. ఈరోజు కాకపోతే రేపు మీ నైపుణ్యానికి గుర్తింపు తప్పకుండా వస్తుంది.

ఎంత సమర్థంగా చేస్తున్నా ఒక్కోసారి ఆశించిన ఫలితం రాదు. అడ్డంకులూ అవరోధాలూ ఎదురవ్వొచ్చు. నడుస్తున్న దారిలో ముళ్లూ రాళ్లూ ఎదురైనంతలో డీలాపడం కదా! వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తాం. ఉద్యోగమైనా అంతే.

తమకు అవకాశం రాలేదన్న ఉక్రోషంతోనో, తమకంటే బాగున్నారనే ఈర్ష్యతోనో సహోద్యోగులెవరైనా ఇబ్బంది కలిగిస్తే కుంగిపోవద్దు. జీవితమే పోరాటం. ఉద్యోగం మినహాయింపు కాదు.

పురుషులతో పోలిస్తే మహిళలకు ఇంటిబాధ్యతలు ఎక్కువ. కుటుంబం పేరు చెప్పి ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరు కావద్దు. అది మీపట్ల సదభిప్రాయాన్ని పోగొడుతుంది.

ఇంటాబయటా కష్టపడుతూ శారీరకంగానో మానసికంగానో ఇబ్బందిగా ఉంటే రెండు రోజులు సెలవు పెట్టండి. అంతేతప్ప ఉద్యోగం మానేయడం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. ఆందోళన, ఒత్తిళ్లను కొనితెచ్చుకోవద్దు. విరామం, విశ్రాంతి అన్నిటినీ సర్దుబాటు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని