Updated : 05/02/2022 04:09 IST

ముఖ్యమైనవి మర్చిపోతున్నారా..

జీవనసరళిని తేలికచేసే సదుపాయాలూ సౌకర్యాలూ ఎన్ని ఉన్నా ఉద్యోగినులైన మహిళలు క్షణం తీరిక ఉండటంలేదని బాధపడుతున్నారు. ఉరుకులూ పరుగుల జీవితం.. పర్యవసానం ఒత్తిడి, ఆందోళన.. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. దాంతో ముఖ్యమైన సంగతులు కూడా మర్చిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయా విషయాలు గుర్తుంచుకోవడానికి కొన్ని తేలికైన మార్గాలు..

* వంట చేసేటప్పుడు పెసరపప్పు అయిపోయిందనో, సగ్గుబియ్యం కొన్నే ఉన్నాయనో గుర్తించినప్పుడు తెప్పించాలనుకుని మర్చిపోవడం సాధారణం. నెల నెలా తేవాల్సిన సరంజామా జాబితాలో ఆ వివరాలు వెంటనే చేర్చేస్తే ఆనక ఇబ్బంది ఉండదు.

* కుటుంబసభ్యుల పుట్టినరోజులు అసలే మర్చిపోయినా.. చివరి క్షణంలో గుర్తొచ్చినా ఇబ్బందే! కొత్తబట్టలు కొనడం, వేడుక ఏర్పాటు చేయడం యాతనవుతుంది. ఇలాంటివి క్యాలెండర్‌లో లేదా డైరీలో రాస్తే ఎదురుగా కనిపిస్తుంటుంది. బంధుమిత్రుల పెళ్లిళ్లూ పేరంటాల్లాంటివి తేదీలు గుర్తుంచుకుంటే సెలవు పెట్టుకోవడం, కానుక కొనడం తేలికవుతుంది.

* పంచదార అనేక అనారోగ్యాలకు దారితీస్తుందని తెలుసు కదా! అందులో జ్ఞాపకశక్తి క్షీణించడం కూడా ఒకటి. ఇకనుంచైనా పంచదార వాడకం బాగా తగ్గించండి. ప్రత్యామ్నాయంగా బెల్లం లేదా తేనె వాడొచ్చు.

* రోజులో కాసేపు ధ్యానం చేయండి. రెండు రోజులు ప్రయత్నించినా మనసు నిలవడం లేదని అసలే మానేయొద్దు. నెమ్మదిగా అలవాటవుతుంది. మెడిటేషన్‌ వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

* వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యాలు చేసుకోవద్దు. ఇలాంటివి కూడా మతిమరపునకు కారణమవుతాయి.

* శారీరక ఆరోగ్యం బాగుండకపోయినా, నిద్రలేమితో బాధపడుతున్నా మతిమరపు పెరిగే అవకాశం ఉంది. కనుక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని